- ఎన్నికల హామీ మేరకు ఇవ్వాలని నిర్ణయం
- ఈ ఏడాది నుంచే అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందిస్తున్న పరిహారాన్ని రూ.20 వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ మొత్తాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీంతో లబ్ధిదారుల జాబితాపై మరోసారి రీ సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు మరోసారి సర్వే పనిలో ఉన్నారు. జాబితా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పరిహారం పెంపుపై మార్గదర్శకాలు వెలువడవచ్చని అధికారులు చెప్తున్నారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేటపై నిషేధం అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఈ 61 రోజుల పాటు ఏటా రూ.పది వేల చొప్పున పరిహారంగా గత వైసిపి ప్రభుత్వం ఇచ్చింది. దీనికి మరో రూ.10 వేలు కలిపి రూ.20 వేలు ఇస్తామని గత ఎన్నికల్లో టిడిపి హామీ ఇచ్చింది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటివరకు పరిహారం సొమ్మును మత్స్యకారుల ఖాతాల్లో జమ చేయలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం, లబ్ధిదారుల సర్వే చాలా ఆలస్యంగా చేపట్టడంతో పరిహారం ఇంకా జమకాలేదు.
రాష్ట్రంలో చేపల వేటపై ఆధారపడి బతుకుతున్న మత్స్యకారులందరికీ భృతి అందించడానికి అనుగుణంగా జాబితాలను సిద్ధం చేయాలని, రీ సర్వే నిర్వహించాలని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ నెల పదో తేదీన అమరావతిలో మత్స్యశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు మరోసారి జాబితాలను తనిఖీ చేస్తున్నారు. దీంతోపాటు సాంకేతిక కారణాలతో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాని పరిస్థితులు గతంలో తలెత్తిన నేపథ్యంలో ఆధార్, బ్యాంకు ఖాతాల పత్రాలను పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మే రెండో తేదీన మొదటిసారి సర్వే నిర్వహించారు. జూన్ రెండో తేదీ నాటికి ప్రాథమిక జాబితా పూర్తయింది. ఆ జాబితా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1,30,128 మంది మత్స్యకారులను సర్వే చేశారు. వీరిలో ప్రాథమికంగా 1,05,387 మందిని అర్హులుగా గుర్తించారు. మత్స్యకార భరోసాకు గత ప్రభుత్వం విధించిన రకరకాల కారణాలతో 24,741 మందిని అనర్హులుగా పెండింగ్‌లో ఉంచారు.
డీజిల్ వాడకం నిబంధనపై నిర్ణయమేమిటో?
మత్స్యకార భరోసా చెల్లింపునకు గత ప్రభుత్వం డీజిల్ వాడకాన్ని మెలిక పెట్టింది. మత్స్యకారుల బోట్లకు ప్రభుత్వం ఏడాదికి లీటరుకు రూ.9 చొప్పున సబ్సిడీతో 300 లీటర్ల డీజిల్‌ను అందిస్తోంది. కనీసం వంద లీటర్లనూ వినియోగించని వారిని అనర్హుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. గతేడాది ఈ నిబంధన ఉన్నా మినహాయింపు ఇచ్చింది. ఈ సంవత్సరం దాన్ని అమలు చేయాలని నిర్ణయించి, అందుకనుగుణంగా జాబితాను తయారు చేశారు. అదే అమలైతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18 వేల మంది అనర్హులుగా మారనున్నారు. దీనిపై అధికారులు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ నిర్ణయం కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
ఆ నిబంధనలు యథాతథమేనా?
మత్స్యకార భరోసాకు గత ప్రభుత్వం అనేక నిబంధనలు విధించింది. పరిహారం పొందేందుకు 18 నుంచి 60 ఏళ్ల వయసు, కుటుంబంలో ఒకరికి మాత్రమే సాయం, మత్స్యకార పెన్షన్ పొందుతున్న వారిని వడపోశారు. పల్లం భూమి మూడు ఎకరాలుగానీ, మెట్టు పది ఎకరాలకుగానీ మించి ఉన్న వారిని, నాలుగు చక్రాల వాహనం ఉన్న వారిని, కుటుంబ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించి వాడిన వారిని అనర్హుల జాబితాలో చేర్చారు. కుటుంబంలో ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులు ఉంటే వారిని అనర్హులుగా పేర్కొంది. కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తుంటే వారికీ పథకం వర్తింపజేయలేదు. టిడిపి కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత నిబంధనల్లో కొంత సడలింపు ఉంటుందని మత్స్యకారులు భావించారు. పరిహారం జాబితాలపై రీ సర్వే చేపట్టాలని ప్రభుత్వం సూచించిందే తప్ప, కొత్త జాబితాలను రూపొందించాలని ఎక్కడా చెప్పలేదు. దీంతో, నిబంధనలు యథాతథంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.