తెలుగు సినిమాపై ‘రామోజీ’ ముద్ర

Jun 9,2024 10:38 #closed, #death, #Ramoji Rao, #Shooting

తెలుగు సినిమా పరిశ్రమపై రామోజీరావు ముద్ర ఎంతో ఉంది. మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు పరిశ్రమ రావటానికి ఆయన ఎంతో కృషిచేశారు. ఉషా కిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌, మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ని ప్రారంభించి కొన్ని వందల తెలుగు చిత్రాలనే కాకుండా, ఇతర భాషా చిత్రాలు కూడా పంపిణీ చేశారు. షూటింగులకు అత్యంత అనువైన రామోజీ ఫిల్మ్‌ సిటీని నిర్మించారు. సినిమా అనేది కళాత్మాక వ్యాపారం అని నమ్మిన వ్యక్తాయన. అశ్లీలతకు దూరంగా మంచి వినోదాత్మక, సందేశాత్మక కథ చిత్రాలను నిర్మించాలన్న సంకల్పంతో ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థను ఏర్పాటుచేశారు. తన తుదిశ్వాస వరకు అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. విలువలున్న చిత్రాలను అందించాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసిన ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా.. తారాబలం కాకుండా కేవలం కథను మాత్రమే విశ్వసించి 85కుపైగా చిత్రాలను నిర్మించారు. ఉషాకిరణ్‌ మూవీస్‌లో అవకాశమంటే మార్కెట్‌లో క్రేజ్‌ ఉన్న ఏ కథనాయకుడైనా టక్కున కాల్షీట్లు ఇచ్చేవారు. కానీ రామోజీరావు మాత్రం తారలను సృష్టించే కథలను నమ్మారు. అలా 1984లో దిగ్గజ హాస్య దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పుడే ఎదిగే ప్రయత్నం చేస్తున్న.. నరేష్‌, పూర్ణిమతో శ్రీవారికి ప్రేమలేఖని నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో మ్నెదటి చిత్రం తోనే తెలుగు సినిమాతోనే తనదైన ముద్ర వేశారు. కథలనేవి కల్పనల్లోంచి కాదు, జీవితాల్లోంచి పుడతాయని ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థ నిరూపించింది. అందుకు ఉదాహరణే మయూరి సినిమా. ఒక హిందీ పత్రికలో వచ్చిన వార్తను సినిమాగా మలిచి సంచలనం సృష్టించారు. ప్రమాదంలో కాలు పొగొట్టుకొని, కృత్రిమ పాదంతో నాట్యంలో రాణించిన సుధా చంద్రన్‌ జీవితాన్ని తెరపై ఆవిష్కరించి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. మయూరి చిత్రంతోనే జైపూర్‌ పాదం గురించి దేశంవ్యాప్తంగా ప్రజలకు తెలిసింది. ఒడిశాలో జరిగిన యధార్థ సంఘటనలతో మౌనపోరాటం, జాతీయ క్రీడాకారిణి అశ్వని నాచప్ప బయోపిక్‌ అశ్వని.. వంటి చిత్రాలను నిర్మించి ఆయన అభిరుచి వేరు అని నిరూపించుకున్నారు. కాంచన గంగ, ప్రతిఘటన, నువ్వేకావాలి, చిత్రం, ఆనందం, నచ్చావులేవంటి ఎన్నో హిట్‌ చిత్రాలను నిర్మించారు. కేవలం తెలుగు చిత్రాలకే ఉషా కిరణ్‌ మూవీస్‌ పరిమితం కాలేదు. కన్నడ, తమిళ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో ఇప్పటివరకు 85 చిత్రాలను నిర్మించింది. శ్రీవారి ప్రేమలేఖకు ప్రభుత్వ పురస్కారాలు వరించాయి. కాంచన గంగ, మయూరి, ప్రతిఘటన, తేజ, మౌనపోరాటం లాంటి చిత్రాలకు నంది అవార్డులు లభించాయి. మయూరిలో నటించిన సుధా చంద్రన్‌కు ఏకంగా జాతీయస్థాయిలో పురస్కారం దక్కింది. నువ్వే కావాలికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా ప్రేక్షకులకు చేరువైన నటులు ఎంతో మంది ఉన్నారు. శ్రీకాంత్‌, వినోద్‌ కుమార్‌, చరణ్‌ రాజ్‌, యమున, జూ. ఎన్టీఆర్‌, ఉదరు కిరణ్‌, తరుణ్‌, కల్యాణ్‌ రామ్‌, రీమాసేన్‌ , శ్రియ, జెనీలియా, తనీశ్‌ ఇలా ఎందరో నటులు పరిచమయ్యారు. మౌనపోరాటంతో గాయని ఎస్‌. జానకిని సంగీత దర్శకురాలని చేశారు. గాయకులు మల్లికార్జున్‌ , ఉష, గోపికా పూర్ణిమ లాంటి వారిని శ్రోతలకు పరిచయం చేశారు.

రామోజీరావు మృతికి సంతాపంగా నేడు షూటింగులు బంద్‌
సినీ నిర్మాత, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మరణవార్త తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలచివేసింది. ఆయన మృతికి సంతాప సూచకంగా ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. షూటింగులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు నిర్మాతల మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు రామోజీరావుకు నివాళులర్పించారు. ఫిల్మ్‌సిటీలో ఆయన పార్థివదేహం వద్ద అంజలి ఘటించారు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, మోహన్‌బాబు, నాగార్జున, అల్లు అర్జున్‌, ఎన్‌టిఆర్‌, రాఘవేంద్రరావు, రాజమౌళి, కీరవాణి, శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, నరేష్‌, కల్యాణ్‌రామ్‌, సాయికుమార్‌ తదితరులు నివాళులర్పించారు. ఎపి చలనచిత్ర వాణిజ్యమండలి ప్రతినిధులు ఎఎం రత్నం, జెవి మోషన్‌గౌడ్‌ సంతాపాన్ని ప్రకటించారు.

‘గేమ్‌ఛేంజర్‌’ యూనిట్‌ నివాళి
రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకొంటున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్ర బృందం సెట్లో నివాళులర్పించింది. హీరో రామ్‌ చరణ్‌, దర్శకులు శంకర్‌, నటులు సునీల్‌ రఘు కారుమంచి, ఇతర చిత్ర బృంద సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

➡️