అప్పు తీర్చండి

Mar 12,2024 09:10 #Debt arrears, #Energy Department, #RBI
  • అదనపు వడ్డీ చెల్లించండి
  • ఇంధన శాఖకు ఆర్‌ఇసి డిమాండ్‌

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఇంధన శాఖలో రుణ బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. వాటిని సకాలంలో తీర్చలేక పోవడంతో రుణ దాతల నుంచి వత్తిళ్లు పెరిగిపోతున్నాయి. అందులో ఎక్కువ రుణాలు ఇచ్చిన గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఇసి) తన బకాయిల కోసం అనునిత్యం రాష్ట్ర ఇంధన శాఖపై వత్తిడి తీసుకువస్తోంది. చివరకు సాధారణ వడ్డీకి అదనంగా జరిమానా వడ్డీని కూడా చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు తాజాగా రాష్ట్రానికి లేఖ కూడా రాసింది. రాష్ట్రంలోని డిస్కామ్‌ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భారీగా రుణాలను సేకరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో ఆర్‌ఇసి నుంచే ఎక్కువ రుణాలు ఉన్నాయని తేలింది. ఇప్పటివరకు ఎపి పవర్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ, రాయలసీమ కరవు నివారణ పథకాల సంస్థ, ఎపి జెన్‌కోతోపాటు మూడు డిస్కామ్‌లైన దక్షిణ, తూర్పు, సెంట్రల్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఆర్‌ఇసి నుంచి తీసుకున్న రుణాలు ఏకంగా రూ.38,666 కోట్లుగా ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రతి నెలా వాయిదాలు, వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు చూసినా వాయిదాలు, వడ్డీల చెల్లింపులు ఓవర్‌డ్యూస్‌గానే ఉంటున్నాయని ఆర్‌ఇసి చెబుతోంది. అత్యధికంగా కొన్ని వాయిదాలు 66 రోజుల పాటు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని వాయిదాలు డిసెంబర్‌ నుంచి కూడా చెల్లింపులు జరగలేదంటూ రాష్ట్రానికి ఆర్‌ఇసి లేఖ రాసింది. డిసెంబర్‌ నుంచి మొత్తం రూ.1516 కోట్లు తమకు రావాల్సి ఉందని ఈ లేఖలో తెలిపింది. ఇందులో వడ్డీయే ఏకంగా రూ.601 కోట్లు ఉండగా, జాప్యానికి విధించిన అదనపు జరిమానా రూ.21 కోట్ల వరకు ఉండడం గమనార్హం. వాయిదాల బకాయిల్లో అధికంగా దక్షిణ పవర్‌ డిస్కామ్‌ నుంచే ఉండగా, తరువాత స్థానంలో జెన్‌కో, తూర్పు డిస్కామ్‌, సెంట్రల్‌ డిస్కామ్‌లు ఉన్నాయి.

ఆర్‌బిఐకి రోజువారీ నివేదిక

ఆర్‌ఇసి అన్నది నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థ కావడంతో ఇచ్చిన ప్రతి రుణం, డిఫాల్ట్‌ వివరాలు రోజువారీగా రిజర్వ్‌బ్యాంకు, రుణ అధ్యయన సంస్థలకు చెప్పాల్సి ఉంటుంది. బకాయిలు పెరిగిపోతే క్రెడిట్‌ రేటింగ్స్‌పైనా వ్యతిరేక ప్రభావం పడుతుందని ఆర్‌ఇసి చెబుతోంది. ఇదే విషయాన్ని రాష్ట్రానికి కూడా ఆర్‌ఇసి తన లేఖలో స్పష్టం చేయడం విశేషం. వార్షికాంతం కావడంతో రుణ బకాయిల అంశం తమ సంస్థ ప్రగతిపైనా ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. 90 రోజు కాలపరిమితి దాటితే ఎన్‌పిఏలోకి చేరిపోతారని, ఇదే జరిగితే ఇతర బ్యాంకుల నుంచి కూడా రుణాలు పొందే అవకాశాలు ఉండబోవని హెచ్చరించింది.

➡️