- సమాచార విభాగంలో ముస్లిం ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం
- ఖండించిన ఇఒ… దర్యాప్తునకు ఆదేశం
- పోస్టు పెట్టింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి కార్యకర్తగా గుర్తింపు
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) వేదికగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు మతతత్వ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న తిరుమలలో అబద్దపు ప్రచారాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మతాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. టిటిడి సమాచార విభాగంలో ప్రజాసంబంధాల అధికారిగా నిష్కా బేగం అనే ముస్లిం ఉన్నారని, ఆమె ఇంటిపై ఇడి దాడులు చేసిందని, నగలను స్వాధీనం చేసుకుందని మతతత్వవాదులు సోషల్ మీడియం వేదికగా ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న టిటిడి ఇఒ శ్యామలరావు దేవస్థానంలోని సోషల్ మీడియా విభాగానికి ఈ సమాచారం అందించారు. ఈ పోస్టు చేసిన వ్యక్తి ఎవరో గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టిటిడి సమాచార, సోషల్ మీడియా విభాగాలు ఆరా తీయగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ సైనికుడు, బిజెపి కార్యకర్త, మోడీ అభిమాని కోల్ ఎకెఎస్ రాణా ఈ పోస్టు పెట్టినట్లు తేలింది. దీంతో, సీరియస్ అయిన టిటిడి అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నోటీసులు పంపేందుకు రంగం సిద్ధం చేసింది. సోషల్ మీడియాలో ‘బిజెపి కార్యకర్త’ రాణా పెట్టిన పోస్టులో ‘ఫేక్’ అని టిటిడి పెట్టింది. ఈ నేపథ్యంలో టిటిడి పిఆర్‌ఒ నీలిమ ‘ప్రజాశక్తి’తో మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా దేవస్థానంపై అభాండాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించిన రోజునే ఇటువంటి విద్వేష ప్రచారం జరగడం గమనార్హం.
గతంలోనూ బిజెపి రాద్దాంతం
2014లో ఆలయ ప్రాకారం చుట్టూ సోలార్ విద్యుత్‌తో కూడిన సేఫ్టీ గ్రిల్స్ అమర్చారు. ఆ గ్రిల్స్ రూపకల్పనలో శిలువ గుర్తు ఉందని, కావాలనే ఆ విధంగా గ్రిల్స్ తయారు చేశారని అప్పట్లో బిజెపి రాద్ధాంతం చేసింది. దీనిపై టిటిడి వివరణ ఇస్తూ, నామాల ఆకారంలోనే ఉంది తప్ప, శిలువ ఆకారంలో లేదని పేర్కొంది. టిటిడి నిధులతో భక్తుల వసతి సముదాయం (పద్మావతి నిలయం) కట్టారు. శ్రీవారి నిధులతో కట్టిన ఈ భవనాన్ని కలెక్టరేట్‌కు ఇవ్వరాదని, ఒకవేళ ఇస్తే అన్యమతస్తులు రావడం వల్ల అపచారం అవుతుందని ప్రస్తుత బోర్డు సభ్యులు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి అప్పట్లో కోర్టుకెక్కారు. హైకోర్టు సీరియస్ అయ్యి ప్రజలకు ఉపయోగపడేదే తప్ప, మత ధోరణితో చూడరాదని ఆయనకు మొట్టికాయలు వేసింది. తాజాగా దాదాపు 75 ఏళ్లు పాపవినాశనాన్ని నమ్ముకుని చిన్నచిన్న పూసల దండలు అమ్ముకుంటున్న 500 మంది షికారీ కుటుంబాలను ‘మతముద్ర’ వేసి కొండనుంచి తరిమేశారు. షికారీల్లో ఒకరు క్రిస్టియన్ యువతిని వివాహం చేసుకోవడాన్ని ఆసరాగా తీసుకొని మతోన్మాదుల ఫిర్యాదు మేరకు ఈ చర్చకు పాల్పడినట్లు ప్రజాశక్తి పరిశీలనలో వెల్లడైంది. తిరుమల అభివృద్ధికి బాసటగా నిలుస్తోన్న తిరుపతి అభివృద్ధికి టిటిడి నిధులు కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేస్తుంటే, తిరుపతిలో హిందూయేతరులు కూడా ఉంటారని, అందువల్ల టిటిడి నిధులు ఇవ్వొద్దని బిజెపి అడ్డుపుల్ల వేస్తోంది. 2014లో కడపకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్‌ను టిటిడి చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన క్రిస్మస్ సందర్భంగా జరిగిన శాంతి సభలకు వెళ్లారని, అటువంటి వ్యక్తిని టిటిడి చైర్మన్‌గా ఎలా నియమిస్తారని సంఘపరివార్ శక్తులు గగ్గోలు పెట్టాయి. దీంతో, పుట్టా సుధాకర్‌యాదవ్ తాను హిందూవాదినని, క్రిస్టియన్ల ఆహ్వానం మేరకు రాజకీయ నాయకునిగా వెళ్లానని వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. తిరుమల శేషాచల అడవుల్లో ఫొటో క్రియేట్ చేసి శిలువ ఉందని భజరంగదళ్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆ సందర్భంగానూ టిటిడి వివరణ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏన్నో ఏదేళ్లుగా బిజెపి, భజరంగదళ్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు అసత్య ప్రచారాలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నా టిటిడి వివరణ ఇచ్చుకోవడం తప్ప, వారిపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. తాజా ఘటనలోనైనా కఠిన చర్యలు తీసుకోవాలని, మతోన్మాదుల విద్వేష ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.