- సాయంపై విడుదల కాని ఉత్తర్వులు
- అయినకాడికి అమ్ముకొని నష్టపోతున్న మిర్చి రైతులు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు యార్డులో మిర్చి ధరలు మరింత తగ్గాయి. అయినకాడికి అమ్ముకుని ఉసూరుముంటూ రైతులు ఇంటి బాటపడుతున్నారు. గత మూడు నెలలుగా ధరలు తగ్గిన నేపథ్యంలో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకం (ఎంఐఎస్) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ప్యాకేజి రైతులకు ఇప్పటి వరకు అందలేదు. క్వింటాలు మిర్చి ధర రూ.11,781 కన్నా తగ్గితే కేంద్రం సాయం చేస్తుందని గత నెల 22న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. నెల రోజులుపైగా గడిచినా ఇందుకు సంబంధించిన విధివిధానాలు నేటికీ విడుదల కాలేదు. దీంతో, ఒక్క రైతుకు కూడా ఎంఐఎస్ అందలేదు. గత నెల రోజులుగా మిర్చి రైతులకు క్వింటాలుకు కనిష్టంగా రూ.9 వేలు, గరిష్టంగా రూ.13 వేలు లభిస్తోంది. గత నెల చివరి వారంలో స్వల్పంగా ధర పెరిగినా గత 15 రోజుల నుంచి ధర మరింత దిగజారింది. మిర్చి యార్డుకు రోజుకు లక్ష టిక్కిలకుపైగా సరుకు వస్తోంది. ఇందులో 80 నుంచి 90 శాతం సరుకుకు క్వింటాలుకు గరిష్ట ధర రూ.9 వేలు మాత్రమే వస్తోంది. పది నుంచి 20 శాతం సరుకుకు మాత్రమే రూ.13 వేల వరకు ధర పలుకుతోంది. అధికారులు మాత్రం కనిష్ట ధర రూ.9 వేలు తగ్గడం లేదని, గరిష్ట ధర రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు వస్తోందని ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. దీంతో, ప్రభుత్వం తాము ప్రకటించిన ధర కన్నా 10 నుంచి 15 శాతం ఎక్కువ ధర వస్తుందని, అందువల్ల మార్కెట్ ఇంటర్ వెన్షన్ పథకం అమలు చేయాల్సిన అవసరం లేదని భావిస్తోందని సమాచారం. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.11,781 కన్నా ధర తగ్గితే సంబంధిత తేడా సొమ్ము ఇస్తామని చెబుతున్నా ఇందుకు సంబంధించి ఎవరికి పరిహారం ఇవ్వాలి? దీనికి అర్హులు ఎవ్వరు అనే విషయంపై ఇంతవరకు అధికారుల వద్ద గణాంకాలు లేవు. ప్రధానంగా ఇ-క్రాప్ నమోదు చేసుకున్న రైతులు చాలా తక్కువగా ఉన్నారని చెబుతున్నారు. అంతేగాక మిర్చి సాగులో కౌలు రైతులు ఎక్కువగా ఉండడంతో వారికి ఇ-క్రాప్ నమోదు కాకపోవడం వల్ల వాస్తవ సాగుదారుడికి ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం వచ్చే సూచనలు కన్పించడం లేదు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో అన్ని పంటలకూ కలిపి ధరల స్థిరీకరణ నిధి రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో మిర్చి రైతుకు ఎంత కేటాయిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో 2024-25 వ్యవసాయ సీజన్లో 4,18,665 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇందుకు సంబంధించి 2,17,490 మంది రైతులు, కౌలు రైతులు ఇ-క్రాప్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ, యార్డుకు వచ్చే రైతుల్లో ఇ-క్రాప్ జాబితాల్లో ఉన్న వారు చాలా తక్కువగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. రైతులకు సాయం చేసే అంశంపై ఇంతవరకు అధ్యయనం, ఉన్నతాధికారుల పరిశీలన లేదు. దళారులు, ఎగుమతిదారులు కుమ్మక్కై ధరను తగ్గించేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యార్డుకు వస్తున్న సరుకు నాణ్యతగా లేదని, అధికంగా పురుగు మందులు వినియోగిస్తున్నారని, తేమ శాతం అధికంగా ఉంటోందని, కాయ సైజు పెరగలేదని వంకలు చెబుతున్నారు. అయితే, యార్డుకు రోజుకు లక్ష, ఆ పైగా టిక్కిలు వచ్చినా కొనుగోలు చేస్తున్నారు. ధర తగ్గించి కొనుగోలు చేసి రెండు నెలల తరువాత అన్‌సీజన్‌లో ధరలు పెంచి విక్రయించుకునేందుకు సరుకును కోల్డ్ స్టోరేజీలకు వ్యాపారులు తరలిస్తున్నారు. పెద్దగా పట్టించుకోని ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు.