నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు

  • అక్కరకు రాని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు
  • నష్టపోతున్న అన్నదాతలు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు విధించడం, కొనుగోలు కేంద్రాలకు సిబ్బంది రాకపోవడంతో అన్నదాతలకు దిక్కుతోచడం లేదు. వాతావరణ మార్పులు, ధాన్యం నిల్వ చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటి వరకూ కేవలం 98 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది.

ఈ ఏడాది రబీ సీజన్‌లో కాకినాడ జిల్లాలో 1.62 లక్షల ఎకరాల్లో 1.45 లక్షల మంది రైతులు వరిని పండించారు. 5.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. జిల్లా వ్యాప్తంగా 20 రోజుల నుంచి వరి కోతలు సాగుతున్నాయి. ఇప్పటివరకు 12 వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి.43 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. కాని ఇందులో వంద మెట్రిక్‌ టన్నుల ధాన్యం కూడా నేటికీ కొనుగోలు చేయలేదు. ధాన్యం సేకరణకు జిల్లాలో 225 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులకు ఉపయోగపడడం లేదు. ఈ నెల మూడు నుంచి కొనుగోళ్లను ప్రారంభించామని అధికారులు ప్రకటించినప్పటికీ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకపోవడంతో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, తేమ శాతం తదితర నిబంధనల వల్ల రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. మరోపక్క సిబ్బంది కూడా కొనుగోలు కేంద్రాలకు పూర్తిస్థాయిలో రావడం లేదు. గత ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో చాలామంది విధులకు గైర్హాజరవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిచోట్ల సిబ్బంది హాజరవుతున్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. ఇప్పటి వరకు రెండు కేంద్రాల నుంచి 98 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయడం కేంద్రాల పనితీరుకు నిదర్శనం.

బస్తాకు రూ.340 నష్టం

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సరిగా పనిచేయకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం సాధారణ రకం క్వింటాలు రూ.2,300, ఎ-గ్రేడ్‌ రకానికి రూ.2,320 మద్దతు ధరగా ప్రకటించింది. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం 75 కిలోలకు సాధారణ రకానికి రూ.1725, ఎ-గ్రేడ్‌ రకానికి రూ.1740 రావాల్సి ఉంది. కానీ దళారులు రూ.1,400 మించి కొనుగోలు చేయడం లేదు. కోతలు కోసిన తర్వాత తేమ శాతం ఎక్కువగా చూపించి రూ.1000కే అడుగుతున్నారని పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని పలువురు రైతులు చెబుతున్నారు. బస్తాపై రూ.340 నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చి నిబంధనలను సడలించి మద్దతు ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది.

దళారులకే అమ్ముకుంటున్నాం : పరిమి వెంకటేశ్వరరావు, ఎన్‌టి.రాజాపురం, గండేపల్లి మండలం

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఇంకా సేకరించడం లేదు. సాధారణ రకం మద్దతు ధర ప్రకారం (75 కిలోలు) రూ.1,740 అని చెబుతున్నారు. ప్రయివేటు వ్యాపారులకు రూ.1,400కు అమ్ముకోవాల్సి వచ్చింది. ఒక్కో బస్తాపై రూ.340 నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనలు సడలించి మద్దతు ధర అందించి రైతులను ఆదుకోవాలి.

కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తేవాలి : బొజ్జ వెంకట్రావు, రైతు, పిఠాపురం

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. తేమ శాతం పేరుతో వారు తక్కువ ధర చెల్లిస్తున్నారు. వాతావరణ మార్పులు, ధాన్యం దాచుకునే వీలు లేకపోవడంతో తక్కవ రేటుకే అమ్ముకోవాల్సి వస్తోంది.

➡️