Sand: బ్లాక్‌లోకి ఇసుక!

Sep 12,2024 03:39 #Illegal sand mining, #Stories

 వరదలతో విధివిధానాల్లో జాప్యం
 ట్రక్కు రూ.6 వేల నుంచి రూ.7 వేలకు అమ్మకం
 అక్రమ తవ్వకాలకు తెరలేపిన ‘తమ్ముళ్లు’

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : వరదల కారణంగా సిఎం చంద్రబాబుతోపాటు మంత్రులు, అధికారులు అందరూ సహాయక చర్యల్లో ఉన్నారు. ఇప్పుడు ఇతర అంశాలపై దృష్టి సారించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీన్ని అదునుగా తీసుకుని కొందరు ‘తమ్ముళ్లు’ ఇసుకను బ్లాక్‌లో అమ్మకాలకు తెరలేపారు. ఇసుకపై పలుసార్లు సిఎం స్థాయిలో చర్చ, సమీక్షలు సాగినా విధివిధానాలు ఖరారు కాలేదు. పాత నిల్వలు అయిపోయాయి. ఆన్‌లైన్‌లో బుకింగులు లేవు. మైనింగ్‌ శాఖాధికారులు కూడా కొత్త విధానాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు రీచ్‌ల్లోకి వరద నీరు చేరింది. ఇప్పుడు ఇసుక ఎక్కడా దొరకడం లేదు. అధికారికంగా తెచ్చుకోవడానికి అవకాశం లేదు. ఇప్పటికే నిర్మాణాలు కూడా నిలిచిపోయాయి. నిర్మాణదారుల ఇసుక అవసరాలను ఆసరాగా తీసుకుని కొందరు పాలకపక్ష కార్యకర్తలు, కాంటాక్టర్లు, రవాణా నిర్వాహకులు ఏకమయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాకు తెరలేపారు. దళారులు కూడా తెరపైకి వచ్చారు. నిర్మాణ కార్మికులు ఉండే చోటకు వీరు చేరుతున్నారు. ఇక్కడికి నిర్మాణదారులు వస్తే ‘ఇసుక కావాలా?’ అంటూ దళారులు బేరసారాలు సాగిస్తున్నారు. ఇప్పట్లో ఇసుక రాదంటూ భయపెడుతున్నారు. దీంతో, నిర్మాణ పనులను ఆపుకోలేక వారు చెప్పిన ధరకు నిర్మాణదారులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ట్రక్కు ఇసుకకు రూ.6 వేల నుంచి రూ.7 వేలకు, లారీ ఇసుకను రూ.20 వేల నుంచి రూ.25 వేలకు సమర్పించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ నిర్దేశాలు, నిబంధనల ప్రకారం ట్రాక్టర్‌ ట్రక్కు ఇసుక రూ.2 వేలకే వినియోగదారులకు చేరాలి. జిల్లాలో పలుచోట్ల అనధికారికంగా నిల్వలు పెట్టుకున్నారు. సెబ్‌ను కూడా రద్దు చేసినందున దాడులు లేవు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారం కూడా స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇటీవల కొందరు పోలీసు అధికారులు నేతల సిఫార్సులతో వచ్చిన వారు కావడంతో దీనిపై పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇసుక పెద్ద ఎత్తున అక్రమ రవాణా సాగుతోంది. ఒంగోలులో ట్రక్కు ఇసుక రూ.6 వేలు పలుకుతోంది. చీరాల ప్రాంతంలో ప్లాస్టింగు ఇసుక లారీ రూ.25 వేలకు అమ్ముతున్నారు. చినగంజాం ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో ముండ్లమూరు మండలం పోలవరం వద్ద నుంచి, చిలకలేరు నుంచి భారీగా తరలిస్తున్నారు. ఇక్కడ పాలకపక్ష నేతలే ఈ వ్యవహారం చూస్తున్నారని, వాళ్లే లారీలు, ట్రాక్టర్లకు ఎత్తి పంపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. గిద్దలూరు, వైపాలెం, మార్కాపురం నియోజకవర్గాల నుంచి, గుండ్లకమ్మ, ఇతర వాగులు వంకల నుంచి ఇసుకను గుట్టుగా తెచ్చి నిల్వలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. పనులు అత్యవసరంగా ఉన్న నిర్మాణదారులు ధర ఎక్కువగా పెట్టి తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పడంతో పెద్దపెద్ద నిర్మాణదారులు కొంతకాలం వేచిచూద్దామనే భావనలో ఉన్నారు. ప్రభుత్వం విధివిధానాలు రేపోమాపో ఇస్తుందని భావిస్తున్నామని బిల్డర్ల అసోషియేషన్‌ నాయకులు నాతాని రఘురామయ్య చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఇసుకపై విధివిధానాలు ఖరారు చేయాలని ఆయన కోరారు.

➡️