అసత్యాల శంఖారావం…

మూడు నెలలుగా చేసిన ప్రచారం, ప్రత్యక్షంగా బిజెపి అందించిన అధికారిక సహకారం, భక్తి పేరిట సామాన్యుల్లో కలిగించిన కదలిక .. వెరసి, ఆదివారం నాడు గన్నవరం దరి కేసరపల్లిలో విశ్వహిందూ పరిషత్‌ నిర్వహించిన హైందవ శంఖారావం పెద్ద జనసందోహం మధ్య జరిగింది. విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ మఠాలూ, శిబిరాలూ నిర్వహిస్తున్న స్వామీజీలు, సాధువులు వంద మందికి పైగానే వేదిక మీద ఆసీనులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం, సినిమా పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌ లాంటి వాళ్లు వేదిక మీద నుంచి మాట్లాడారు. సాధారణంగా మతపరమైన సభలు హాజరైన వారి భక్తిప్రపత్తులను పెంచటానికో, నమ్మిన దేవుళ్లను, వారి బోధనలను స్మరించుకోవటానికో పరిమితమవుతాయి. ఈ ‘హైందవ శంఖారావం’ ఉద్దేశం అందుకు భిన్నమైనదని ఆ పేరులోనే స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టే, వచ్చిన వారిలో భక్తి ప్రపత్తులను పెంచటానికి కాకుండా ఇతర మతాల పైనా, వ్యవస్థలపైనా రెచ్చగొట్టే విధంగా వక్తలు తమ ప్రసంగాలు సాగించారు. హిందువులకు, హిందూ మతానికి ఇప్పటికిప్పుడు పెను ప్రమాదం ముంచుకొచ్చినట్టు, ఆ ప్రమాదం నుంచి హిందువుల ను రక్షించేందుకు తాము కంకణబద్ధులైనట్టు చెప్పుకొ చ్చారు. దేవాలయాల నిర్వహణకు సంబంధించి స్వాతంత్య్రం తరువాత అమల్లోకి తెచ్చుకున్న చట్టాలను, విధి విధానాలను నిందిస్తూ మాట్లాడారు.

హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలనేది ఈ శంఖారావం ప్రధాన డిమాండు. దీనిచుట్టూ ఇంకో 11 డిమాండ్లు ఉన్నాయి. వీటిని ముందుకు తెస్తూ, పలువురు స్వామీజీలు అనేక అసత్యాలను వల్లించారు. చిన జీయరు స్వామి మాట్లాడుతూ, ఎన్ని నిముషాలు పూజ చేయాలో అధికారులే నిర్ణయిస్తే ఎలాగ? అంటూ ప్రశ్నించారు. దేవాలయాల్లో పూజలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించి ఎక్కడా అధికారులు జోక్యం చేసుకోరు. ఆగమశాస్త్రమూ, స్థానిక సాంప్రదాయాలను బట్టి నిత్య సేవితాలు జరుగుతాయి. ఇతరత్రా సదుపాయాలను, ఏర్పాట్లను మాత్రమే ఆయా ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులూ చూడడం చాలా కాలంగా వస్తోంది. దాదాపుగా ఇది రాజులు, జమిందార్ల కాలం నాటి పద్ధతే! అప్పుడైనా, ఇప్పుడైనా పోషణ, పర్యవేక్షణ పాలకులదే.

1987లో జస్టిస్‌ చల్లా కొండయ్య కమిషన్‌ చేసిన సిఫార్సుల కారణంగానే హిందూ దేవాలయాలకు ఈ దుస్థితి దాపురించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం వక్కాణించారు. వాస్తవానికి ఆనాడు దేవాలయాల్లో నెలకొని ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను సరిదిద్దటానికి ఎన్టీఆర్‌ ప్రభుత్వం జస్టిస్‌ చల్లా కొండయ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. జస్టిస్‌ చల్లా కొండయ్య 1979 – 80 మధ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన హయాంలో అనేక ప్రజోపకరమైన తీర్పులు వచ్చాయనే పేరుంది. ఎమర్జన్సీ కాలంలో అక్రమ బనాయించిన అనేక కేసులను ఆయన కొట్టేశారు. రూ.12 కోట్ల నిజాం నగల కేసు విషయంలో మార్గదర్శకాలను రూపొందించారు. దేవదాయ ధర్మదాయ కమిషన్‌ ఛైర్మన్‌గా… దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, నిర్వహణపై ప్రభుత్వానికి పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు. వాటి ఆధారంగా ఎన్టీఆర్‌ ప్రభుత్వం 1987లో దేవాదాయ చట్టాన్ని చేసింది. దేవాలయాల్లో వారసత్వ హక్కును రద్దు చేసింది. తిరుమల దేవస్థానంలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించింది. మిరాశి పేరుతో తిరుమల లడ్డూ ఆదాయం వ్యక్తులకు చేరకుండా అడ్డుకట్ట వేసింది. దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని ఒక క్రమపద్ధతిలో వినియోగించటానికి వీలైన మార్పులు ఈ చట్టం ద్వారా వచ్చాయి. ఆ చట్టమే దేవాలయాలకు పెద్ద అడ్డంకి అని ఎల్‌వి సుబ్రహ్మణ్యం పేర్కొనటం ఎవరి ప్రయోజనాల కోసం?

సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ మాట్లాడుతూ, 75 ఏళ్ల సినీరంగం మొత్తం మీద విమర్శలు ఎక్కుపెట్టేశారు. తన తాజా రాతలపై తలెత్తిన విమర్శలను సైతం మరచిపోయి, గతించిన సినీ పెద్దలకు కూడా సుద్దులు చెప్పే సాహసానికి తెగించాడు. కర్ణుడి పాత్రను ఉదాత్తంగా తీర్చిదిద్దటాన్ని ఎద్దేవా చేశారు. తెలుగు నాట పౌరాణిక చిత్రాలను రూపొందించిన పెద్దలు కొన్ని సినిమాల్లో వర్తమాన జీవితానికి దోహదపడేలా సన్నివేశాలకు రూపకల్పన చేశారు. కాబట్టే మాయాబజార్‌, దానవీర శూరకర్ణ వంటి సినిమాలు ఎప్పుడు చూసినా ఆ సంభాషణల్లో, సన్నివేశాల్లో వర్తమానీయత గోచరిస్తుంది. ‘దానవీర శూరకర్ణ’ సినిమాలో పుట్టుక కారణంగా కర్ణుడిని ద్రోణాచార్యుడు హీనంగా మాట్లాడినప్పుడు- దుర్యోధనుడు పాత్రధారి, మహానటుడు ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగులు ఇప్పటికీ కరతాళధ్వానాలు అందుకుంటాయి. వ్యాసభారతంలోని  ప్రధాన, ఉప కథల్లో కనిపించే అనేక ఉదంతాలను ఉటంకిస్తూ, వర్ణాధిపత్యాన్ని చీల్చి చెండాడిన వైనం ఇప్పటికీ మనువాదులకు జీర్ణం కాదు. బహుశా అలాంటి ధోరణితోనే అనంత్‌ శ్రీరామ్‌ అంతగా ఆవేశపడ్డారు. భారత రామాయణ కథలు దేశంలోనూ, దేశం బయటా ఒకరి నుంచి ఒకరికి నోటి ద్వారానే ప్రచారం అయ్యాయని, తరువాతి కాలంలో రకరకాలుగా గ్రంథస్థం అయ్యాయని అనంత్‌ శ్రీరామ్‌కి తెలీదని అనుకోలేం. భారత ఉపఖండంలో 120కి పైగానే రామాయణ కథలు ప్రచారంలో ఉన్నాయి. అవి దేనికది ప్రత్యేకం తప్ప ఒకదానిని మరొకటి అవమానించటమో, తక్కువ చేయటమో కాదు. అనేక ద్వంద్వార్థ పాటలను ప్రస్తావిస్తూ, ‘ఈ గురివిందా, నీతులు చెప్పేది?’ అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇంకా విశ్వహిందూ పరిషత్‌ నేతలు, ఇతరులు ఈ వేదిక పైనుంచి హిందువులను భయపెట్టి, రెచ్చగొట్టే విధంగా లవ్‌ జీహాద్‌ అంటూ అపోహలను గుప్పించారు. కలసి మెలసి జీవిస్తున్న చోట కులాంతర, మతాంతర వివాహాలు సహజం. కానీ, పరివార్‌ శక్తులు లవ్‌ జీహాద్‌ అంటూ చాలాకాలంగా దుష్ప్రచారం చేస్తున్నాయి. హిందూ యువతీ యవకులు నిరుద్యోగంతో నిర్వీర్వం అవుతున్నా, మహిళలు అకృత్యాలకు అన్యాయాలకు గురవుతున్నా, ధరలు పెరిగి జీవనం అస్తవ్యస్తం అవుతున్నా, రైతులు నిత్యం సమస్యలతో సతమతం అవుతున్నా వారి పక్షాన నోరెత్తని విశ్వ హిందూపరిషత్‌ ఆలయాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవటానికి నానా అబద్ధాలతో ఆరాటపడడం ఈ శంఖారావంలో స్పష్టంగా వినిపించింది. ఈ సభలో రాష్ట్రంలోని బిజెపి ఎంపీలు, కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, బిజెపి నుంచి ఎన్నికల్లో పోటీ చేసినవారూ పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ రెచ్చగొట్టుడు శంఖమూదారో ఈ దృశ్యం చెప్పకనే చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హృదయాల్లోని సామరస్యాన్ని దెబ్బ తీసి, మతోన్మాద శక్తులను అందటం ఎక్కించాలనేది ఈ పరివార్‌ పన్నాగం. రాష్ట్ర ప్రజలు ఆ పన్నాగాలను, ప్రయత్నాలను గుర్తిస్తారు.

సత్యాజీ

➡️