ఆర్థిక రుగ్మతలను పట్టించుకోని మోడీ

Mar 13,2025 07:33 #PM Modi, #Vikasit Bharat
  • తొందరపాటు నిర్ణయాలతో అనర్థాలు
  • నత్తనడకన హామీల అమలు
  • విమర్శకులు, ముస్లింలే లక్ష్యంగా ప్రతీకార చర్యలు
  • మరింత విస్తృతంగా తెర పైకి హిందూత్వ అజెండా

న్యూఢిల్లీ : కేంద్రంలో బిజెపి నేతృత్వ ఎన్‌డిఎ ప్రభుత్వ విధానాలు ప్రత్యేకించి ఆర్థిక రంగాన చేపడుతున్న చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. కార్పొరేట్‌ మిత్రులకు దోచిపెట్టే విధానాలతో దేశ ప్రజల కొనుగోలు శక్తి క్రమేపి క్షీణిస్తూ మొత్తం ఆర్థిక వ్యవస్థే కునారిల్లుతోంది. ఇటీవల కాలంలో స్టాక్‌మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. ద్రవ్యోల్బణం రంకెలేస్తోంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. అంతిమంగా సామాన్య ప్రజానీకం భారాల మోతతో నానా అవస్థలు పడుతుంటే బిజెపికి సన్నిహితులైన క్రోనీ పెట్టుబడిదారులు కోటానుకోట్లకు పడగలెత్తుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు విప్లవాత్మకమైనవని ఆయన మద్దతుదారులు కీర్తిస్తూ ఉంటారు. కానీ అవి నిరాశాజనకమైన ఫలితాలనే అందించాయి. దేశంలో నిరుద్యోగిత రేటు 8.1 శాతానికి పెరిగింది. ముఖ్యంగా యువతలో నిరుద్యోగం చాలా భయానకంగా ఉంది. పెద్దల్లో నిరుద్యోగిత రేటుతో పోలిస్తే యువతలో పది శాతం అధికంగా ఉంది. మన దేశంలోని కార్మికుల్లో సుమారు సగం మందికి వ్యవసాయ రంగమే ఉపాధి కల్పిస్తోంది. అయితే ఈ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉంటోంది. స్థిరమైన ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఇది వేలెత్తి చూపుతోంది. నెల నెలా జీతాలు పొందే ఉద్యోగుల వాస్తవ వేతనాలు తగ్గుతుండగా కార్పొరేట్‌ లాభాలు కొండలా పెరిగిపోతున్నాయి.

తొందరపాటు నిర్ణయాలతో చేటు

ప్రజలకు ఆకస్మిక షాక్‌లు ఇవ్వడమంటే మోడీకి ఎంతో ఇష్టం. 2016లో పెద్ద నోట్ల రద్దు ఈ కోవలోనిదే. అయితే ఇలాంటి ఉదంతాలన్నీ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా నష్టపరిచాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాల వెనుక ప్రణాళికలను సరిగా రూపొందించు కోకపోవడం, అమలులో తొందరపాటు స్పష్టంగా కన్పించాయి. ఈ చర్యలతో చిరు వ్యాపారులు, అన్నదాతలు బాగా ఇబ్బందులు పడ్డారు. రిజర్వ్‌బ్యాంక్‌ నిర్దేశించిన మధ్యకాలిక లక్ష్యం నాలుగు శాతం కంటే వినియోగ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్‌ నుండి రికార్డు సంఖ్యలో పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఇంత జరుగుతున్నా మోడీ ప్రభుత్వం ఆర్థిక రుగ్మతలకు మూల కారణాలను కనుగొని వాటిని పరిష్కరించాల్సింది పోయి ప్రతీకాత్మక చర్యల పైనే దృష్టిని కొనసాగిస్తోంది.

