‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ – సమాఖ్య వ్యవస్థకే ముప్పు

 • ముదురుతున్న నిరంకుశ పోకడలు
 • ప్రజాస్వామ్య సదస్సులో వక్తలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ దేశ సమాఖ్య వ్యవస్థకే ముప్పు అని ప్రజాస్వామ్య సదస్సులో వక్తలు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై జాతీయ సదస్సు శని, ఆదివారాల్లో ఇక్కడి ‘ఇండియా హాబిటాట్‌ సెంటర్‌’లో జరిగింది. ఈ సదస్సులో రాజకీయ నేతలు, మేధావులు, విద్యావేత్తలు, పౌర సమాజ సమూహాల సభ్యులు, మానవ హక్కుల పరిరక్షకులు, మాజీ సివిల్‌ సర్వెంట్లు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు చర్చలు జరిగిన అనంతరం సదస్సు ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేందుకు వీలుగా అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ఈ తీర్మాన ప్రతులను అందజేశారు. ఈ సదస్సులో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షిద్‌, కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా, ఎండి యూసుఫ్‌, ప్రముఖ చరిత్రకారిణి ప్రొఫెసర్‌ రొమిల్లా థాపర్‌, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌, ప్రొఫెసర్‌ జయతి ఘోష్‌, రాధా కుమార్‌, ప్రొఫెసర్‌ ఎమెరిటా, ప్రొఫెసర్‌ జోయా హసన్‌, ప్రొఫెసర్‌ హసన్‌, ప్రొఫెసర్‌ బల్వీర్‌ అరోరా, ప్రొఫెసర్‌ విధు వర్మ, ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ మాజీ డైరెక్టర్‌ పులిన్‌ నాయక్‌, మాజీ ఐఎఎస్‌ అమితాభా పాండే, తదితరులు ఈ సదస్సులో మాట్లాడారు. దేశంలో నిరంకుశత్వ పోకడలు పెరిగిపోతుండడం పట్ల వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, మహిళలపై దాడులు , ఫాసిస్టు హిందూత్వ మూకల ఆగడాలు, రాజ్యాంగ హక్కుల హరణం, చట్టబద్ధమైన సంస్థలను నిర్వీర్యం గావించడం, సమాఖ్య వ్యవస్థకు తూటు పొడవడం, సామాజిక న్యాయం వంటి వాటిపై సదస్సులో కూలంకషంగా చర్చ జరిగింది. అనంతరం ఈ సదస్సు ఈ కింది సూచనలు చేసింది.

 • ‘భారతీయ న్యాయ సంహిత’, ‘భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్యం’ పేర్లతో తీసుకొచ్చిన మూడు బిల్లులను సమీక్షించాలి. అనుమానం ఆధారంగా అరెస్టులు చేసేందుకు, శాంతియుత నిరసనలను ఉగ్రవాద నిర్వచనం పరిధిలో చేర్చేందుకు ఈ బిల్లులు వీలు కల్పిస్తున్నాయని, అందుకే వీటిని తిరగదోడాల్సిన అవసరముంది.
 • ‘యుఎపిఎ’, ‘జమ్మూ కాశ్మీర్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌’ వంటి క్రూరమైన చట్టాలను రద్దు చేయాలి. ఆంతరంగిక ఘర్షణల పరిష్కారానికి సాయుధ బలగాలను వినియోగించడం ఆపాలి. పిడి యాక్ట్‌ను యుద్ధ పరిస్థితుల్లో తప్ప ప్రయోగించరాదని 1951లో కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలి.
 • ఎంఎస్‌పికి చట్టబద్ధమైన గ్యారెంటీ ఇవ్వాలి. ఇందుకు సంబంధించి స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫారసులను తు.చ తప్పక పాటించాలి. పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించాలి. పిడిఎస్‌, ఎండిఎంఎస్‌, ఐసిడిఎస్‌ కోసం విభిన్న ఆహార పంటలను సేకరించి, వాటికి కూడా ఎంఎస్‌పిని వర్తింపజేయాలి.
 • 1947కి ముందున్న ప్రార్థనా స్థలాల విషయంలో యదాతథ స్థితిని కొనసాగించాలని చెబుతున్న 1992 ప్రార్థనా స్థలాల చట్టానికి ప్రభుత్వాలు కచ్చితంగా కట్టుబడి ఉండాలి. జాతి, మతం, కులం, లింగం, వైకల్యం ప్రాతిపదికన విద్య, ఉపాధి కల్పన తదితర రంగాలలో పౌరుల పట్ల వివక్షకు తావు లేకుండా చూసేందుకు ఒక సమగ్ర చట్టాన్ని తీసుకురావాలి. బహుళత్వాన్ని పరిరక్షించేందుకు ఒక కమీషన్‌ను ఏర్పాటు చేయాలి. వివక్షాపూరిత సిఎఎని రద్దు చేయాలి.
 • స్వతంత్ర నిజ నిర్ధారణ బృందాలకు మద్దతు ఇవ్వాలి. ఈ నిజనిర్ధారణ బృందాలకు, మీడియా సంస్థలకు మధ్య సహకారం పెంపొందాలి. పార్లమెంటు కవరేజి, ప్రభుత్వ మంత్రిత్వ శాఖల రిపోర్టింగ్‌ స్వేచ్ఛగా నిర్వహించేందుకు వీలుగా మీడియాపై యాక్సెస్‌పై ఆంక్షలు తొలగించాలి.
