ప్రైవేటుకు ఆర్‌టిసి బస్‌ స్టేషన్లు

3 విడతలుగా నాలుగేళ్లలో ప్రక్రియ పూర్తి
వడోదర మోడల్‌ బస్‌ స్టేషన్లు అమలు దిశగా అడుగులు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అత్యధిక ఆదాయం వచ్చే రూట్లలోని బస్‌ స్టేషన్లను పెట్టుబడిదారులకు అప్పజెప్పేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమా చారం. ప్రస్తుతం గుజరాత్‌లోని వడోదర మోడల్‌ బస్‌ స్టేషన్‌ (ఇంటిగ్రేటెడ్‌) తరహాలో ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయాలని కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. మూడు విడతలుగా నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టును అమలు చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమా చారం. ఇటీవల ఆర్‌టిసి అధికారులను గుజరాత్‌లోని వడోదర ప్రాజెక్టును పరిశీలనకు కూడా పంపింది. ఈ బస్‌ స్టేషన్లలోకి ఆర్‌టిసితోపాటు ప్రైవేటు బస్సులు కూడా కొంతమేర కన్సార్టియం లేక కాంట్రాక్టరుకు చెల్లించాల్సి ఉంటుంది. బస్‌ స్టేషన్లను ప్రైవేటీకరణ చేసేందుకు ఇప్పటికే ఆర్‌టిసి అధికారులు ఒక విధాన పత్రాన్ని సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తు న్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ఆర్‌టిసి అధికార యంత్రాంగం కార్యాచరణ దిశగా అడుగులు వేసే అవకాశమున్నట్లు ఆర్‌టిసి వర్గాల్లో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌టిసి బస్‌ స్టేషన్లను అభివృద్ధి పేరుతో అనేకమంది పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్లు వారి ప్రతినిధి బృందాలు సందర్శిస్తున్నాయి.

స్థలాలను సైతం
బస్‌ స్టేషన్‌ ఆవరణలోని విలువైన ఖాళీ స్థలాలను సైతం కార్పొరేట్లకు అమ్మేందుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అవసరమైతే 15, 20 ఏళ్లపాటు ఆయా స్థలాలను లీజు పేరుతో ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్‌టిసికి రాష్ట్ర వ్యాప్తంగా 1,979.03 ఎకరాల భూమి ఉంది. ఆర్‌టిసిలో 46,523 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఇందులో 129 బస్‌ డిపోలు, 423 బస్‌ స్టేషన్లు ఉన్నాయి. నిత్యం ఆర్‌టిసి ద్వారా 44 లక్షల మంది ప్రయాణికులు మిగతా 2లో
రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, విశాఖ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లోని పలు ఆర్‌టిసి బస్‌ స్టేషన్లలోని ఖాళీ స్థలాల విలువ రూ.కోట్లలో ఉంటుంది. దీంతో ఆయా బస్‌ స్టేషన్లను కార్పొరేట్స్‌ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ఆర్‌టిసి బస్‌ స్టేషన్ల ప్రైవేటీకరణను విడనాడాలి : ఎస్‌డబ్ల్యుఎఫ్‌
కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఆర్‌టిసి బస్‌ స్టేషన్లను ప్రైవేటీకరణకు పూనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. కార్మికుల భద్రతకు ఎలాంటి హామీనివ్వకపోవడంతో ఆర్‌టిసి ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. బస్‌ స్టేషన్ల అభివృద్ధి పేరుతో ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు, ప్రయాణికులు వ్యతిరేకించాలని ఎస్‌డబ్ల్యుఎఫ్‌ విజ్ఞప్తి చేసింది. ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని డిమాండ్‌ చేసింది.

➡️