- కాస్త ధర పెంచి తూకంలో, తరుగు పేరుతో భారీగా మోసం
- జిసిసి నామమాత్రపు పాత్ర
- గిరి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి, పాడేరు టౌన్ విలేకరి : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో కాఫీ పంట కొనుగోలులో ప్రయివేటు వ్యాపారులదే హవా.ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో గిరిజన రైతులను దోపిడీ చేస్తున్నారు. గిరిజన సహకార సంస్థ (జిసిసి) ప్రకటించిన ధర కంటే దళారులు కాస్త ధర పెంచినా తూకంలోనూ, తరుగు పేరుతోనూ భారీగా మోసానికి పాల్పడుతున్నారు. దీంతో, గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గిరిజన గ్రామాల్లో ఎవరు ఏ ధరకు కాఫీ కొంటున్నారో చెప్పే మనుషులను స్థానికంగా దళారులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ధరకు కొంత పెంచి కాఫీ గింజలను కొనుగోలు చేస్తున్న వీరు ఎలక్ట్రానిక్ కాటాలో రైతులు పసిగట్టలేని మోసాలకు పాల్పడుతున్నారు. కిలో పార్చుమెంట్ కాఫీకి జిసిసి రూ.400 చెల్లిస్తుండగా, వ్యాపారులు రూ.20, రూ.30 పెంచి ఇస్తున్నారు. అదే సమయంలో ఎలక్ట్రానిక్ కాటాలో కాఫీ పరిమాణాన్ని బట్టి కనీసం ఐదు కేజీలు తక్కువ చూపేలా రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. ఒక తూకంలో ఐదు కేజీలకు రెండు వేల రూపాయలకుపైగా గిరిజనులు నష్టపోతున్నారు. తరుగు పేరిట మరో విధమైన దోపిడీ కొనసాగుతోంది. 70 నుంచి 80 కిలోల కాఫీ గింజల బస్తాపై తరుగు కింద 2 నుంచి 3 కిలోలను ప్రయివేటు వ్యాపారులు తీసేస్తున్నారు. ఆ రకంగా పది బస్తాలు పండించే రైతుకు సగటున 30 కిలోల తరుగుపోతోంది. ఆ లెక్కన రూ.12 వేలు నష్టతున్నారు.
ఈ ఏడాది ఏం జరుగుతోంది?
అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని 2023-24 కంటే 2024-25లో కాఫీ కొనుగోలు ధరను జిసిసి పెంచి చెల్లిస్తోంది. జిసిసి ధర ప్రకటించకముందే దళారులు రంగంలోకి దిగి తక్కువ ధరకు రైతుల నుంచి కాఫీ కొన్నారు. జిసిసి ధర గతం కంటే పెంచడంతో దళారులు కూడా కొంత పెంచి కొనుగోలు చేయడం ప్రారంభించారు. అయితే, పెంచిన ధర కంటే తూకంలో మోసం ద్వారా ఎక్కువ లాభం పొందుతున్నారు. అల్లూరి జిల్లా పాడేరు డివిజన్‌లోని 11 ఏజెన్సీ మండలాల్లో 2,46,139 మంది రైతులు 2,58,021 ఎకరాల్లో కాఫీ పండిస్తున్నారు. ఏడాదికి 16 వేల మెట్రిక్ టన్నులకుపైగా దిగుబడి వస్తున్నప్పటికీ జిసిసి కొనుగోలు వెయ్యి మెట్రిక్ టన్నులు దాటడం లేదు. పార్చుమెంట్ రకానికి పది శాతం, చెర్రీ రకానికి 10.5 శాతం తేమ మించకూడదని కొర్రీలు పెడుతుండడమూ ప్రయివేటు వైపు రైతులు వెళ్లేందుకు ఆస్కారమిస్తోంది.
ఏజెన్సీ కాఫీకి గిరాకీ ఉన్నప్పటికీ..
ప్రకృతి ప్రతికూలతలతో వియత్నాం, బ్రిజిల్‌లో కాఫీ దిగుబడి తగ్గడంతో మన ఏజెన్సీ కాఫీకి మంచి గిరాకీ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ ఆధారంగా 2024-25 (ఈ ఏడాది) కిలో అరాబికా పార్చుమెంట్ కాఫీకి రూ.400, అరాబికా చెర్రీ రకపు కాఫీకి రూ.250, రొబస్తా చెర్రీకి రూ.160 చొప్పున జిసిసి ధర నిర్ణయించింది. 2023-24 (గతేడాది)లో కిలో పార్చుమెంట్ కాఫీకి రూ.280, చెర్రీకి రూ.145, రొబస్తాకు రూ.70 చొప్పున చెల్లించింది. గతేడాది 565.90 మెట్రిక్ టన్నుల కాఫీని జిసిసి కొనుగోలు చేసింది. ఈ ఏడాది వెయ్యి మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయవచ్చని జిసిసి అంచనా వేసింది. ఈ క్రమంలో 2024 డిసెంబరు చివరి వారం నుంచి కొనుగోలు ప్రారంభించి ఈ ఏడాది మార్చి ఐదు నాటికి 542.754 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. 2022-23లో 996 మెట్రిక్ టన్నుల కాఫీని కొనుగోలు చేసింది. ప్రైవేట్ బ్యాపారుల దోపిడీ నుంచి గిరిజన కాఫీ రైతులను ఆదుకోవడం, జిసిసి కొనుగోళ్లు పెంచడం, అంతర్జాతీయ మార్కెట్ ధరలను బట్టి వాటిని పెంచడమూ అవసరం.