సీతారాం ఏచూరి ఆగస్టు 10 2017లో రాజ్యసభలో తన వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో భారతదేశం యొక్క బహుళత్వాన్ని నిర్వచించడానికి తన సొంత జీవితాన్ని ఆయన ఒక ఉదాహరణగా చెప్పారు. బహుళత్వం, భిన్నత్వంతో కూడాన సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం అనే ఆలోచనను రేకెత్తించేలా సాగిన ఆ ప్రసంగం చివరి భాగం ఇలా ఉంది.
‘మన దేశం ఒక తోట. అందులో రకరకాల పూలు పూయాలి. వివిధ సువాసలు వెదజల్లాలి. ఈ పువ్యులన్నింటిని సందర్శించే తేనెటీగలు, పిచ్చుకలు తప్పనిసరిగా తోటలో ఉండాలి. కాబట్టి ఈ పూవులన్నీ ఒకటిగా ఉండాలి. మన దేశం అలాంటి స్వర్గధామం కావాలి. సంకుచిత, స్వార్ధపూరిత ఆలోచనలు మన సమాజాన్ని వేరు చేస్తాయి. ఏకత్వాన్ని ధ్వంసం చేస్తాయి. అలా జరిగితే మనమంతా ఒక్కటే అనే తరతరాల మహా చైతన్యపు పునాది కదిలిపోతుంది. మన సంస్కృతి గొప్పతనాల గురించి అనేక ఉదాహరణలు చెబుతారు. నేను కూడా కొన్ని విషయాలు చెప్పాలి. నేను 1952లో మద్రాసు జనరల్ ఆస్పత్రిలో పుట్టాను. తెలుగు మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మా తాత న్యాయమూర్తి. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మద్రాసు హైకోర్టు ఆంధ్రా బెంచ్ గుంటూరుకు మారింది. అలా 1954 నుండి అక్కడకు వెళ్లాం. 1956లో హైదరాబాద్ చేరుకున్నాం. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజులు కాబట్టి నిజాం పాలనలో ఇస్లామిక్ సంస్కృతి. నా చదువు ఆ సంస్కృతిలోనే సాగింది. ఆ సంస్కృతితోనే ఇక్కడకు వచ్చాను. ఢిల్లీలో చదువు కొనసాగించాను. నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి తండ్రి చిస్తీ సూఫీ. వారి తల్లి 8వ శతాబ్ధంలో మైసూరుకు వలస వచ్చిన రాజపుత్ర కుటుంబానికి చెందిన వారు. గుర్తుంచుకోండి. దక్షిణ భారతదేశంలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి సూఫీ-రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించిన వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు నా కుమారుడు ఎవరు? బ్రాహ్మణుడా? ముస్లిమా..? నువ్వు హిందువువా అని ప్రశ్నిస్తే ఏం చెబుతాం? అతన్ని భారతీయుడిగా అభివర్ణించడం ఉత్తమం. ఇది మన దేశం. నేను నా సొంత జీవితం నుండి దీనిని చెబుతున్నాను. మన చుట్టూ చూడండి నాలాంటి ఎన్నో జీవితాలను మనం ఉదహరించగలం. అటువంటి భారతదేశాన్ని కాపాడుకునే గురుతర బాధ్యతను మనం నిర్వహించాలి.
