అద్దె మోత…. వడ్డీ భారం

  • ఆందోళనలో టిడ్కో గృహాల లబ్ధిదారులు
  • టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నిరాశే

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా టిడ్కో గృహాలను పూర్తి చేసి పట్టణ పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా ఈ గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీంతో, నెలవారీ అద్దె బాధలు, అప్పు చేసి చెల్లించిన డిపాజిట్లకు వడ్డీ చెల్లింపుతో ఇంకా గృహాలను పొందని లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు గృహాలు పొందిన లబ్ధిదారులు టిడ్కో కాలనీల్లో మౌలిక వసతుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. టిడ్కో ఫ్లాట్లు అందలేదని, కాలనీల్లో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల సిపిఎం నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రల్లో పట్టణ ప్రాంత ప్రజలు ఏకరువు పెట్టారు. ఈ సమస్యల పరిష్కారానికి వార్డు సచివాలయాల్లో సిపిఎం నేతలతో కలిసి వినతులు అందించారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరంలోని 37 డివిజన్‌కు చెందిన పేటేటి శ్రీథర్‌, యడవల్లి లక్ష్మి, బిట్ర కావ్య… ఉయ్యూరు పట్టణం 15వ వార్డు కాకాని గిరిజన కాలనీలో అద్దె గృహాల్లో నివాసం ఉంటున్నారు. 2017లో టిడ్కో జి-ప్లస్‌ త్రీ అపార్టుమెంట్లలో ప్లాట్ల కోసం ఒక్కొక్కరు రూ.25 వేల చొప్పున డిడిలు చెల్లించారు. డిపాజిట్‌ చెల్లించి ఎనిమిదేళ్లవుతున్నా వీరికి గృహాలను ప్రభుత్వం స్వాధీనం చేయలేదు. దీంతో, వీరు నెలనెలా వారు నివాసం ఉంటున్న గృహాలకు అద్దె చెల్లించక తప్పడం లేదు. రోజువారీ పనులు చేసుకుంటూ జీవిస్తోన్న ఈ కుటుంబాల వారు డిపాజిట్‌ కట్టడానికి తీసుకున్న ప్రైవేట్‌ అప్పునకు వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఈ ముగ్గురి సమస్య మాత్రమే కాదు…. టిడ్కో గృహాల లబ్ధిదారుల్లో ఎక్కువమంది పరిస్థితి ఈ విధంగానే ఉది. 2017లో మచిలీపట్నం నగరపాలక సంస్ధలోనూ, కృష్ణా జిల్లా గుడివాడ, పెడన, ఉయ్యూరు మున్సిపాల్టీల్లోనూ 28,336 మందిని టిడ్కో గృహాల లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తించింది. గత వైసిపి ప్రభుత్వం 12,728 మంది ఫ్లాట్ల నిర్మాణాలను వివిధ కారణాలను చూపుతూ రద్దు చేసింది. అయితే, ఫ్లాట్ల డిపాజిట్‌ నగదును లబ్ధిదారులకు తిరిగి చెల్లించలేదు. మచిలీపట్నంలో 2,150, గుడివాడలో 8,912 మందికి మొత్తం 11,062 మంది లబ్ధిదారులకు ఫ్లాట్లు పంపిణీ చేశారు. మచిలీపట్నంలో 2,050 మంది, ఉయ్యూరు మున్సిపాలిటీలో 2,496 మంది చొప్పున మొత్తం 4,546 మంది టిడ్కో లబ్ధిదారులు గత ఎనిమిదేళ్లుగా గృహాల కోసం ఎదురు చూస్తున్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ గృహాల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. టిడ్కో గృహాల నిర్మాణాన్ని కాంట్రాక్టు సంస్థ ఎల్‌ అండ్‌ టి కంపెనీ చేపట్టింది. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులను మధ్యలో నిలిపివేసింది. దీంతో, గృహాల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గృహాల నిర్మాణాన్ని వెంటనే పూర్తి వాటిని తమకు స్వాధీనం చేయాలని, లబ్ధిదారులు కోరుతున్నారు. పూర్తయిన ఫ్లాంట్లను లబ్ధిదారులకు అందించకుండా తీవ్ర జాప్యం చేస్తోంది.

టిడ్కో కాలనీల్లో మౌలిక వసతుల సమస్య

గుడివాడ టిడ్కో ఎ బ్లాక్‌ 28 మూడో ఫ్లోర్‌ ప్లాట్‌లో పి.అనిత, సి 21 సెకండ్‌ ఫ్లోర్‌లో ఎం.మేరి ఉంటున్నారు. కింద నుంచి మూడు, రెండో ఫ్లోర్‌లోని తమ ఫ్లాట్లకు నీరు మోసుకొని తీసుకెళ్లాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. టిడ్కో కాలనీకి రోజు విడిచి రోజు తాగు నీరిస్తున్నారని, కాలనీలో రోజువారీ వినియోగానికి నీరు అందుబాటులో లేదని మచిలీపట్నం టిడ్కో కాలనీలో నివాసముండే బి.సుబ్రహ్మణ్యం తెలిపారు. గుడివాడ, మచిలీపట్నం టిడ్కో ఫ్లాట్లలో ఏర్పాటు చేసిన డ్రెయిన్ల పైప్‌లు పగిలిపోవడంతో దుర్గంథం వెదజల్లుతోందని, రోజువారీ చెత్త సేకరణ చేయకపోవడంతో ఎక్కడకక్కడే అపారిశుధ్యం పేరుకుపోయి దోమలు విజృంభించి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని ఈ రెండు పట్టణాల్లోని టిడ్కో కాలనీ వాసులు వాపోతున్నారు. టిడ్కో కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని, అపారిశుధ్యం , ఇతర సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

➡️