రీసర్వే గ్రామాల్లో ఆగిన రిజిస్ట్రేషన్లు

  • నిలిచిన భూ అమ్మకాలు, కొనుగోళ్లు
  • మూడు నెలలుగా ఇదే పరిస్థితి

ప్రజాశక్తి – చిలమత్తూరు (శ్రీసత్యసాయి జిల్లా) : గత ప్రభుత్వంలో రీసర్వే పూర్తయి ఎల్‌పిఎం (ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌) నంబర్‌తో 1బి అడంగల్‌ అప్‌డేట్‌ అయిన రెవెన్యూ గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్‌ వెబ్‌సైట్‌లో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయకపోవడంతో మూడు నెలలుగా భూ అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల క్రితం రీసర్వే పూర్తయిన గ్రామాలకు ఎల్‌పిఎం నంబర్‌లతో వెబ్‌ల్యాండ్‌ అప్‌డేట్‌ చేశారు. దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ వెబ్‌సైట్‌ని డిజైన్‌ చేయలేదు. ఎన్నికల ప్రక్రియ మొదలవ్వడంతో ప్రభుత్వం ఇందుకు చర్యలు తీసుకోలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను పూర్తిగా రద్దు చేసింది. దీంతో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూముల అమ్మకాలు, కొనుగోలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయాయి.

ఎల్‌ పిఎం నెంబర్‌లు కొనసాగుతాయా..? రద్దు చేస్తారా..?
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌లో భాగంగా అమలులోకి వచ్చిన ఎల్‌పిఎం నంబర్‌లు అలాగే ఉంటాయా? రీసర్వేనే రద్దు చేస్తారా.? అన్న అయోమయం రైతుల్లో నెలకొంది. వెబ్‌ల్యాండ్‌లో ఎల్‌పిఎం నంబర్‌ను తొలిగించి సర్వే నంబర్‌ నమోదు చేయాలి. లేకంటే ఎల్‌పిఎం నంబర్‌పై రిజిస్ట్రేషన్‌ అయ్యేలా రిజిస్ట్రేషన్‌ సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయాలి. ఈ రెండింటిలో ప్రభుత్వం ఏ చర్యలూ చేపట్టకపోవడంతో క్రయ విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా రీసర్వే జరిగిన రెవెన్యూ పొలాలకు ఒకలా.. మిగిలిన వాటికి మరోలా రిజిస్ట్రేషన్‌ పక్రియను మార్చడం సాంకేతికంగా చాలా కష్టతరం. ప్రస్తుతం పాత విధానంలో ఉన్న సర్వే నంబర్‌లు రిజిస్ట్రేషన్‌ అవుతున్నా, రీసర్వే జరిగిన రెవెన్యూ పొలాలు మాత్రం రిజిస్ట్రేషన్‌ కావడం లేదు.

రిజిస్ట్రేషన్‌ కాని రెవెన్యూ గ్రామాలు
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండల పరిధిలోని దేమకేతేపల్లి, ఎర్రసింగేపల్లి, యగ్నిశెట్టిపల్లి, నరేముద్దేపల్లి, మర్రిమాకులపల్లి, సుబ్బరావుపేట రెవెన్యూ గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మండలంలో మాదిరిగానే దాదాపు రాష్ట్రంలో రీ సర్వే చేసిన అన్ని గ్రామాల్లోనూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ల్యాండ్‌ టైట్‌లింగ్‌ యాక్ట్‌ను ఎలాగో రద్దు చేశారు కాబట్టి పాత పద్ధతిలో వెబ్‌ల్యాండ్‌ను అప్‌డేట్‌ చేసి యథావిధిగా క్రయవిక్రయాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

త్వరలోనే పరిష్కారం : సబ్‌ రిజిస్టర్‌ వెంకట నారాయణ
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు, లేపాక్షి, గోరంట్ల పరిధిలో రీసర్వే పూర్తయిన 14 రెవెన్యూ గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు కావడం లేదు. సర్వే నంబర్‌కు బదులు ఎల్‌పిఎం నంబర్‌లు అప్‌డేట్‌ అయినప్పటి నుంచి ఈ సమస్య ఉంది. సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది.

➡️