అధికమౌతున్న ఆదాయ అసమానతలు

Jan 10,2025 04:57 #inequality, #Rising income
  • జాతీయాదాయంపై సంపన్నుల పెత్తనం
  • పేదల దరి చేరని అత్యవసర సేవలు

న్యూఢిల్లీ : దేశంలో ఆదాయ అసమానతలు 1950వ దశకంలో కంటే అధికంగా ఉన్నాయని ఓ కార్యాచరణ పత్రం తెలిపింది. పీపుల్‌ రిసెర్చ్‌ ఆన్‌ ఇండియాస్‌ కన్స్యూమర్‌ ఎకానమీ (ప్రైస్‌) అనే సంస్థ రూపొందించిన ఈ పత్రాన్ని ఇటీవలే విడుదల చేశారు. సమ్మిళిత వృద్ధి, సామాజిక-ఆర్థిక సమానత్వం కోసం సమర్ధవంతమైన విధానాలను రూపొందించడానికి ఆదాయ పంపిణీని కచ్చితత్వంతో లెక్కించాల్సిన అవసరాన్ని ఈ పత్రం గుర్తు చేసింది. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రిసెర్చ్‌, ప్రైస్‌ వంటి సంస్థలు నిర్వహించిన కుటుంబ ఆదాయ సర్వేల ఆధారంగా ఈ పత్రాన్ని రూపొందించారు. వ్యక్తులు, కుటుంబాల మధ్య ఆదాయ అసమానతలను నిర్ధారించడానికి ఉపయోగించిన గణాంక పద్ధతి ‘గినీ కోఎఫీషియంట్‌’ ప్రకారం అసమానతల సూచీ 1953-55 మధ్య 0.371గా ఉంటే 2022-23లో 0.410గా ఉంది.

సమాజంలోని సంపన్నులు జాతీయాదాయంలో తమ వాటాను గణనీయంగా పెంచుకుంటుంటే గ్రామీణ, అల్పాదాయ వర్గాల ప్రజలు అత్యవసర సేవలు, విద్య, ఆరోగ్య రక్షణ, ఆర్థికావసరాలు పరిమితంగానే పొందగలుగుతున్నారని ఆ పత్రం తెలిపింది. 2015-16, 2020-21 మధ్యకాలంలో దేశంలో ఆదాయ అసమానతలకు సంబంధించిన గినీ సూచిక 0.395 నుండి 0.528కి పెరిగిందని ప్రైస్‌ సంస్థ సీఈఓ, కార్యాచరణ పత్రం రూపకర్త రాజేష్‌ శుక్లా తెలిపారు. వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ డాటాబేస్‌ (విడ్‌) ప్రకారం 2023లో దేశంలో అత్యంత సంపన్నులైన ఒక శాతం ప్రజలు 22.6 శాతం జాతీయాదాయంపై ఆధిపత్యాన్ని చెలాయించారు. కానీ భారతీయ కుటుంబ సర్వేలు మాత్రం సంపన్నుల వాటా జాతీయాదాయంలో 7.3 శాతమేనని చెబుతున్నాయి.

దేశంలో ఓ మోస్తరు సంపాదన కలిగిన 40 శాతం జనాభా వాటా జాతీయాదాయంలో 43.9 నుండి 46.6 శాతం వరకూ ఉన్నదని కుటుంబ సర్వేలు తెలిపాయి. అంటే మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్నదని అవి చెబుతున్నాయి. అయితే విడ్‌ అంచనాల ప్రకారం జాతీయాదాయంలో మధ్య తరగతి ప్రజల వాటా గణనీయంగా పడిపోయింది. 1953-55లో 41.5 శాతంగా ఉన్న వాటా 2022-23లో కేవలం 27.3 శాతానికి తగ్గిపోయింది. ఇక జనాభాలో చివరి 50 శాతంగా ఉన్న పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజలు జాతీయాదాయంలో 15.8 (2020-21) నుండి 25.5 (1961-65) శాతం మధ్య ఆదాయ వాటాను కలిగి ఉన్నారని కుటుంబ సర్వేలు తెలిపాయి. కోవిడ్‌ సమయంలో ఈ సూచీ 22.8 శాతం మధ్య కొనసాగి మెరుగుదల కనబరచింది.

భారతీయ కుటుంబ సర్వేలు, వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ డాటాబేస్‌ అంచనాలను పరిశీలిస్తే దేశీయ, అంతర్జాతీయ సర్వేల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అర్థమవుతోంది. అయినప్పటికీ ఈ రెండు సర్వేలు ఇచ్చిన ముగింపు మాత్రం ఒకేలా ఉంది. దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న వారి చేతిలోనే సంపద పోగుపడుతోంది. జనాభాలో అట్టడుగున ఉన్న 10 శాతం ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఆదాయ అసమానతలు అధికంగా ఉన్న దృష్ట్యా స్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని కార్యాచరణ పత్రం సూచించింది.

➡️