సీజన్‌ ముగిశాక పరిశీలన..!

      అనంతపురం ప్రతినిధి : ‘దొంగలు పడ్డ ఆరు మాసాలకు కుక్కలు మొరిగాయి’ అన్న చందంగా ఉంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అయ్యాక రబీ కరువుపై కరువు బృందం వచ్చేందుకు సిద్ధమైంది. గతేడాది ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావంతో కరువు ఏర్పడింది. అదే కరువు రబీలోనూ కొనసాగింది. తీవ్ర వర్షాభావంతో పంటలు ఏ మాత్రం రైతుల చేతికందలేదు. ఇప్పటికే ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించింది. అనంతపురం జిల్లా వరకు 14 మండలాను కరువు మండలాలుగా ప్రకటించారు. అదే విధంగా సత్యసాయి జిల్లాలో రొద్దం మండలం ఒక్కటే కరువు మండలంగా ప్రకటించారు. రబీ సీజన్‌ పంట సమయంలో కరువు బృందం పర్యటించలేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్న సమయంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమయ్యాక బృందం పర్యటించనున్నట్టు ప్రకటన వెలువడింది.

రూ.36.86 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీకి ప్రతిపాదనలు

        అనంతపురం జిల్లాలో రబీలో ఏర్పడిన కరువుకు సంబంధించి పంటనష్టం అంచనాలను అధికారులు రూపొందించారు. దీని ప్రకారం మొత్తం 37,195 హెక్టార్లు పంటనష్టం జరిగినట్టు అంచనా వేశారు. ఇందులో పప్పుశనగ 34,303 హెక్టార్లలో పంటనష్టం జరిగింది. దీనికి రూ34.30 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీకి ప్రతిపాదనలు పంపించారు. మినుములు 274 హెక్టార్లకు రూ.27.43 లక్షలు, అలసందలు 3.21 హెక్టార్లకు రూ.32 లక్షలు నష్టం జరిగింది. పెసలు 55.84 హెక్టార్లలో పంటనష్టం జరిగింది. రూ.5.58 లక్షలు ఇన్‌పుట్‌ సబ్సిడీ ప్రతిపాదించారు. ఉలవలు 64.17 హెక్టార్లు పంటనష్టం జరిగింది. రూ.6.42 లక్షలు, జొన్న 2101.04 హెక్టార్లు రూ.1.78 కోట్లు, కొర్ర 0.47 ఎకరాలు, నాలుగువేలు, నువ్వులు 46.38 హెక్టార్లు, రూ.3.94 లక్షలు, తెల్లకుసుమ 49.39 హెక్టార్లు రూ.4.20 లక్షలు, పొద్దుతిరుగుడు 296.94 హెక్టార్లు, రూ.29.69 లక్షలు ఇన్‌పుట్‌ సబ్సిడీకి ప్రతిపాదించారు.

సీజన్‌ మారాక పంటనష్టం పరిశీలన ఎలా..?

         ప్రస్తుతం రబీ సీజన్‌ మారింది. మే ఆఖరు వారం నుంచి వర్షాలు పడుతున్నాయి. ఈ వారం రోజులుగా పడుతున్న వర్షాలు అంతటా పచ్చదనం కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో రబీ కరువు పంటనష్టం పరిశీలన ఎలా సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. వచ్చినా చూసేది ఏముంటుంది. అందే సాయం ఏ మేరకు అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి కేంద్ర కరువు బృందం పరిశీలన ఉంటుందని చెప్పడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

చంద్రశేఖర్‌ ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి

       కరువు మొత్తం పూర్తయ్యి సీజన్‌ మారిన తరువాత పరిశీలన జరిపి ఆదుకునేది ఏమింటుంది. ఇది రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. నష్టం జరిగినే సమయంలోనే పరిశీలన చేస్తే రైతుల కష్టాలు తెలుస్తాయి. ప్రభుత్వం ఇప్పటికైనా రబీ నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి రైతులకు పరిహారం అందించే చర్యలు తీసుకోవాలి.

➡️