నాన్‌’లోకల్‌’ రచ్చ

Apr 17,2024 03:31 #2024 elections, #TDP, #YCP
  • వలసొచ్చిన సిట్టింగ్‌లకు అందలం
  •  తిరుపతి జిల్లా రాజకీయ ముఖచిత్రం

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : తిరుపతి జిల్లాలో వైసిపిలో మెజార్టీ ‘సిట్టింగ్‌’లకే అవకాశమిచ్చారు. అయితే టిడిపి-జనసేన-బిజెపి కూటమి అభ్యర్థులకు సంబంధించి లోకల్‌, నాన్‌ లోకల్‌ రచ్చ బజారుకెక్కింది.. వలసొచ్చిన సిట్టింగ్‌లను అందలమెక్కించడంతో దాదాపు పదిరోజులపైనే ‘నాన్‌లోకల్‌’పై పెద్దఎత్తున విముఖత కనిపించింది. తిరుపతి, సత్యవేడుల్లో ఈ పరిస్థితి తీవ్ర స్థాయిలో ఉండగా, శ్రీకాళహస్తిలోనూ కొంతమేర ప్రభావం కనిపించింది.చివరికి అధినేతల జోక్యంతో అంతా సర్దుకున్నారు. కాంగ్రెస్‌ విషయానికి వస్తే ఆలస్యంగా అభ్యర్థుల ప్రకటన అనేది నియోజకవర్గ ప్రచారాల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఏదిఏమైనా అభ్యర్థుల ప్రచార హోరు మొత్తం ‘సంక్షేమం’ చుట్టూనే తిరుగుతోంది తప్ప ‘స్థానిక’ సమస్యలపై దృష్టి లేకపోవడం గమనార్హం.
తిరుపతి జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం ఉంది. సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు ఎస్సీ రిజర్వుడ్‌. తిరుపతి పార్లమెంట్‌ కూడా ఎస్సీ రిజర్వుడ్‌.
తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో 17,79,058 ఓట్లు ఉన్నాయి. వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థిగా మద్దిల గురుమూర్తి, కూటమి పొత్తులో భాగంగా బిజెపి నుంచి వి.వరప్రసాద్‌ బరిలో ఉన్నారు. ప్రస్తుతం గూడూరు వైసిపి సిట్టింగ్‌ వరప్రసాద్‌ కావడం గమనార్హం. కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ను ప్రకటించారు.
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో 2,98,239 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం చిత్తూరు వైసిపి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ. సీటు రాకపోవడంతో తిరుపతికి వలసొచ్చి కూటమి తరపున జనసేన నుంచి బరిలో నిలిచారు. ఇండియా వేదిక నుంచి సిపిఐ అభ్యర్థిగా పి.మురళి పోటీలో ఉన్నారు. వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ భూమన కరుణాకర్‌రెడ్డి తనయుడు భూమన అభినరురెడ్డి పోటీలో ఉన్నారు. తిరుపతి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈసారి టిడిపి పోటీలో లేకపోవడం ప్రథమం. ఈ ప్రభావం అసమ్మతి బుజ్జగింపు కార్యక్రమం అధినేతలకు దాదాపు పక్షం రోజులపైనే నడిచింది.
శ్రీకాళహస్తిలో 2,43,197 ఓట్లు ఉన్నాయి. వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ బియ్యపు మధుసూదన్‌రెడ్డి, టిడిపి నుంచి మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఇండియా వేదికగా కాంగ్రెస్‌ అభ్యర్థి పోతుగుంట రాజేష్‌నాయుడు బరిలో ఉన్నారు. పోతుగుంట రాజేష్‌నాయుడు గతంలో టిడిపిలో ఉన్న (లేట్‌) పోతుగుంట గురవయ్యనాయుడు ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. టిడిపి ఓట్లు చీల్చే అవకాశం ఉంది.
చంద్రగిరిలో ముగ్గురు పోటీలో ఉన్నారు. టిడిపి నుంచి పులివర్తి నాని రెండు దఫాలుగా పోటీ చేస్తూనే ఉన్నారు. వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి కనపర్తి శ్రీనివాసులు అలియాస్‌ వాసు పోటీలో ఉన్నారు. 3,89,016వేల ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి ఓట్లు చీల్చేది నామమాత్రమే. గతంలో అతను పోటీ చేయగా కేవలం ఐదువేల ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు.
గూడూరు నియోజకవర్గంలో 2,40,388 ఓట్లు ఉన్నాయి. టిడిపి నుంచి పాశం సునీల్‌కుమార్‌ పోటీలో ఉన్నారు. వైసిపి నుంచి మేరుగ మురళి బరిలో ఉన్నారు. ఇండియా వేదిక నుంచి వేమయ్య పోటీలో ఉన్నారు. గతంలో వేమయ్య గూడూరు మండల పరిషత్‌ అధ్యక్షులుగా పనిచేశారు. వైసిపి ఓట్లు చీల్చే అవకాశం ఉంది. మేరుగ మురళి పోటీలో ఉంటే వైసిపికి నష్టమని జగన్మోహన్‌రెడ్డి అభ్యర్థిని మార్చే యోచన ఉన్నట్లు సమాచారం.
సూళ్లూరుపేటలో 2,37,700 ఓట్లు ఉన్నాయి. సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ వైసిపి కిలివేటి సంజీవయ్య పోటీలో ఉన్నారు. టిడిపి నుంచి మాజీ ఎంపి నెలవల సుబ్రమణ్యం కుమార్తె నెలవల విజయశ్రీ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా తిలక్‌బాబు బరిలో ఉన్నారు. సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ అవినీతి అక్రమాల వల్ల టిడిపికి ఛాన్స్‌ ఉందని ప్రచారం. సత్యవేడు నియోజకవర్గంలో 2,14,500 ఓట్లు ఉన్నాయి. వైసిపి నుంచి నాన్‌లోకల్‌గా నూకతోటి రాజేష్‌ బరిలో నిలిచారు. వైసిపి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎగా ఉన్న ఆదిమూలం టిడిపికి వలసొచ్చి నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బాబు ఉన్నారు. బాబు క్రిష్టియన్‌ ఫాదర్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో 5 శాతం ఓట్ల తేడాతో వైసిపి గెలుపొందింది. ఈసారి 6 శాతం ఓట్లు కోల్పోనుంది.


వెంకటగిరి నియోజకవర్గంలో 2,39,240 ఓట్లున్నాయి. ఇక్కడ యాదవ సామాజికవర్గం ఓట్లు గణనీయం. చేనేత కార్మికులు అధికం. నియోజకవర్గం మొత్తం మీద 85శాతం బిసి సామాజికవర్గం ఓట్లు గణనీయం. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి పెద్ద కుమారుడు నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి బరిలో ఉన్నారు. మాజీ ఎంఎల్‌ఎ కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె కురుగొండ్ల లక్ష్మిప్రియ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని ఇక్కడ ప్రకటించలేదు. ఎక్కువమంది బిసి ఓటర్లు ఉండడంతో టిడిపికే అనుకూల పవనాలు.

➡️