హామీల అమలు ఎక్కడీ

ఎన్నికల ప్రచార సమయాల్లో మోడీ ఇచ్చిన హామీలకు లెక్కే లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో అమలు చేయనివే ఎక్కువగా ఉన్నాయి. దీంతో భారతీయులు నిరాశానిస్పృహలకు గురయ్యారు. 2022 నాటికి 100 స్మార్ట్‌సిటీలను నిర్మిస్తామని ఇచ్చిన హామీ అమలు నత్తనడక నడుస్తోంది. స్మార్ట్‌సిటీల నిర్మాణం ఇంకా ప్రణాళికల దశనే దాటలేదు. బడ్జెట్‌ కేటాయింపులు కూడా అరకొరగానే ఉన్నాయి. లేఔట్లు కూడా పూర్తి కాలేదు. ఇక 2019 నాటికి బులెట్‌ రైలు ప్రాజెక్ట్‌ కార్యరూపం దాలుస్తుందని అనుకున్నప్పటికీ అది పలు దఫాలుగా ఆలస్యమవుతూ వస్తోంది. దేశ ప్రజలందరికీ 2022 నాటికి నిరంతర విద్యుత్‌ అందిస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. అనేక ప్రాంతాలలో అధిక లోడ్‌ కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. గంగానదిని ప్రక్షాళన చేసే పని మాత్రం కొంత పురోగతి సాధించింది. అయితే ఇటీవల జరిగిన కుంభమేళా సందర్భంగా గంగానది నీటి నాణ్యతపై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు చెప్పిన పెదవి విరుపు మాటలు ప్రభుత్వ వాదనకు బలం చేకూర్చేలా లేవు. వీటన్నింటినీ గమనిస్తే మనకు అర్థమవుతున్నది ఏమంటే హామీల అమలు, సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టకుండా కేవలం ప్రచార ఆర్భాటాలకు, నిత్యం వార్తల్లోని వ్యక్తిగా నిలవడానికే మోడీ ప్రాధాన్యత ఇస్తున్నారు. హామీలను నెరవేర్చే సామర్ధ్యం మోడీకి ఉన్నదా అని చాలా మంది ప్రజలు ఇప్పుడు సందేహిస్తున్న పరిస్థితి కన్పిస్తోంది.

అంతరిస్తున్న ప్రజాస్వామిక విలువలు

సామాజిక, రాజకీయ అంశాలలో మోడీ పాలనను గమనిస్తే దేశంలో ప్రజాస్వామిక విలువలు అంతరించిపోతున్నాయని స్పష్టమవుతోంది. విమర్శకుల నోరు మూయించడానికి దేశద్రోహ చట్టాలను ప్రయోగించడం ఎక్కువైంది. 2010 నుండి ఈ తరహా కేసుల్లో చిక్కుకున్న 11 వేల మందిలో 65 శాతం మందిపై మోడీ ప్రభుత్వం ఏర్పడిన 2014 తర్వాతే అభియోగాలు నమోదు చేశారు. అసమ్మతికి కళ్లెం వేయడంతో ప్రభుత్వ చర్యలపై పార్లమెంటరీ పరిశీలన తగ్గిపోయింది. బిల్లులు పెద్దగా చర్చ లేకుండానే ఆమోదం పొందుతున్నాయి. అంతర్జాతీయంగా మన ఖ్యాతి మసకబారుతోంది. మైనారిటీలపై జరుగుతున్న దాడులు, మానవ హక్కుల సమస్యల విషయంలో మిత్ర దేశాల నుండి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు వివాదాస్పదమయ్యాయి. మైనారిటీల హక్కుల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి ఇవి అద్దం పడుతున్నాయి.

హిందూత్వ అజెండాయే శరణ్యం

దేశంలో మోడీకి ప్రజాదరణ క్రమేపీ తగ్గిపోతోంది. 2024లో పార్లమెంటరీ మెజారిటీకి బీజేపీ ఆమడ దూరంలో నిలవడమే దీనికి తార్కాణం. దీంతో ఆ పార్టీ మళ్లీ హిందూత్వ వాదాన్ని విస్తృతంగా ముందుకు తెస్తోంది. అయితే ఇది వ్యవస్థాగత వివక్ష, మత అసహనానికి దారి తీస్తోంది. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేయడం, హింస వంటివి నిత్యకృత్యమయ్యాయి. ముస్లింల ఇళ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. గో రక్షణ పేరుతో ముస్లిం మైనారిటీలపై దాడులు చేస్తూ హతమారుస్తున్నారు. మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని మత ప్రాతిపదికన ఎలా విభజిస్తోందో దీనిని బట్టి అర్థమవుతోంది. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ, దౌత్యపరమైన సవాళ్లను పరిష్కరించడంలో విఫలమవుతున్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా హిందూత్వపై ఆధారపడుతోంది. ఇలాంటి కీలక తరుణంలో 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.

➡️