ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్సిటీలోని 20 విభాగాలకు సీనియర్ రెసిడెంట్ వైద్యులను అడహాక్ పద్ధతిన ఈ నెల 14న వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహణకు రిజిస్ట్రార్ శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు. అనాటమి విభాగంలో నాలుగు, బయో కెమిస్ట్రీ రెండు, కార్డియాక్ సర్జరీ ఒకటి, కార్డియాలజీ ఒకటి, కమ్యూనిటీ మెడిసిన్ రెండు, ఫోరెన్సిక్ మెడిసిన్ నాలుగు, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఒకటి, మెడికల్ అంకాలజీ ఒకటి, మైక్రో బయాలజీ రెండు, నెఫ్రాలజీ ఒకటి, న్యూరో సర్జరీ ఒకటి, ఒబిజి మూడు, ఆర్థినోలర్జి ఒకటి, పిడియాట్రిక్స్ మూడు, ఫార్మాకాలజీ మూడు, ఫిజియాలజీ నాలుగు, రుమటాలజీ ఒకటి, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఒకటి, సర్జికల్ ఆంకాలజీ ఒకటి, యురాలజీ విభాగంలో ఒక పోస్టు చొప్పున మొత్తం 38 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో పైపోస్టులకు ‘హిందూ మతానికి చెందిన వారు మాత్రమే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు రావాలి’ అని ప్రత్యేకించి సూచించడం గమనార్హం. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం రేడియాలజీ విభాగంలె ఇదే విధంగా మతప్రాతిపదికన ఆరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు రావడంతో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. తాజాగా ఆ ఆరు పోస్టులనూ కలిపి 38 పోస్టులకు మళ్లీ మతం ప్రాతిపాదికనే నోటిఫికేషన్ ఇవ్వడం గమనార్హం. రెండేళ్ల క్రితం స్విమ్స్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండేవారు. మతప్రాతిపదికన కాకుండా అర్హులకు పోస్టుల భర్తీలో అవకాశం కల్పించేవారు. ఇటీవల స్విమ్స్‌ను టిటిడిలో విలీనం చేయడంతో ప్రస్తుత టిటిడి చైర్మన్ యూనివర్సిటీకిఛైర్మన్‌గా, ఇఒ కమిటీ మెంబర్‌గా వ్యవహరిస్తారు.
మత వివక్ష తగదు : సిపిఎం
స్విమ్స్ యూనివర్సిటీలో సీనియర్ రెసిడెంట్ వైద్యుల పోస్టుల భర్తీలో మత వివక్ష పాటించడం రాజ్యాంగ వ్యతిరేకమని సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మతాన్ని బట్టి వివక్షత చూపడం చట్ట విరుద్ధమని, అప్రజాస్వామికమని తెలిపారు. టిటిడి ఆధ్వర్యంలో నడిచే విద్య, వైద్య సంస్థలు ప్రభుత్వ నియమనిబంధనలకు, రాజ్యాంగ వ్యవస్థకు లోబడి పని చేయాలని, అవి కూడా లౌకిక సంస్థలేనని పేర్కొన్నారు. ఇప్పటివరకు లేని నిబంధనలను ఉన్నట్లుండి ఒక్కసారిగా ముందుకు తేవడంలో రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బిజెపి, దాని మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర కనిపిస్తోందని విమర్శించారు. ఈ నిబంధనను ఉహసంహరించుకొని మతానికి అతీతంగా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మతం పేరుతో సాగుతున్న ఈ వివక్షతాపూరితమైన నిబంధనను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.