మళ్లీ పాత ప్లాను…!

Jun 11,2024 07:50 #amaravati, #AP Capital
  • ‘రాజధాని’ అమరావతిపై నిర్ణయం
  • ప్రారంభమైన ప్రక్రియ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి నగర మాస్టర్‌ప్లానులో మళ్లీ మార్పులు జరగనున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం పాతప్లానునే అమలు చేయాలని నూతన ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఆర్‌డిఎ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా అందినట్లు సమాచారం. దీంతో ఈ దిశలో అవసరమైన ప్రక్రియను సిఆర్‌డిఎ అధికారులు ఇప్పటికే ప్రారంభిచినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే రెండు, మూడు రోజులుగా సిఆర్‌డిఎ అధికారులు రాజధాని ప్రాంతంలో విస్తృతంగా తిరుగుతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజే టిడిపి అధినేత, కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయమై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. తనను కలిసిన రాష్ట్ర ప్రభుత్వ, సిఆర్‌డిఎ అధికారులతో రాజధాని అంశం చర్చించిన ఆయన ఈ మేరకు దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం.

క్యాబినెట్‌ ముందుకు…!
గత ప్రభుత్వం ఖరారు చేసిన ప్లానును మార్చాలంటే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయాల్సిఉందని సమాచారం. దానికన్నా ముందు హైకోర్టులో పెద్ద సంఖ్యలో దాఖలై ఉన్న కేసులను పరిష్కరించుకోవాల్సిఉంది. వివాదాస్పదంగా మారిన ఆర్‌-5 జోన్‌పై రైతులు దాఖలు చేసిన పిటిషన్‌, దానిపై ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను వెనక్కి తీసుకోవాల్సిఉంది. రైతులు పెట్టిన అనేక కేసులను కూడా ఉపసంహరించుకోవాల్సిఉంది. వివాదాలన్నీ పరిష్కారమైన తరువాతే క్యాబినెట్‌ ముందుకు కొత్త ప్రతిపాదన పెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి కనీసం 90 రోజులు పడుతుందని అంటున్నారు. కోర్టు కేసులతో సంబంధం లేకుండా క్యాబినెట్‌లో తీర్మానం చేసి, దానినే ధర్మాసనానికి నివేదించవచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

గతంలో ఎం జరిగింది?
గతంలో టిడిపి ప్రభుత్వం ఆమోదించి అమలు చేసిన మాస్టర్‌ప్లానును వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మార్చిన సంగతి తెలిసిందే. కొత్తగా ఆర్‌ 5 జోన్‌ను వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికోసం గతంలో ఉన్న ప్లాన్లను చాలా వరకూ మార్పు చేసింది. రాజధానిలో ఇళ్లు ఇస్తామనే పేరుతో పెద్దఎత్తున మార్పులు చేర్పులు చే యడంతోపాటు రోడ్లనూ సమూలంగా మార్చేశారు. తక్కువ ధరకు ఇళ్లు ఇచ్చే పేరుతో ఆర్‌5 జోన్‌ ఏర్పాటు చేశారు. దీనికోసం 2020 మార్చి నాలుగోతేదీన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. అదే నెల 10వ తేదీన గెజిట్‌ కూడా విడుదల చేశారు. నిడమర్రు, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, మందడం, నవులూరు, బేతపూడి, కురగల్లు రెవెన్యూ పరిధిలో 900.97 ఎకరాలను ఆర్‌5 జోన్లోకి మారుస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు ప్రక్రియ ముగించేశారు. ఈ క్రమంలో వ్యక్తమైన అభ్యంతరాలను పట్టించుకోలేదు. దీనిపై రైతులు కోర్టును ఆశ్రయించారు. తాము ఇచ్చిన భూముల్లో చేపడతామన్న మాస్టర్‌ప్లానుకు విరుద్ధంగా ప్లానులో మార్పులు చేర్పులు చేస్తున్నారని పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు తొలుత ప్లానులో మార్పులు ఆపమన్నా అనంతరం ఇళ్లస్థలాలకు అనుమతి ఇచ్చి తుదితీర్పునకు లోబడి నిర్ణయం ఉండాలని తెలిపింది.

➡️