మలేరియాకు మందుల్లేవ్‌!

  • పెరుగుతున్న కేసులు
  • నిలిచిన హెచ్‌డిఎస్‌ నిధులు
  •  పిహెచ్‌సిల్లో మందులకు వైద్యులదే చేతిచమురు
  •  నాలుగేళ్లు కావస్తున్నా పంపిణీ కాని దోమతెరలు

ప్రజాశక్తి- సీతంపేట (పార్వతీపురం మన్య జిల్లా) : పార్వతీపురం మన్యం జిల్లాను మలేరియా మందుల కొరత వేధిస్తోంది. గతేడాది ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డిఎస్‌) నిధులు ఆలస్యంగా పంపిణీ చేశారు. ఈ ఏడాది ఆ నిధులు కూడా రాలేదు. దీంతో, మలేరియా మందుల కొరత ఏర్పడింది. బయట మార్కెట్లో కూడా ఎసిటి, ప్రేమాక్వీన్‌ మందులు దొరకడం లేదు. ఒకవేళ ప్రముఖ నగరాల నుంచి మందులు తెప్పిస్తే, వైద్యులకు చేతి చమురు వదులుతోంది. ఇప్పటికే ఎపిడిమిక్‌ సీజన్‌ ప్రారంభమైంది. ఏజెన్సీలో మలేరియా జ్వరాలు మరోవైపు కుదిపేస్తున్నాయి. దీంతో, వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు యుపిహెచ్‌సిలు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది ఇప్పటివరకు 340 మలేరియా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సీతంపేట మండలంలో జనవరి నుంచి ఇప్పటివరకు 49 మలేరియా పాజిటివ్‌ కేసులు తేలాయి. దీనినిబట్టి మన్యంలో మలేరియా విజృంభణ ఎలా ఉందో అర్థమవుతోంది. నాలుగేళ్లకు ఒకసారి దోమతెరలు పంపిణీ చేయాల్సి ఉంది. నాలుగేళ్లు పూర్తి కావస్తున్నా ఇంకా దోమ తెరలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులకు ర్యాపిడ్‌ కిట్‌ ద్వారా పరీక్షించి మలేరియా పాజిటివ్‌ నమోదైతే, మరల స్లైడ్‌ ద్వారా పరీక్షిస్తారు. అప్పుడూ మలేరియా పాజిటివ్‌గా తేలితే ఆ నివేదిక కూడా జిల్లా కేంద్రానికి పంపించాలి. అప్పుడు జిల్లా కేంద్రం నుంచి మలేరియా మందులు రోగికి సరఫరా చేస్తున్నారు. లేదంటే, వైద్యులు సొంత డబ్బులతో మందులు కొనుగోలు చేసి రోగులకు ఇస్తున్నారు. అధికారులు మాత్రం అవసరమైతే ఆస్పత్రి అభివృద్ధి నిధులు వినియోగించాలని చెబుతున్నారు. కానీ, నిధులు ఈ ఏడాది పిహెచ్‌సిలకు రాలేదు. దీంతో, వైద్యులు ఏమీ చేయలేక సొంత నిధులు ఖర్చు చేస్తున్నారు.
గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే మలేరియా మందుల నిల్వలు ఉండేవి. ప్రస్తుతం స్లైడ్‌ ద్వారా మలేరియా పాజిటివ్‌ నిర్ధారణ అయితే జిల్లా మలేరియా కేంద్రం నుంచి మందులు వస్తున్నాయి. ర్యాపిడ్‌ ద్వారా మలేరియా నిర్ధారణ అయితే మాత్రం వైద్యులు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సిందే. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా మందుల కొరత వేధిస్తోంది. గతంలో ర్యాపిడ్‌ కిట్‌ ద్వారా మలేరియా పాజిటివ్‌ నిర్ధారణ అయినా మలేరియా మందులు రోగికి అందజేసేవారు. ప్రేమాక్వీన్‌, ఆర్ట్స్నెట్‌ (ఎసిటి).. ఈ రెండు రకాల మలేరియా మందులు లేవు . కేవలం క్లోరోక్లీన్‌ మందులు మాత్రమే ఉన్నాయి.

➡️