 • ఎన్నికల సంఘం, సిబిఐ, ఇడి స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించాలి. అఖిల భారత న్యాయ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
 • 2011లో రూపొందించిన రాజకీయ పార్టీల (రిజిస్ట్రేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫైర్స్‌) బిల్లును అమలులోకి తీసుకురావాలి. ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రభుత్వ పెత్తనానికి ఆసరా కల్పిస్తున్న 2023 చట్ట సవరణను రద్దు చేయాలి. నియామక కమిటీలో ప్రభుత్వం నియమించే ప్రతినిధి స్థానే భారత ప్రధాన న్యాయమూర్తికి చోటు కల్పించాలి. ఎలక్టోరల్‌ బాండ్‌ విధానాన్ని ఎన్నికల సంఘం గట్టిగా వ్యతిరేకించాలి.
 • ఆర్టీఐని బలోపేతం చేయాలి. 2019-23లో ఆర్టీఐ చట్టానికి తీసుకొచ్చిన తిరోగమన సవరణలను రద్దు చేయాలి. లోక్‌పాల్‌, లోకాయుక్త చట్టాన్ని సవరించి, ఎంపిక కమిటీలో అతిపెద్ద పార్టీ నాయకుడిని చేర్చాలి. కేంద్రంలో లోక్‌పాల్‌తో సమానమైన ఫ్రేమ్‌వర్క్‌తో రాష్ట్రాలలో లోకాయుక్తలను ఏర్పాటు చేయాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరచడాన్ని అరికట్టాలి. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ వంటి చర్యలు భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బ తీస్తాయి గనుక ఇందుకు సంబంధించిన రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీని రద్దు చేయాలి.
 • రాష్ట్ర ప్రజలను వారిచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో సంప్రదించకుండా రాష్ట్రాల సరిహద్దులను మార్చకూడదు. తక్షణమే జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర హౌదాను పునరుద్ధరించి, ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలి.శ్రీ ముఖ్యమంత్రులతో సంప్రదించి మాత్రమే గవర్నర్‌లను నియమించాలి.
 • ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బిఎం యాక్ట్‌)ను పున్ణపరిశీలించాలి. రుణం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం అక్కర్లేకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3)ని సవరించాలి. రాష్ట్రాలకు అవశేష ఆర్థిక అధికారాలు ఉండాలన్న రాజమన్నార్‌ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలి.
 • మణిపూర్‌కు పార్లమెంటేరియన్లు, పౌర సమాజ ప్రతినిధులతో కూడిన నిజ-నిర్ధారణ కమిషన్‌ను పంపాలి.
 • గత దశాబ్దంలో ప్రవేశపెట్టిన పాఠ్యపుస్తకాలు, పాఠ్యాంశాల్లోని అన్ని మార్పులను సమీక్షించాలి. మతపరమైన, భాషా ఆధారిత సంఘాల మధ్య సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించాలి.
 • ఆదివాసీ హక్కుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం- 2006 ప్రకారం కమ్యూనిటీ అటవీ హక్కులను అమలు చేయాలి. ఈ చట్టానికి తూట్లుపొడుస్తూ 2023లో తీసుకొచ్చిన సవరణను రద్దు చేయాలి.
 • ఉపాధి హామీని విస్తరించి, బలోపేతం చేయాలి. రోజు కూలీని రూ.500కు పెంచాలి. ఆధార్‌ ఆధారిత తప్పనిసరి చెల్లింపు వ్యవస్థను రద్దు చేయాలి. సకాలంలో వేతనాలు చెల్లించాలి. కేంద్రం నుండి రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధులను విడుదల చేయాలి. మహిళా కార్మికుల కోసం ప్రత్యేకంగా పట్టణ ఉపాధి హామీని ఏర్పాటు చేయాలి. యువత ఉపాధి కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలతో ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేకంగా రూపొందించిన పాలసీ ప్యాకేజీలను అందించాలి. శ్రామిక ప్రజల అన్ని విభాగాలకు ప్రధాన కార్మిక ప్రమాణాలను విస్తరింపజేస్తూ, అసంఘటిత కార్మికుల కోసం సమగ్ర చట్టాన్ని రూపొందించాలి. గిగ్‌ కార్మికుల సామాజిక భద్రత, ప్రాథమిక పని పరిస్థితులను నిర్ధారించడానికి అగ్రిగేటర్లు, ప్రభుత్వం, కార్మికులతో త్రైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవాలి.శ్రీ ఎలాంటి వివక్ష లేకుండా ఆరోగ్యాన్ని మానవ హక్కుగా గుర్తించాలి. కంటైనర్‌ టెర్మినల్‌ కోసం గ్రేటర్‌ నికోబార్‌ దీవుల్లోని వందల హెక్టార్ల అటవీప్రాంతాన్ని తొలగించే యత్నాలను విరమించుకోవాలి. ముఖ్యంగా దుర్బలమైన హిమాలయాల్లో విచక్షణారహిత నిర్మాణాలను అరికట్టాలి.
➡️