అమరావతిలో ‘పైసా వసూల్‌’

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి నిర్మాణానికి ఖర్చు చేసే ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వసూలు చేయనుంది. దీనికోసం ప్రజలపై పెద్ద ఎత్తున ప్రత్యక్ష పరోక్ష పన్నులను విధించనుంది. యూజర్‌ ఛార్జీల మోత మోగించనుంది. ఈ మేరకు ప్రపంచబ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీలలోని అంశాల ఆధారంగా ‘అమరావతి ఇంటిగ్రేటెడ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం’ పేరిట ప్రపంచబ్యాంకు తాజాగా ఒక నివేదికను రూపొందించింది. అమరావతి నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం 15వేల కోట్ల రూపాయలకు పైగా రుణం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిలో ప్రపంచబ్యాంకు 6,791 కోట్లరూపాయలను రుణంగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని సాధారణ రుణం కాకుండా ‘ఫలితాల ఆధారిత రుణం (రిజల్ట్స్‌ బేస్డ్‌ లెండింగ్‌-ఆర్‌బిఎల్‌) పద్దతిలో ఇస్తోందని, దీనికోసం ప్రపంచబ్యాంకు విధించే నిర్దేశించే లక్ష్యాలు (షరతులు)ను తప్పకుండా సాధించాల్సి ఉంటుందని ప్రజాశక్తి కొద్దిరోజుల క్రితం ప్రచురించిన విషయం విదితమే! ప్రపంచబ్యాంకు విడుదల చేసిన 62 పేజీల తాజా నివేదికలో ఈ కీలకమైన ‘కాస్ట్‌ రికవరికి’ సంబంధించిన మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నివేదికలోని 18నుండి 21 వరకు, ఆ తరువాత మరికొన్ని పేరాల్లోనూ కాస్ట్‌ రికవరి, ప్రైవేటు పెట్టుబడి అభివృద్ధికి సంబంధించిన అంశాలను పేర్కొన్నారు. అయితే, ఇవి తక్షణమే కాకుండా దశలవారిగా అమలులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం అదే విధంగా ఏర్పాటు చేయనుంది. ‘దీర్ఘకాల అమరావతి అభివృద్ధి ప్రణాళిక’గా దీనిని నివేదికలో పేర్కొన్నారు. ‘క్రియాశీల ఆర్థిక , సమ్మిళత, నష్టాలను తట్టుకుని నిలిచే సుస్థిరాభివృద్ధి, పర్యావరణ హిత నగరంగా’ అమరావతిని తీర్చిదిద్ధడానికి ఈ చర్యలు దోహదపడతాయని వివరించారు.

స్వయం సమృద్ధిగా తొలిదశ

తొలిదశ నిర్మాణ పనులు 92 చదరపు కిలో మీటర్లలో సాగుతాయని నివేదికలో ప్రపంచబ్యాంకు తెలిపింది. ఐదు సంవత్సరాల్లో పూర్తయ్యే తొలిదశను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే లక్షమని పేర్కొన్నారు.జోన్‌1 నుండి 7వరకు, 10వ నెంబర్‌ జోన్‌లోనూ ఈ పనులు జరుగుతాయని, 98 శాతం సమీకరణకోసం తీసుకున్న భూముల్లోనే తొలిదశ నిర్మాణాలు ఉంటామని నివేదికలో బ్యాంకు తెలిపింది. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టించి, ప్రజలను అక్కడే స్థిరపడేలా ఎకనామిక్‌ మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.తాత్కాలిక, స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను రూపొందిస్తామని, నిర్వహణ కోసం ప్రత్యేక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఒప్పందంలో తెలిపారు. ఆస్తిపన్నులు (మార్కెట్‌ విలువ ఆధారిత ఆస్తిపన్ను) కాస్ట్‌ రికవరీ టారిఫ్‌(ప్రభుత్వ ఆర్థికలావాదేవీలు), భూమి విలువను పెంచడం వంటి పద్దతుల్లో నిధులు సమకూర్చు కుంటామని పేర్కొన్నారు. సిఆర్‌డిఏపై ఆర్థిక భారం లేకుండా చేస్తామని వివరించారు. దీనికోసం నిర్థిష్ట కాలపరిమితితో ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేస్తామని హామీనిచ్చినట్లు ప్రపంచబ్యాంకు నివేదికలో పొందుపరిచారు.

‘పైవేటు”కే సేవలు

పౌరసేవా రంగాలన్నింటిన్ని ప్రైవేటు రంగానికి అప్పగించడం ద్వారా కాస్ట్‌ రికవరి విధానాన్ని, యూజర్‌ ఛార్జీలను పటిష్టంగా అమలు చేయాలని ఈ నివేదికలో ప్రపంచబ్యాంకులో సూచించింది. పైగా దీనిని ‘ ఫలితాలు వచ్చే ప్రాంతాల్లో ఒకటవ విభాగంలోచేర్చడం (రిజల్ట్స్‌ ఏరియాస్‌ -1) ద్వారా బ్యాంకు ప్రాధాన్యత ఏమిటో స్పష్టమవుతోంది. ‘నీళ్లు, పారిశుద్ధ్యం, డ్రైనేజితో పాటు ఇతర మౌలికసదుపాయల నిర్వహణకు వృత్తిపరమైన నిపుణులను ప్రభుత్వం నియమించాలి. నివసించే ప్రజలకు, వ్యాపార సంస్థలకు ఈ సేవలను అందించడంతోపాటు ఖర్చుకు తగ్గట్టుగా రికవరి టారిఫ్‌ను సిద్ధం చేసి, వసూళ్లు చేసే నైపుణ్యం వారికి ఉండాలి. క్రమేణా యూజర్‌ ఛార్జీలను వసూలు చేయడం, ప్రైవేటు రంగాన్ని ఈ సేవల్లోకి తీసుకురావడం వంటి పనులు చేయాలి’ అని పేర్కొన్నారు. రుణ మంజురుకు సంబంధించిన పత్రంలోనే ‘ప్రైవేటు రంగ ఏర్పాటుకు, స్థిరపడటానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండాలి’ అని బ్యాంకు పేర్కొన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. కమ్యూనిటీ, పరిసర ప్రాంతాల అభివృద్ధి వంటి పనుల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడ భాగస్వామ్యం అంటే, ఏదో రకంగా ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిలో భాగంగానే ఏయే సేవారంగానికి ఎంత మొత్తాన్ని రుణంగా ఇస్తున్న అంశాన్ని కూడా ప్రపంచబ్యాంకు వివరించింది, ఉదాహరణకు రోడ్లు, నీళ్లు, విద్యుత్‌, డ్రైనేజి తదితర మౌళిక వసతుల రంగానికి 884 మిలియన్‌ డాలర్లను కేటాయిస్తున్నట్లు ప్రపంచబ్యాంకు పేర్కొంది. ఆర్‌బిఎల్‌ విధానం ప్రకారం ఈ మొత్తాన్ని ఖర్చు చేసే సమయానికి ఆ మేరకు నిర్ధేశించిన ‘ఫలితాలను’ కూడా సాధించాలి. ఇక్కడ ఫలితాలంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమరాతికి తీసుకునే అప్పును ప్రజల నుండే వివిధ రూపాల్లో వసూలు చేస్తారని 2016లోనే ప్రజాశక్తి ప్రచురించడం గమనార్హం.

➡️