‘మత’ రాజకీయ ప్రకటనలు !

May 15,2024 04:12 #2024 election, #BJP
  •  ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు కోట్లలో చెల్లింపులు, సింహభాగం బిజెపిదే
  •  ఆ పార్టీకి అనుకూలంగా అదృశ్య ఖాతాలు, విద్వేషాలు రెచ్చగొట్టడమే వాటి లక్ష్యం

న్యూఢిల్లీ : ఈ నెల 7న లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ జరగడానికి రెండు వారాల ముందు మెటా వేదికల్లో రాజకీయ ప్రకటనల కోసం పేరొందిన 20 ప్రచార సంస్థలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు రూ.17 కోట్లు చెల్లించాయి. వీటిలో కనీసం 30 ప్రకటనలు మతపరమైనవి. ముస్లిములకు వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వీటిని ఉద్దేశించారు. ఏప్రిల్‌ 23-మే 6 తేదీల మధ్య జరిపిన చెల్లింపుల్లో కేవలం ఐదు మాత్రమే రాజకీయ పార్టీల నుంచి జరిగాయి. మిగిలిన పదిహేను స్వయం ఉపాధి పొందుతున్న వారు జరిపిన చెల్లింపులే. ఇవి అదృశ్య ఖాతాల నుంచి జరుగుతుంటాయి. ఇవి ఎవరివో తెలుసుకోవడం అసాధ్యం. వీరందరూ తమ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పేజీల నుంచి రాజకీయ ప్రకటనలు ఇచ్చారు.

బిజెపి ఖర్చే అధికం
మూడో దశ పోలింగ్‌కు రెండు వారాల ముందు మెటా వేదికల్లో రాజకీయ ప్రకటనల కోసం బిజెపి అత్యధికంగా రూ.5.63 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ రూ.4.81 కోట్లతో రెండో స్థానంలో ఉంది. బిజూ జనతాదళ్‌ (బిజెడి) తన అనుబంధ పేజీ అయిన ‘అమా చిన్హా సంకా చిన్హా’ నుండి ప్రకటనల కోసం రూ.2.15 కోట్లు ఖర్చు చేసింది. బిజెపి అనుకూల ప్రకటనలు ఇచ్చే చరిత్ర కలిగిన ఫిర్‌ ఏక్‌బార్‌ మోడీ సర్కార్‌, మనమోడీ పేజీలను నిర్వహించే గుర్తు తెలియని ఖాతాల నుండి రూ.57.64 లక్షలు, రూ.42.17 లక్షల చెల్లింపులు జరిగాయి. తెలుగుదేశం (రూ.32.16 లక్షలు), తృణమూల్‌ కాంగ్రెస్‌ (రూ.23.84 లక్షలు) కంటే ఈ అదృశ్య (గుర్తు తెలియని) ఖాతాల నుండే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు జరిగాయి. కాంగ్రెస్‌, బిజెడి, తెలుగుదేశం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పెట్టిన ప్రకటనల ఖర్చును మినహాయిస్తే మిగిలిన చెల్లింపుల్లో అధిక భాగం బిజెపికి మద్దతు ఇస్తున్న సంస్థలు చేసినవే.

అదృశ్య ఖాతాల నుండి అనుకూల ప్రకటనలు
ఏప్రిల్‌ 19న జరిగిన తొలి దశ పోలింగ్‌కు ముందు కూడా అనేక గుర్తు తెలియని సంస్థలు మెటా వేదికల్లో బిజెపి అనుకూల ప్రకటనలు ఇచ్చాయి. వాటిలో చాలా వరకూ మతపరమైనవే. మెటా నిబంధనల ప్రకారం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో రాజకీయ ప్రకటనలు ఇచ్చేవారు ముందుగా తమ ఫోన్‌ నెంబర్లు అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ నెంబరుతో ఉన్న ఫోన్లన్నీ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడం గమనార్హం. నిబంధనలను తరచూ ఉల్లంఘించే సంస్థలకు జరిమానాలు విధిస్తామని మెటా ప్రతినిధి తెలిపారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే గుర్తు తెలియని వ్యక్తులు లేదా సంస్థలు ఇచ్చే రాజకీయ ప్రకటనలు మెటా విధానాలను ఉల్లంఘించడం లేదు. అందువల్ల వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
బిజెపి కర్ణాటక రాష్ట్ర శాఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఓ పోస్ట్‌ పెట్టింది. కాంగ్రెస్‌ పార్టీ ముస్లిములకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి తరగతుల రిజర్వేషన్లను లాక్కొని ముస్లిములకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని దాని సారాంశం. ఈ వీడియోను తొలగించాలంటూ ఎక్స్‌ను ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఆ వీడియోను ఎక్స్‌ తొలగించింది. మెటా వేదికల్లో వచ్చిన బిజెపి అనుకూల ప్రకటనల కోసం రూ.27.6 లక్షలు ఖర్చు చేశారు. బిజెపి అనుకూల ప్రకటనలు నడిపే ‘సిద్ధ ఛష్మా’ అకౌంట్‌ కూడా కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తూ ఓ యాడ్‌ ఇచ్చింది. ఏప్రిల్‌ 24-27 తేదీల మధ్య ఈ ప్రకటన వచ్చింది. దీనికి లక్షలాది హిట్లు కూడా వచ్చాయి. వీటిపై సిద్ధ ఛష్మా రూ.16 లక్షలు ఖర్చు చేసింది. ముద్దే కీ బాత్‌ పేరుతో ఉన్న మరో పేజీలో కూడా ఈ ప్రకటన వచ్చింది. మొత్తంగా బిజెపి అనుకూల ప్రకటనల కోసం సిద్ధ ఛష్మా రూ.31.64 లక్షలు, ముద్దే కీ బాత్‌ రూ.21.4 లక్షలు ఖర్చు చేశాయి.

➡️