గ్యారంటీలపై గోప్యత

Oct 2,2024 08:02 #Super six schemes

కొనసాగుతున్న గత ప్రభుత్వ విధానం
ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తున్న కాగ్‌
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కీలకమైన గ్యారంటీలపై గోప్యత ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో కొనసాగిన ఈ విధానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కూడా కొనసాగిస్తుండటం చర్చనీయాంశమైంది. ప్రతి నెలా కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ కార్యాలయానికి అందించాల్సిన ఈ వివరాలు సక్రమంగా అందడం లేదు. ఇదే విషయాన్ని కాగ్‌ కూడా ప్రతి నెలా తన నివేదికల్లో ప్రస్తావిస్తూనే ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలకు ఆర్థిక అవసరాల నేపథ్యంలో రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీలను ఇచ్చే సంగతి తెలిసిందే. ఈ గ్యారంటీల మేరకే విత్త సంస్థలు రుణాలు మంజూరు చేస్తాయి. ఏ సంస్థకు ఎంత మేరకు గ్యారంటీలు ఇచ్చారన్న వివరాలను ప్రభుత్వం కూడా కాగ్‌కు సమర్పించాల్సి ఉంటుంది. నెల వారీ నివేదికలు, వార్షిక నివేదికల్లో ప్రభుత్వం నుంచి వచ్చిన వివరాలను కాగ్‌ బహిరంగంగా ప్రకటిస్తుంది. అయితే, కొన్ని సంవత్సరాలుగా గ్యారంటీల వివరాలు కాగ్‌కు వెళ్లడం లేదు.

16 నెలలుగా అందని వివరాలు
గ్యారంటీల వివరాలు తమకు 16 నెలలుగా రావడం లేదని కాగ్‌ చెబుతోంది. గత ఏడాది ఆరంభం నుంచి రాలేదని కాగ్‌ నుంచి ఇటీవలే ఆర్థికశాఖకు ఒక లేఖ కూడా వచ్చింది. ఈ లేఖకు కూడా ఆర్థికశాఖ నుంచి స్పందన కనిపించలేదని సమాచారం. సంస్థల పేరుమీద తీసుకునే రుణాలను ఆ సంస్థల అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగించడం వల్లనే ఆ గ్యారంటీల వివరాలను అధికారికంగా చెప్పలేకపోతున్నట్లు అధికారులు అంగీకరిస్తున్నారు.

రుణాలపైనా అదే గోప్యత
ఇదే సమయంలో నేరుగా ప్రభుత్వం తీసుకునే రుణాలపైన కూడా స్పష్టత లేదని అంటున్నారు. ప్రభుత్వ సెక్యూరిటీలను తనఖాపెట్టి తీసుకునే బహిరంగ రుణాలతోపాటు, పథకాలకు, ఇతర సంస్థల అవసరాలకు తీసుకునే రుణాలు కూడా ఉంటాయి. ఇంధనశాఖ, పౌర సరఫరాల శాఖలు వంటివి నేరుగానే రుణాలు తీసుకుంటాయి. ఈ వివరాలు కూడా కాగ్‌ వద్దకు చేరడం లేదని సమాచారం.

➡️