- జనసేన నేతల నడుమ కోల్డ్‌వార్
- వారి విభేదాలు వాడుకుంటున్న కొందరు టిడిపి నేతలు
- ఎలాగైనా బయటపడే ఎత్తులో వైసిపి నాయకుడు
- మూడు పార్టీల ప్రయోజనాల్లో రైస్ అక్రమాలు మాఫీ
- కేసులు, దర్యాప్తులపై కాలయాపన?
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం జనసేనలో చిచ్చు పెట్టినట్లు సమాచారం. ఇద్దరు ముఖ్య నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిని టిడిపిలోని కొందరు నేతలు తమకనుకూలంగా మార్చుకుంటున్నట్లు ఇరుపార్టీల్లో జోరుగా చర్చ సాగుతోంది. కాగా కూటమిలోని రెండు పార్టీల మధ్య నెలకొన్న విభేదాలను కొన్నేళ్లుగా కాకినాడ పోర్టును తన స్వంత అడ్డాగా మార్చుకొని లక్షల టన్నుల ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు రవాణా చేసిన వైసిపి నేత తాను కేసుల నుంచి బయట పడేందుకు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఆ మూడు పార్టీలకు చెందిన కొందరి స్వార్ధ, రాజకీయ ప్రయోజనాల మూలంగానే బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర దర్యాప్తు, బియ్యం పట్టుబడిన స్టెల్లా నౌక సీజ్, కేసుల నమోదు, బాధ్యులపై చర్యలు చేపట్టట్లేదని ఆరోపణలొస్తున్నాయి. బియ్యం అక్రమ రవాణాను రాజకీయ విమర్శలకు ఉపయోగించడానికి, వీలైన మేరకు కేసులను తాత్సారం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొదలెక్కడంటే…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతోందంటూ సమీక్ష చేసి, కొద్ది మొత్తంలో బియ్యాన్ని పట్టుకొని, ఈ వ్యవహారంలో ఆలిండియా సర్వీస్ అధికారుల పాత్ర ఉందని ప్రకటించారు. అనంతరం కొన్ని మాసాల వరకు ఎలాంటి దర్యాప్తు లేదు. ఇటీవల నెల్లూరు పర్యటనలో ఉన్న డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్‌కు జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు స్టెల్లా నౌక గురించి ఉప్పందించారు. ఆ నౌకను దాటించేస్తారన్న ఆలోచనతో హుటాహుటిన పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు చేరుకొని నౌకలో అక్రమంగా తరలుతున్న బియ్యాన్ని సీజ్ చేయించేందుకు ప్రయత్నించారు. మామూలుగా అయితే తమ పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లయిస్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన్ని అప్రమత్తం చేయకుండా పవన్ కళ్యాణే నేరుగా కాకినాడకు వెళ్లడంతో చర్చ మొదలైంది. నాదెండ్లపైనా, సివిల్ సప్లయిస్ అధికారులపై నమ్మకం లేకనే పవన్ నేరుగా రంగంలోకి దిగారనీ చెబుతున్నారు. నాదెండ్ల కావాలనే బియ్యం అక్రమ రవాణాపై సాచివేతగా ఉన్నారని అనుమానించడం వల్లనే పవన్ నేరుగా కార్యరంగంలోకి దిగారని సమాచారం. పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాలో కొందరు టిడిపి నేతల ప్రమేయం కూడా ఉందని, వారికి నాదెండ్ల పరోక్షంగా సహకరిస్తున్నారన్న అనుమానం పవన్‌లో ఉందని జనసేన పార్టీలో చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా, వాటాలు కుదరకనే పవన్ కాకినాడకు వెళ్లారన్న ఆరోపణలు ఇటు జనసేనలో ఒక గ్రూపు నుంచి అటు టిడిపి నుంచి వస్తున్నాయి. మొత్తానికి బియ్యం అక్రమ రవాణా జనసేన ముఖ్య నేతల్లో తీవ్ర విభేదాలకు కారణమైందన్న వాదనలు బయలుదేరాయి.
వ్యూహాత్మకంగా ‘దేశం’ నేతలు
పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాకు కొందరు టిడిపి మంత్రుల అండదండలున్నాయని సమాచారం. తమ వారిని రక్షించుకునేందుకు జనసేన మంత్రుల మధ్య నెలకొన్న విభేదాలను వ్యూహాత్మకంగా ఉపయోగ పెట్టుకుంటున్నట్లు టిడిపి, జనసేన పార్టీల్లో చర్చించుకుంటున్నారు. అందుకే కేబినెట్ సబ్ కమిటీ సమీక్షలకే పరిమితమవుతోందని, ఇప్పటి వరకు ఎలాంటి నిర్దిష్ట చర్యలకు, దర్యాప్తునకు నిర్ణయాలు జరగలేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, కొన్నేళ్లుగా కాకినాడ పోర్టును నడిపిస్తున్న ఓ వైసిపి కీలక నేత, ఆయన కుటుంబం జనసేన, టిడిపి ఎత్తులను తమకనుకూలంగా మార్చుకుంటున్నారని సమాచారం. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే రైస్ మిల్లర్ల, మాఫియా నెట్ వర్క్ చాలా మట్టుకు కూటమి కనుసన్నల్లోనే ఉందని, వాళ్లని వాళ్లు రక్షించుకునేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి మధ్యలో తనకేం కాదని, తాను సులభంగా కేసుల నుంచి బయట పడవచ్చన్న ఆలోచనతో అందుకనుగుణంగా చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది.