బిజెపిపై కార్పొరేట్‌ కంపెనీల నిధుల వర్షం

Feb 12,2024 11:57 #BJP, #corporate companies, #funds
  • ఎన్నికల బాండ్లలో కాషాయపార్టీకే అత్యధిక నిధులు
  • 2022-23లో దాదాపు రూ.1300 కోట్లు
  • కాంగ్రెస్‌ కంటే ఏడు రెట్లు అధికం

న్యూఢిల్లీ : అటవీ హక్కులను, సామాన్య ప్రజానీకం హక్కులను కాలారాస్తూ, రాజ్యాంగ మౌలిక సూత్రాలను కూడా పక్కన పెట్టేసి కార్పొరేట్‌ కంపెనీల సేవలో తరిస్తున్న కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బిజెపిపై కార్పొరేట్‌ కంపెనీలు నిధుల వర్షం కురిపిస్తున్నాయి. ఇందుకోసమే అన్నట్టుగా మోడీ సర్కార్‌ అమల్లోకి తీసుకొచ్చిన ‘ఎన్నికల బాండ్ల స్కీమ్‌’ బిజెపికి అధిక మొత్తంలో నిధులను తెచ్చిపెడుతోంది. 2022-23లో ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా అధికార బిజెపికి రూ.1300 కోట్లు వచ్చి చేరాయి. కాంగ్రెస్‌కు అందిన విరాళాల కంటే ఇది ఏడు రెట్లు అధికం కావటం గమనార్హం.

2022-23 ఆర్థిక సంవత్సరంలో బిజెపికి మొత్తం రూ.2120 కోట్ల నిధులు అందాయి. ఇందులో 61 శాతానికి పైగా ఎలక్టోరల్‌ బాండ్ల నుంచే వచ్చి చేరటం గమనార్హం. ఎన్నికల సంఘానికి సమర్పించిన పార్టీ వార్షిక ఆడిట్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బిజెపికి వచ్చిన విరాళాల మొత్తం రూ.1775 కోట్లుగా ఉన్నది. బిజెపి మొత్తం ఆదాయం 2021-22లో రూ.1917 కోట్లు కాగా.. అది 2022-23లో రూ.2360.8 కోట్లకు పెరగటం గమనార్హం. బిజెపి 2022-23 ఆర్థిక సంవత్సరంలో వడ్డీల నుంచి రూ.237 కోట్లను పొందింది. 2021-22లో ఇది రూ.135 కోట్లుగా ఉన్నది.ఇందుకు విరుద్ధంగా, కాంగ్రెస్‌కు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలు పడిపోయాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీకి అందిన విరాళాల మొత్తం రూ.236 కోట్లు కాగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అది రూ.171 కోట్లకు పడిపోయింది.

టిడిపికి పది రెట్లు పెరిగిన నిధులు

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపికి గతంలో ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన నిధుల కంటే ఈ దఫా పది రెట్లు నిధులు పెరిగాయి. 2022-23లో ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రూ.34 కోట్లు వచ్చి చేరాయి. అంతకముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది పది రెట్లు అధికం కావటం గమనార్హం. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), 2021-22లో ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రూ.3.2 కోట్లను పొందింది. 2022-23లో మాత్రం ఆ పార్టీకి ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా ఎలాంటి నిధులూ అందలేదు.

➡️