అమెరికాలో కోరలు చాచిన నిరుద్యోగం!

Jun 9,2024 08:55 #America, #Unemployment
  • మే నెలలో మరింత ఉగ్రరూపం

వాషింగ్టన్‌ : అమెరికాలో నిరుద్యోగం రేటు మే మాసంలో నాలుగు శాతానికి పెరిగింది. గత రెండేళ్ల కాలంలోనే ఇది అధికమని అమెరికా కార్మిక విభాగం శుక్రవారం ప్రకటించింది. మే మాసంలో కొత్తగా 2,72,000 ఉద్యోగాలు కల్పించినా ఈ పరిస్థితి ఎదురైంది. అయితే ఇవన్నీ కూడా అనియత రంగాల్లోని ఉపాధి అవకాశాలే. ఇది కూడా గత 12 మాసాల కాలంతో పోలిస్తే సగటు నెలవారీ పెంపు 2,32,000 కన్నా ఎక్కువగానే వుంది. ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్యం, వృత్తి నైపుణ్యం, శాస్త్ర, సాంకేతిక సేవలు వంటి రంగాలతో సహా పలు పరిశ్రమల్లో ఉపాధి పెరుగుతునే వుంది. మార్చి మాసానికి అనియత రంగాల్లో పే రోల్‌ ఉపాధి అవకాశాల్లో మార్పును 5వేలకు సవరించారు. దీంతో 3,10,000 ఉద్యోగాలు పొందారు. అలాగే ఏప్రిల్‌ మాసానికి 10వేలకు సవరించారు. దానివల్ల 1,65,000 ఉద్యోగాలు పొందారు. ఈ సవరణలతో, మార్చి, ఏప్రిల్‌ మాసాలకు కలిపి ఉపాధి అంతకుముందు చెప్పిన దాని కన్నా 15వేలు తక్కువగా వుంది. ఫిబ్రవరి మాసంలో నిరుద్యోగం రేటు 3.9శాతం పెరిగింది. ఇది గత రెండేళ్ళలోనే అత్యధిక స్థాయి. అంతకుముందు మార్చిలో స్వల్పంగా తగ్గి 3.8శాతానికి చేరుకుంది. ఏప్రిల్‌లో తిరిగి 3.9శాతానికి పెరిగింది. 2023 ఆగస్టు మాసం నుండి నిరుద్యోగం రేటు 3.7 శాతం నుండి 3.9శాతం మధ్యనే మారుతూ వస్తోందని లేబర్‌ బ్యూరో పేర్కొంది.
2022 జనవరి నుండి చూసినట్లైతే తాజాగా నమోదైన 4శాతాన్ని అత్యధికంగా పరిగణిస్తున్నారు. ఈ పరిస్థితి ఆర్థికవేత్తల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అంతంత మాత్రంగా వున్న లేబర్‌ మార్కెట్‌ ఇంకా క్షీణిస్తుందనే భయం కలిగిస్తోందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ఈనాడు నెలకొన్న ఈ ఉపాధి డేటా ప్రభుత్వాన్ని వేచి చూసే ధోరణిలో పెడుతుందని వెల్స్‌ ఫార్గో సెక్యూరిటీస్‌కి చెందిన ఆర్థికవేత్త మైఖేల్‌ పగ్లీస్‌ వ్యాఖ్యానించారు. రాబోయే కాలానికి వడ్డీ రేట్లు తగ్గించేందుకు గానూ ఈ వేసవిలో మందగిస్తున్న ద్రవ్యోల్బణ నివేదికలను విధానకర్తలు పరిశీలిం చాల్సిన అవసరం వుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం వెలువడనున్న వినిమయ ధరల సూచీ (సిపిఐ) నివేదికపైనే అందరి కళ్లు వున్నాయి.

➡️