అర్ధాకలితో మిడ్డే మీల్స్‌ కార్మికులు

Feb 16,2025 11:20 #Mid Day Meals, #mid day workers

పెరిగిన ధరలకు అనుగుణంగా పెరగని బడ్జెట్‌
అమలుకు నోచుకోని కనీస వేతనం శ్రీ రెండు నెలలుగా బిల్లుల బకాయిలు
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : విద్యార్థుల ఆకలిని తీర్చే మిడ్డే మీల్స్‌ కార్మికులకు మాత్రం అర్ధాకలితోనే జీవితాలను వెల్లదీస్తున్నారు. కనీస వేతనాలు అమలుకాకపోవడం, బిల్లులు సకాలంలో విడుదల చేయకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందనే తలంపుతో భారంగానే బతుకును ఈడుస్తున్నారు. పాలకులు మారుతున్నా కొత్త ప్రభుత్వాలు వస్తున్నా వీరి సమస్యలు మాత్రం ఎక్కడివేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉన్నాయి.
జిల్లాలో 980 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని మిడ్డేమీల్స్‌ కార్మికులు వండి పెడుతున్నారు. వీటిలో 706 ప్రాథమిక, 85 ప్రాథమికోన్నత, 189 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి వండి పెట్టడానికి అవసరమైన నూనె, పోపు గింజలు, పప్పు, ఉప్పు, చింతపండు, కూరగాయలు, వంట చెరకు తదితర సామగ్రి కోసం రూ.6, హైస్కూల్‌ విద్యార్థులకు రూ.9 ప్రభుత్వం చెల్లిస్తోంది. కనీసం ప్రాథమిక పాఠశాలలో రూ.10, హై స్కూల్‌ విద్యార్థులకు రూ.20 చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు. సోమ, బుధ, శుక్రవారాల్లో మూడు రోజుల పాటు ఉడకబెట్టిన కోడిగుడ్డును భోజనంలో వేయాల్సి ఉంది. రాగి జావ పంపిణీకి అదనపు అలవెన్సులను చెల్లించటంలేదు. మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా ఒక్కో విద్యార్థి కోసం ఇచ్చే నగదును మాత్రం పెంచడం లేదు. సబ్సిడీపై వంటగ్యాస్‌ అందించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పెడ చెవిన పెడుతోంది.

రాజకీయ జోక్యంతో ఇబ్బందులు
టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాహ్నా భోజన పథకం కార్మికులపై రాజకీయ వేధింపులు పరిపాటిగా మారాయి.కార్మికుల అక్రమ తొలగింపులు, పని ప్రదేశాల్లో ఇబ్బందులకు గురి చేయడం సర్వసాధారణంగా మారాయి. నాణ్యత తగ్గినా, కూరలు, పప్పులు సరిపోయినంత ఇవ్వకున్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాథమిక స్థాయి పిల్లలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం వంద గ్రాముల బియ్యం ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాల పిల్లలు అల్పాహారం తీసుకునే అలవాటు లేకపోవడం అందుకు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో మధ్యాహ్న భోజనంపైనే ఆధారపడుతున్నారు. అలాంటి విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న వంద, 150 గ్రాముల బియ్యం సరిపోవట్లేదు. అదనంగా ఎస్‌ఎంసి కమిటీ సభ్యులు అక్కడే భోజనం చేయడం ఫలితంగా కొన్నిచోట్ల భోజనం సరిపోవడం లేదు. ప్రభుత్వమే విద్యార్థులకు అవసరమైన బియ్యం సరఫరా చేస్తున్నా హమాలీ ఛార్జీలు మధ్యాహ్న భోజన కార్మికులే భరించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే మెస్‌ బిల్లుతో నాణ్యత విషయంలో రాజీ పడలేక ఇంటి నుంచి అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నామని మధ్యాహ్న భోజన కార్మికులు వాపోతున్నారు.

2 నెలలుగా బకాయిలు
జిల్లాలో 2 నెలలుగా కార్మికులకు బిల్లుల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రెండు నెలలుగా సొంత ఖర్చులతోనే కార్మికులు విద్యార్థులకు వండిపెడుతున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న భోజనం వండేందుకు ప్రభుత్వం గ్యాస్‌ సరఫరా చేయాలని, మెస్‌ ఛార్జీలు కాకుండా వంట సరుకులు కూడా సరఫరా చేయాలని కొన్నేళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. కట్టెల పొయ్యిపైనే వంట చేయడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల్లో అత్యధిక మంది అస్తమా, ఎలర్జీలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రభుత్వం వంట గ్యాస్‌ సబ్సిడీపై సరఫరా చేయాలని కోరుతున్నారు. ప్రతి నెలా మండల విద్యాధికారి జిల్లా అధికారులకు బిల్లును పంపగా అక్కడ నుంచి రాష్ట్ర ఫైనాన్స్‌ విభాగానికి వెళ్తాయి. నిధుల లభ్యతనుబట్టి మూడు, నాలుగు నెలలకొకసారి ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ డబ్బు చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వేతనాన్ని పెంచడంతో పాటుగా సరుకుల చార్జీలను పెంచాలని మధ్యాహ్న భోజన కార్మికులు కోరుతున్నారు.

➡️