ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి నిబంధనలు పెట్టకుండానే రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా పెట్టుబడి సాయంగా రూ.20 వేలు అందిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు పలు సభల్లో హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పైనే కావస్తున్నా నేటికీ రైతుల సంక్షేమంపై కనీసం పట్టించుకోవడం లేదు. సూపర్ సిక్స్ పథకాలు అంటూ ఉదరగొట్టిన సిఎం, డిప్యూటీ సిఎం హామీలపై ఇప్పుడు నోరు మెదపకపోవడం శోచనీయమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి సాయంపై కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంపై రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఎపిలో ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా పెట్టుబడి సాయంపై ప్రకటన చేశారు. సంక్రాంతి తర్వాత అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని ప్రకటించారు.జిల్లాలో ఈ ఏడాది 2.19 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో 2.12 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం అన్నదాతలను ఆదుకుంటుందని పాలకులు ప్రకటనలు ఇస్తున్నా ఆచరణలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. పంట పెట్టుబడి కోసం దళారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో చిక్కుకోకూడదనే ఉద్దేశ్యంతో రైతుభరోసా సాయం అందించామని గత ప్రభుత్వం చెప్పుకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం సాయంతో కలుపుకుని రూ.13,500 ఇచ్చేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాయంపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. దీంతో ఇప్పుడు చేయి చాచి అప్పులు అడిగే పరిస్థితిలోకి వెళ్ళాల్సి వచ్చిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్ల ప్రారంభంలోనే సొమ్ములు వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నా హామీ ప్రకారం ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి సాగు పనులు చేపడుతున్నారు. ఖరీఫ్ పూర్తయి, రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ అందించే సాయంపై కనీసం ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏటా మూడు విడతలుగా సాయం అందించగా ఈ ప్రభుత్వం నేటికీ ఊసెత్తకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలె త్తుతున్నాయి. ఇప్పటికే కేంద్రం రెండు విడతల్లో రూ.4 వేలు అందించగా దానితో సంబంధం లేకుండా ఇస్తామన్న రూ.20 వేలు ఎప్పుడు ఇస్తారని రైతులు స్థానిక ప్రజాప్రతినిధులను అడుగుతున్నారు. వాస్తవానికి కేంద్రం పిఎం కిసాన్ పేరిట మూడు విడతల్లో రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఈ పెట్టుబడి సాయం అందిస్తుండగా ఎపిలో మాత్రం పథకాల అమలుపై ఇంకా స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. అయితే అన్నదాత సుఖీభవ, రైతు భరోసా పథకాల అమలు కోసం పలువురు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం కౌలు రైతుల్లో ఒసిలకు పెట్టుబడి సాయాన్ని ఇవ్వలేదని, ప్రస్తుత ప్రభుత్వం కౌలు రైతులందరికీ ఎలాంటి నిబంధనలూ లేకుండా సాయం అందించాలని కోరుతున్నారు. పథకం విధి విధానాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
