మంత్రివర్గంలో సీనియర్లకే పట్టం

Jun 9,2024 10:43
  • అభ్యర్ధులకిచ్చిన హామీలూ పరిశీలన
  • చంద్రబాబుతో పాటే ప్రమాణ స్వీకారం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నూతన మంత్రివర్గంలో సీనియర్లకే పట్టం కట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయించినట్లు సమాచారం. మంత్రివర్గంలో స్థానం గురించి కొందరు అభ్యర్థులకు హామీ ఇచ్చి ఉండటంతో ఆ విషయాన్ని కూడా పరిశీలించాలని భావిస్తున్నట్లు తెలిసింది. టిడిపి కార్యాలయంలోనూ, ఆ పార్టీ నేతల్లోనూ శనివారం ఇదే చర్చనీయాంశమైంది. సీనియర్లలో ఎవరెవరికి పదవులు లభిస్తాయి? చంద్రబాబు హామీలిచ్చిన వారిలో కేబినెట్‌లో ఎవరు స్థానం దక్కించుకోగలరన్న అంశాలపై పలు అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు 12వ తేది చంద్రబాబుతో పాటే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వ రాజకీయ ముఖ్యకార్యదర్శి ఎస్‌ సురేష్‌కుమార్‌ కమిటీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన కాకుండా పాత జిల్లాల వారీగా మంత్రివర్గ ఎంపిక ఉంటుందని తెలిసింది. ఈ సారి బిసి, కమ్మ, కాపులకు ఐదు చొప్పున, రెడ్లకు మూడు నుంచి నాలుగు చొప్పున పదవులు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఎస్‌సిలకు రెండు, ఎస్‌టి, మైనార్టీలకు చేరొక పదవి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. జనసేన నుండి కాపులకు ఎక్కువగా ప్రాతినిధ్యం లభిస్తుందని అంటున్నారు..ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి బిసి సామాజిక వర్గం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌కు, ఎస్సి సామాజిక వర్గం నుంచి కొండ్రు మురళీమోహన్‌ పేర్లు వినపడుతున్నాయి. అచ్చెన్నాయుడు, రవికుమార్‌ తొలి నుంచి పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. కొండ్రు మురళీ గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి రాష్ట్ర విభజన అనంతరం టిడిపిలో చేరారు. విజయనగరం జిల్లా నుంచి కిమిడి కళా వెంకట్రావు, అదితి గజపతిరాజుకు దక్కవచ్చని తెలిసింది. ఎస్‌టి కోటాలో గుమ్మడి సంధ్యారాణికి ఇవ్వనున్నట్లు సమాచారం. విశాఖపట్నం నుంచి కాపు కోటాలో గంటా శ్రీనివాసరావు, బిసి కోటాలో చింతకాయల అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాసరావు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ జిల్లా నుంచి ఎస్‌సి కోటాలో వంగలపూడి అనిత పేరు వినిపిస్తోంది. అనిత ప్రస్తుతం టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి బిసి కోటాలో యనమల రామకృష్ణుడు, కాపు కోటాలో నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, కమ్మ కోటాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. యనమలకు మంత్రి పదవి కచ్చితంగా ఉండనుంది. జనసేన నుంచి ఈ జిల్లాలో కాపు కోటాలో ఇస్తే చినరాజప్ప, నెహ్రూ ఉండకపోవచ్చనే చర్చ కూడా వినబడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాపు కోటాలో నిమ్మల రామానాయుడు, క్షత్రియ కోటాలో రఘురామకృష్ణరాజు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో బిసి కోటాలో యాదవ సామాజిక వర్గం నుంచి కొలుసు పార్ధసారధి, మత్య్సకార సామాజిక వర్గం నుండి కొల్లు రవీంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. కాపు కోటాలో బొండా ఉమామహేశ్వరరావు, ఆర్యవైశ్య కోటాలో శ్రీరాం తాతయ్య, ఎస్‌సి కోటాలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గుంటూరు జిల్లా నుంచి కమ్మ కోటాలో నారా లోకేష్‌, కాపు కోటాలో కన్నా లక్ష్మీనారాయణ, ఎస్‌సి కోటాలో తెనాలి శ్రావణ్‌కుమార్‌, నక్కా ఆనంద్‌ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా నుండి బిసి మహిళా కోటాలో గళ్లా మాధవి పేరు వినిపిస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి కమ్మ కోటాలో ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి, ఎస్‌సి కోటాలో డోలా బాలవీరాంజనేయస్వామి పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు నుంచి కాపు కోటాలో పి నారాయణ, రెడ్డి సామాజిక వర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కడప నుంచి రెడ్డప్పగారి మాధవిరెడ్డి, రాంభూపాల్‌ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కర్నూలు నుంచి మైనార్టీ కోటాలో ఎన్‌ఎండి ఫరూక్‌, ఆర్యవైశ్య నుంచి టిజి భరత్‌ పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురం నుంచి కమ్మ కోటాలో పయ్యావుల కేశవ్‌, పరిటాల సునీత, రెడ్డి కోటాలో పల్లె సింధూర రెడ్డి, బిసి కోటాలో కాలువ శ్రీనివాసులు పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. చిత్తూరు నుంచి రెడ్డి కోటాలో ఎన్‌ అమర్‌నాథ్‌ రెడ్డి, నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

➡️