- 6 నెలలుగా జీతాలకు నోచుకోని కాంట్రాక్టు కార్మికులు
- 3 నెలలుగా అధికారులు, ఉద్యోగులదీ అదే పరిస్థితి
- 1385 రోజులుగా స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాటం
- కేంద్ర విధానంపై కూటమి పాలకుల మౌనం
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : అర్ధాకలి బతుకులు, కాలే కడుపులతో విశాఖ ఉక్కు కార్మికులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. విశాఖ ఉక్కును వంద శాతం ప్రైవేటీకరణ చేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటికి 1386 రోజులుగా కార్మికులు ఉక్కు రక్షణకు అలుపెరగని పోరాటాన్ని చేస్తున్నారు. వారిపై కేంద్రం, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎన్ని కుట్రలకు దిగినా వెరవలేదు. గడిచిన ఆరు నెలలుగా కాంట్రాక్టు కార్మికులకు జీతాల చెల్లింపులను స్టీల్ యాజమాన్యం నిలిపివేసింది. 14 వేల మంది కాంట్రాక్టు కార్మికుల (కుటుంబాలతో కలిపితే సుమారు 50 వేల మంది)పై ఆర్థిక భారాన్ని కేంద్రం, స్టీల్ యాజమాన్యం మోపుతున్నాయి. ఎగ్జిక్యూటివ్స్ (అధికారులు), పర్మినెంట్ స్టీల్ ఉద్యోగులుగా ఉన్న 12,500 మందికి మూడు నెలలుగా యాజమాన్యం జీతాలు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తోంది. అయినా, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పార్టీలు టిడిపి, జనసేనలకు ఏ మాత్రమూ పట్టడం లేదు. కేంద్రాన్ని అడిగే ధైర్యం లేక మౌనంగా ఉన్నారంటూ టిడిపిలోనూ దిగువ శ్రేణి నేతల్లో తాజాగా చర్చ జరుగుతోంది. గడిచిన కొన్నాళ్లుగా యాజమాన్యం ప్లాంట్‌లోని మూడు ఫర్నేస్‌ల్లో ఒకదాన్ని మూసివేయడం, కాంట్రాక్టు కార్మికులను నిలిపేసేందుకు వ్యూహం రచించడం, రెగ్యులర్ ఉద్యోగుల్లోనూ 2,500 మందిని నాగర్‌నార్ ప్లాంట్‌కు పంపాలన్న పన్నాగాలు పన్నడం, విఆర్‌ఎస్‌కు తలుపులు తెరవడం తెలిసిందే. వాటిలో కొన్ని కుట్రలను ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కార్మిక వర్గం, విశాఖ ప్రజానీకం తిప్పికొట్టారు. కొద్ది నెలలుగా కార్మికుల పొట్టలపై కొట్టాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. జీతాలివ్వకపోతే కడుపు మండి ఉద్యమాలు చేసే ఓపికలు తగ్గిపోయి ప్రైవేటీకరణకు అంతిమంగా అంగీకరిస్తారన్న కుట్రతో మోడీ సర్కారు ఇక్కడి యాజమాన్యానికి డైరెక్షన్ ఇచ్చి ఉండొచ్చన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్ స్థాపన వ్యవహారాన్ని కేంద్రం, అనకాపల్లి బిజెపి ఎంపి సిఎం.రమేష్ ఎగదోస్తూ ప్రజలను అటువైపు దారి మళ్లిస్తూ వైజాగ్ స్టీల్‌ను బలహీనపరిచే ఎత్తుగడ వేశారన్న చర్చ సాగుతోంది.
కార్మికుల్లేని ప్లాంట్ కోసమే కేంద్ర తాపత్రయం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల్లేకుండా ఖాళీ చేయించాలన్న తాపత్రయం కేంద్రంలో కనిపిస్తోంది. ప్యాకేజీ పేరుతో కేంద్రం ఇచ్చిన నిధుల ఖర్చు చూస్తే ప్లాంట్ ప్రైవేటీకరణకు అనువైన రీతిలోనే జరిగిందన్నది అర్థమవుతోంది. నెలకు పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులకు కేవలం రూ.80 కోట్లు జీతాలకు ఇవ్వాల్సి ఉండగా, ఒక్కపైసా ఇవ్వడానికి కూడా కేంద్రం అంగీకరించలేదు. రూ.500 కోట్లు ఇచ్చానని చెబుతున్నప్పటికీ దానిలో జిఎస్‌టి కిందే రూ.233 కోట్లును ఉక్కు యాజమాన్యం చెల్లించేసింది. రూ.150 కోట్లు విద్యుత్ బకాయిలకు ఇచ్చేసింది. మరో దఫా రూ.1,140 కోట్లు కేంద్రం ఇచ్చినా, ఈ మొత్తాన్ని బ్యాంకు వడ్డీ చెల్లింపులకు వినియోగించేశారు. ఒక్క రూపాయి కూడా జీతాల కోసం వెచ్చించలేదు. రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ సంస్థకు సిఫారసు చేసి ఛార్జీలు కట్టకుండా ప్లాంట్‌కు ఉపశమనం కలిగించాలని కార్మికులు విజయవాడ ఇటీవల వెళ్లి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. విశాఖపట్నం ఎంపీ సీటు, గాజువాక ఎమ్మెల్యే సీటు టిడిపికి ఇస్తే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేస్తామని, కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు 2024 ఎన్నికల్లో గెలుపు తర్వాత కన్నెత్తి చూడడం లేదు. తాజాగా ప్లాంట్‌లో నెలకొన్న పరిస్థితులపై సిఎం మౌనం దాల్చడాన్ని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.