- రుణాల మంజూరులో ప్రభుత్వ నిర్లక్ష్యం
- అప్పుల పాలవుతున్న అన్నదాతలు
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి : ‘అర్హులైన కౌలు రైతులందరికీ రుణాలు అందించాలి. వడ్డీ వ్యాపారుల చేతిలో వారు చిక్కుకుపోకుండా చర్యలు తీసుకుంటాం’ అంటూ పాలకులు పదే పదే హామీలు ఇస్తున్నారు. కానీ ఆ హామీలు అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.. వైసిపి పాలనలో కౌలు రైతులు రుణాల కోసం పడరాని పాట్లు పడ్డారని, బ్యాంకు నుంచి రుణాలందక, కష్టకాలంలో సాయమందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూటమి నాయకులు చెప్పుకొస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా గత సర్కారు బాటలో తమ పయనం అన్నట్లుగా ఉంది.
కాకినాడ జిల్లాలో ఈ ఏడాది 2.19 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో 2.12 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. 1.50 లక్షల మంది రైతులు ఉండగా వీరిలో లక్ష మందికి పైగా కౌలు రైతులే వాస్తవ సాగుదారులుగా ఉన్నారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు ఈ ఏడాది 68,890 మందికి మాత్రమే కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా తీసుకుని 59,967 మందికి జారీ చేశారు. జిల్లాలో ప్రధానంగా వరి, చెరకు, పొగాకు, మొక్కజొన్న, అరటి, పామాయిల్ తదితర పంటలు పండిస్తారు. ఇందులో 80 శాతానికి పైగా కౌలు రైతులే ఉన్నారు. ఏటా పంట కోత, నూర్పిడికి వచ్చే నవంబరు, డిసెంబరు నెలల్లో తుపాన్లు, వాయుగుండాల ప్రభావంతో రూ. లక్షల్లో నష్టపోతున్నా ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు.
అరకొరగానే….
వాస్తవానికి ఖరీఫ్ సాగు మొదలైన వెంటనే రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. ఇప్పుడు రబీ పంట సాగులో ఉంది.దాదాపుగా అన్ని ప్రాంతాల్లో నాట్లు ప్రక్రియను పూర్తి చేశారు. అయితే బ్యాంకర్లు మాత్రం రుణాలు పూర్తిస్థాయిలో నేటికీ ఇవ్వని పరిస్థితి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అరకొర ఋణాలే ఇచ్చారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.35 నుంచి రూ.38 వేల వరకూ రుణాలు ఇవ్వాలని జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది రూ.275 కోట్లు రుణాల ఇచ్చేందుకు లక్ష్యంగా తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కేవలం 15,020 మందికి రూ.63.30 కోట్లు మాత్రమే ఋణంగా ఇచ్చారు.
ఇలా కౌలు రైతుల సంఖ్యకు, ఇస్తున్న గుర్తింపు కార్డులకు, వారిలో రుణం ఇచ్చే సంఖ్యకు ఎటువంటి సంబంధం ఉండడం లేదు. పాలకులు మాత్రం కౌలు రైతులపై అమితమైన ప్రేమ చూపిస్తున్నట్లుగా, ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నట్లుగా ప్రకటనలు ఇస్తున్నప్పటికీ వాస్తవ రూపంలో మాత్రం రుణాలు సక్రమంగా ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఏటా ఈ రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. భూ యజమాని అంగీకారం లేనిదే సాగుదారు హక్కు పత్రాలు (సిసిఆర్‌సి) లభించడం లేదు. ఈ కార్డులు లేక, ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేక కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. రుణాల కోసం ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది.
కౌలు రైతులందరికీ రుణాలు ఇవ్వాలి
కౌలు రైతులకు భూ యజమాని సంతకం నిబంధనను తొలగించి గుర్తింపు కార్డులు అందరికీ ఇవ్వాలి. కౌలు రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు, పంట నష్టపరిహారాలు, పంటల బీమా ఇవ్వాలి. దేవాలయ భూములను కౌలు చేస్తున్న కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, రుణాలు ఇవ్వాలి. భూమిలేని ప్రతి కౌలు రైతుకి రైతు భరోసా ఇవ్వాలి.
– వల్లు రాజబాబు, ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి.