మూల హిందూత్వ మరింత సంఘటితం

  • మీడియాపై నియంత్రణ, ధనబలంతో బిజెపి గెలుపు
  • అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సిపిఎం పొలిట్‌బ్యూరో
  • క్రిమినల్‌ చట్టాల బిల్లులను సభా సంఘానికి పంపాలి
  • జమ్ముకాశ్మీర్‌లో తక్షణమే ఎన్నికలు జరిపించండి !

న్యూఢిల్లీ : మూల హిందూత్వ మరింత సంఘటితం కావడం, మత, కుల ప్రాతిపదికన ప్రజల్లో చీలికలు తేవడం, మీడియాపై నియంత్రణ, ధనబలం వల్లే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బిజెపి స్పష్టమైన విజయాన్ని సాధించిందని సిపిఎం పొలిట్‌బ్యూరో తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీ 2018 నాటి ఎన్నికలతో పోల్చితే కొంచెం అటు ఇటుగా తన ఓటింగ్‌ బలాన్ని నిలబెట్టుకున్నా..రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఆ మూడు హిందీ రాష్ట్రాల్లోనూ బిజెపి తన ఓటు షేర్‌ పెంచుకుందని పొలిట్‌బ్యూరో విశ్లేషించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మూడు రాష్ట్రాల్లోనూ మూల హిందూత్వ ఓటు ఏకీకరణ జరిగిందని పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. అత్యధిక స్థాయిలో మీడియా సంస్థలపై బిజెపి నియంత్రణ కలిగివుండటం, భారీ స్థాయిలో ధనబలం, కులాల ప్రాతిపదికన విరక్తికర చీలికలు తీసుకురావడం ఆ పార్టీ విజయానికి దారితీశాయని పేర్కొంది. తెలంగాణలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌/బిఆర్‌ఎస్‌ని ఓడించి కాంగ్రెస్‌ నిర్ణయాత్మక విజయాన్ని సాధించిందని తెలిపింది. ఏది ఏమైనా బిజెపి తన స్థాయిని ఇక్కడ కూడా మెరుగుపర్చుకుందని పేర్కొంది. ప్రజల జీవనోపాధులను రక్షించడానికి, ప్రజాతంత్ర హక్కులను, పౌర స్వేచ్ఛలను కాపడడానికి, గణతంత్ర భారతావని లౌకిక ప్రజాతంత్ర లక్షణాన్ని పరిరక్షించేందుకు లౌకిక, ప్రజాతంత్ర శక్తులు సాగిస్తున్న ప్రయత్నాలను రెట్టింపు చేయాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది.

మిచౌంగ్‌ బాధితులను ఆదుకోవాలి

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ మిచౌంగ్‌ తుపాను కారణంగా భారీస్థాయిలో నష్టం వాటిల్లడం పట్ల సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తమిళనాడులో 24 మంది, ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆందోళన వ్యక్తం చేసింది. ముంపు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో ఇంకా ముప్పు కొనసాగుతోందని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం కష్టకాలంలో ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు తగినన్ని తాత్కాలిక నిధులను కూడా ఇప్పటి వరకు ఇవ్వడం లేదని పొలిట్‌బ్యూరో విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉదారంగా స్పందించి పునరావాసానికి అవసరమైన వనరులను, సాంకేతిక సహకారాన్ని అందించాలని కోరింది.

పాలస్తీనియన్లపై మారణకాండ

గాజాలోనూ, అలాగే వెస్ట్‌బ్యాంక్‌లోనూ పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న మారణకాండలో ఇప్పటి వరకు 17 వేల మంది పౌరులు చనిపోయారని, వీరిలో 70 శాతం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని సిపిఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఈ జాతి విద్వేష దాడులకు ముగింపు పలకాలని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి, ఇజ్రాయిల్‌ బందీలను విడుదల చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయని పొలిట్‌బ్యూరో తెలిపింది. తక్షణమే కాల్పుల విరమణ, ఇజ్రాయిలీ బందీలందరినీ విడుదల చేయాలని పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ నెల 8న ఏకగ్రీవంగా తీర్మానం చేసే చివరి దశలో దానిని అమెరికా వీటో చేసి అడ్డుకోవడాన్ని పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. తక్షణమే కాల్పులు విరమణ ప్రకటించాల్సిందిగా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డిమాండ్‌ చేయాలని పొలిట్‌బ్యూరో పునరుద్ఘాటించింది.

ఐపిసి, సిఆర్‌పిసి, ఎవిడెన్స్‌ చట్టాల మార్పు బిల్లులపై…

భారత శిక్షాస్మృతి (ఐపిసి), నేర ప్రక్రియా స్మృతి (సిఆర్‌పిసి), భారత సాక్ష్యాధార చట్టం (ఎవిడెన్స్‌)లను మార్చేసేందుకు ఉద్దేశించిన బిల్లులను పార్లమెంటరీ జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ మూడు కీలకమైన చట్టాలను మార్చేసేందుకు పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెట్టి హడావిడిగా ఆమోదింపజేసుకోవాలని మోడీ ప్రభుత్వం చూస్తోంది. ఈ ముసాయిదా బిల్లులలో అనేక తీవ్రమైన లోపాలున్నాయని, ప్రజాతంత్ర హక్కులకు, పౌర స్వేచ్ఛలకు, క్రిమినల్‌ న్యాయ వ్యవస్థపై తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదముందని పేర్కొంది. ఈ బిల్లులను సమీక్షించేందుకు లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సెలెక్ట్‌ కమిటీకి తప్పనిసరిగా పంపాలని డిమాండ్‌ చేసింది. ఆ తర్వాత మాత్రమే వాటిని చట్టాలుగా చేసుకోవచ్చునని పేర్కొంది.

జమ్ముకాశ్మీర్‌లో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి

నియోజకవర్గాల పునిర్వభజన (డీలిమిటేషన్‌) ప్రక్రియను పూర్తి చేసి, తుది ఓటర్ల జాబితా ప్రకటించి, రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పామని చెప్పుకుంటున్నందున జమ్ముకాశ్మీర్‌లో తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. 2018లోనే జమ్ముకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాల్సివుండేది. కాశ్మీర్‌ పునర్విభజన చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఆ చట్టానికి సవరణలు చేస్తూ రెండు బిల్లులను లోక్‌సభ ఇటీవల ఆమోదించిందని సిపిఎం తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పును రిజర్వు చేసి, ఈ నెల 11న (సోమవారం) వెలువరించనుంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ ఆగకుండానే హడావిడిగా చట్టాన్ని సవరించడం ప్రజాస్వామ్య, న్యాయ ప్రక్రియలను రెండింటినీ ఉల్లంఘించడమేనని సిపిఎం తప్పుబట్టింది. అంతేకాకుండా ఎన్నికైన సభ్యులుండాల్సిన శాసనసభకు సభ్యులను నామినేట్‌ చేసే అధికారాన్ని లెఫ్టినెంట్‌ గవర్నరుకు కట్టబెడుతూ ఈ సవరణలు చేశారని తెలిపింది. ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి నామినేషన్స్‌ ఏవున్నా అవి ఎన్నికైన చట్టసభ ద్వారానే జరగాలని, అంతేకాని ఏ విధంగానూ ఎన్నిక కానట్టువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ద్వారా ఈ నామినేషన్లు ఉండరాదని సిపిఎం స్పష్టం చేసింది.

తిరువనంతపురంలో కేంద్ర కమిటీ సమావేశం

కేరళ రాజధాని తిరువనంతపురంలో జనవరి 28 నుంచి 30 వరకు కేంద్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సిపిఎం తెలిపింది.

➡️