మళ్లీ ‘సాగు ధ్రువీకరణ’ పునరుద్ధరణ?

2016 నుంచి ఎల్‌ఇసిలకు సమాంతరంగా సిఒసిలు
సిసిఆర్‌సి చట్ట సవరణే పరిష్కారం : న్యాయ నిపుణులు
ఆ విషయం చర్చించని కేబినెట్‌

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : కౌలు రైతుల గుర్తింపునకు తమ హయాంలో ప్రవేశపెట్టిన సాగు ధ్రువీకరణ పత్రాల (సర్టిఫికెట్‌ ఆఫ్‌ కల్టివేషన్‌-సిఒసి)ను టిడిపి కూటమి ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించనున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో కౌలు రైతుల గుర్తింపునకు రుణ అర్హత కార్డులు (ఎల్‌ఇసి) ఉండగా, రాష్ట్ర విభజన అనంతరం 2016లో టిడిపి సర్కారు సిఒసిలను తీసుకొచ్చింది. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఎల్‌ఇసి, సిఒసిలను ఎత్తేసి ప్రత్యేక చట్టం ద్వారా పంట సాగుదారు హక్కు కార్డు (సిసిఆర్‌సి) లను అమల్లోకి తెచ్చింది. కాగా సిసిఆర్‌సిల జారీకి భూమి యజమాని సంతకం తప్పనిసరి చేయడంతో ఆ నిబంధన లేకుండా తమకు గుర్తింపు కార్డులివ్వాలని కౌలు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులవు తున్న సమయాన బుధవారం నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో కౌలు రైతులకు ల్యాండ్‌ ఓనర్ల సంతకంతో ప్రమేయం లేకుండా ఈ రబీ నుంచి గుర్తింపు కార్డులివ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. సర్కారు ఏ పద్ధతిలో కార్డులివ్వబోతోందన్నదానిపై చర్చ సాగుతోంది.

ఇదీ ప్రస్థానం
సరైన గుర్తింపు లేక తమకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందట్లేదని కౌలు రైతుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ఎపి ల్యాండ్‌ లైసెన్స్‌డ్‌ కల్టివేటర్స్‌ యాక్ట్‌’ను తీసుకొచ్చింది. దాని ప్రకారం భూ యజమానులతో సంబంధం లేకుండా రెవెన్యూ అధికారులు గ్రామసభల ద్వారా కౌలు రైతులను గుర్తించి ఎల్‌ఇసిలను జారీ చేయాలి. చాలాచోట్ల భూస్వాములు, పెత్తందార్ల ప్రభావంతోనే ఎల్‌ఇసిలు జారీ చేశారు. కార్డులున్నా బ్యాంకులు ఏవో కొర్రీలు వేసి చాలా మందికి లోన్లు ఇవ్వలేదు. అయినప్పటికీ కొంతలో కొంత కౌలు రైతులకు కార్డులు, రుణాలు అందాయి. ఇదిలా ఉండగా, ఎల్‌ఇసిలను ఒక వైపు కొనసాగిస్తూనే టిడిపి ప్రభుత్వం సిఒసిలను ముందుకు తెచ్చింది. వ్యవసాయశాఖ మెమో నెం.క్రెడిట్‌/02/2016 తో జులై 1న ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ వెలువడ్డాయి. ఇ-సేవా కేంద్రాల్లో అర్జీలు పెట్టుకోమన్నారు. ఎల్‌ఇసిలు రెవెన్యూ అధికారు లివ్వగా సిఒసిలను మండల వ్యవసాయాధికారుల (ఎఒ)తో ఇప్పించారు. ఎల్‌ఇసిలు ఫెయిల్‌ అయ్యాయని సిఒసిలను తేగా, వాటి జారీ సైతం సరిగ్గా జరగలేదు. 2016-17లో కేవలం 31 వేల సిఒసిలే జారీ అయ్యాయి. ఆ ఏడాది 2 వేల సిఒసిలపై బ్యాంకులు రూ.9 కోట్ల రుణాలిచ్చాయి. 2017-18లో 31 వేల కార్డులపై రూ.185 కోట్లు, 2018-19లో 80 వేల కార్డులపై రూ.494 కోట్లు రుణాలొచ్చాయి. వైసిపి వచ్చాక ఎల్‌ఇసి చట్టాన్ని, అంతకుముందున్న ఎపి టెనెన్స్‌ యాక్ట్‌ (ఆంధ్రా ఏరియా)-1956 చట్టాలను రద్దు చేసి ఎపి క్రాప్‌ కల్టివేటర్స్‌ రైట్స్‌ యాక్ట్‌ను (సిసిఆర్‌సి) 2019 జులైలో తీసుకొచ్చింది.

చట్టం మారుతుందా?
భూ యజమానుల సంతకం లేకుండా సిసిఆర్‌సిలు ఇవ్వాలంటే సిసిఆర్‌సి చట్టానికి సవరణలు చేయాలి. అంటే సవరణ చట్టం తేవాలి. ఆ విషయంపై కేబినెట్‌లో చర్చించలేదని సమాచారం. చట్టం అమలు కోసం ఇచ్చే రూల్స్‌లో మార్పు చేస్తే సరిపోతుందనుకు న్నా… చట్టంలో ఓనరు, కౌల్దారు మధ్య అగ్రిమెంట్‌ నమోదు చేయాలని ఉంది. కాబట్టి చట్ట సవరణ జరిగి తేనే కుదురుతుందనేది న్యాయ నిపుణుల అభిప్రాయం. లేకపోతే మొత్తానికే సిసిఆర్‌సి చట్టాన్ని రద్దు చేయాలి. ప్రస్తుతం గ్రామ సచివాలయంలోని రెవెన్యూ అధికారి (విఆర్‌ఒ) సిసిఆర్‌సిలు జారీ చేస్తున్నారు. కేబినెట్‌ నిర్ణయం ప్రకారం ఇక నుంచి సిసిఆర్‌సిలను వ్యవసాయాధికారులు ఇస్తారన్నారు. అంటే సిసిఆర్‌సి చట్టం, దాని రూల్స్‌ ఉండగా అది సాధ్యం కాదు. దీన్నిబట్టి గతంలోని సిఒసిలను తిరిగి ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఎల్‌ఇసి, సిసిఆర్‌సి చట్టాలున్నప్పుడే బ్యాంకులు కౌలు రైతులకు రుణాలివ్వలేదు. అధికారుల మెమోలు, సర్క్యులర్లు, జిఒలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయా అన్నది ప్రశ్న. ఖరీఫ్‌ సీజన్‌ సెప్టెంబరు ఆఖరుతో ముగుస్తుంది. అక్టోబరు నుంచి రబీ మొదలవుతుంది. ఈ తక్కువ సమయంలో సిసిఆర్‌సిలపై కూటమి సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

➡️