మూణ్ణాళ్ల ముచ్చటే… గ్రామ వార్డు సచివాలయాల్లో నిలిచిన రిజిస్ట్రేషన్స్‌

3645 సచివాలయాల్లో 4996 రిజిస్ట్రేషన్లు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :”భూములు, భవనాలు, స్ధలాలు రిజిస్ట్రేషన్‌ చేయాలంటే ఇకపై సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదు”దళారీల జోక్యం ఎంతమాత్రమూ ఉండదు.” ఎవరికి ఎటువంటి అదనపు సొమ్ము చెల్లించనవసరం లేదు” ఎవరి గ్రామంలో వారే తమ ఆస్తులను రిజిస్టర్‌ చేయించుకోవచ్చు” అంటూ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్‌ విధానం ఆరంభశూరత్వంగా మిగిలింది . విలువైన భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ పనులు సులభతరం అవుతాయని భావించిన ప్రజలకు ఆ ఆనందం ఎంతోకాలం మిగల్లేదు. ప్రభుత్వం ప్రకటించినదానికి, ఆచరణకు పొంతన కుదరడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా స్ధానికంగా గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో క్రయ, విక్రయ దారులు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3645 సచివాలయాల్లో దశల వారీగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. పైలట్‌ ప్రాజెక్టు కింద 2022 పిబ్రవరిలో 56 గ్రామ వార్డు సచివాలయాల్లోనూ, రెండోదశ కింద మరో 1600 సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. వాటిల్లో తూతూ మంత్రంగా 4996 రిజిస్ట్రేషన్లు జరిగాయి. సరాసరి ఒక్కో సచివాలయంలో రెండు రిజిస్ట్రేషన్లు కూడా జరగలేదని లెక్కలు చెబుతున్నాయి.
భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో తొలుత కొంత మేర రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ అనంతరం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వారు కరువయ్యారు. ఒక వైపు భూములు, ఆస్తులు అమ్ముకున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్తున్నారే తప్ప సచివాలయాలకు వెళ్లడం లేదు. దీనికితోడు గ్రామవార్డు సచివాలయాల్లో రికార్డుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు తమ ఆస్తుల డాక్యుమెంట్లకు రక్షణ కరువవుతుందనే ఆందోళన కూడా రిజిస్ట్రేషన్ల తగ్గుదలకు కారణమనే వాదన ఉంది. గతేడాది సెప్టెంబరులో ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ అమలవుతున్న 1.0 వెర్షన్‌ స్దానంలో కార్డ్‌్‌ ప్రైమ్‌ సిస్టమ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా ఉంటుందని పంచాయతీ సెక్రటరీ, డిజిటల్‌ అసిస్టెంట్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్టర్‌ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి రిజిస్ట్రేషన్‌ శాఖ మూడునెలల పాటు శిక్షణ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు అనుమతించిన గ్రామ, వార్డు సచివాలయాల్లో 2.0 వెర్షన్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలను పరిష్కరించకపోవడంతో ప్రభుత్వ ఆశయానికి గండిపడినట్లయ్యింది. ఇదే విషయంపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అందుబాటులోకి రాలేదు.

➡️