ఎస్‌బిఐవి కట్టుకథలు

Mar 22,2024 11:30 #details, #SBIV
  • క్విడ్‌ప్రోకో ఆధారాలు ధ్వంసం
  • సమాచారం ఉంటే అనుమానం ఎందుకు ?
  • సమాచారమే లేకపోతే సమయం కోరడం దేనికి ?
  • మాజీ ఎన్నికల కమిషనర్‌ లవాసా ప్రశ్నల వర్షం

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల పథకం రూపకల్పన వెనుక ప్రభుత్వ ఉద్దేశాలపై మాజీ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసా పలు సందేహాలు వ్యక్తం చేశారు. పలు విషయాల్లో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బిఐ) కట్టుకథలు అల్లుతున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత లవాసాపై మోడీ ప్రభుత్వం పలు వివాదాస్పద చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన 2019 ఆగస్టులో పదవి నుండి వైదొలిగారు. 2018లో తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకంలోని సెక్షన్‌ 7 (4)లోని అంశాలను ‘ది హిందూ’ పత్రికకు రాసిన వ్యాసంలో లవాసా ప్రస్తావించారు.
‘కొనుగోలుదారుడు అందజేసిన సమాచారాన్ని అధీకృత బ్యాంక్‌ ఏ అధికారికి కానీ, ఏ ప్రయోజనం కోసం కానీ ఇవ్వకూడదు. దీనిని గోప్యంగా ఉంచాలి. అయితే న్యాయస్థానం కోరినప్పుడు లేదా చట్టాన్ని అమలు చేసే సంస్థలు క్రిమినల్‌ కేసు నమోదు చేసినప్పుడు మాత్రం ఆ సమాచారాన్ని అందజేయాల్సి ఉంటుంది’ అని ఆ సెక్షన్‌ స్పష్టంగా చెబుతోందని లవాసా తెలిపారు. కొనుగోలుదారుకు జారీ చేసిన బాండుపై ఉండే రహస్య నెంబరును చట్టప్రకారం బ్యాంక్‌ తన వద్ద అట్టే పెట్టుకోకూడదని బాండ్ల రూపకర్తలు కూడా చెప్పారు. అంటే దీని అర్థం కొనుగోలుదారుకు, బాండును స్వీకరించిన వారికి మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టడం దాదాపు అసాధ్యం. దీనిపై లవాసా వ్యాఖ్యానిస్తూ బాండుపై ఉండే నెంబరు దాని ప్రామాణికతను సరిపోల్చడానికి, ఆడిట్‌ అవసరాలకు మాత్రమే పరిమితమైతే అది కరెన్సీ వంటిదేనని చెప్పారు. ‘దర్యాప్తు సంస్థకు అందజేయాలని ఒత్తిడి తెచ్చినప్పుడు కొనుగోలుదారుని గుర్తింపును ఎస్‌బిఐ ఎలా బయటపెడుతుంది? నిధుల వనరులకే విచారణ పరిధిని ఎలా పరిమితం చేస్తుంది? ఇది దాత, రాజకీయ పార్టీ మధ్య ఉన్న సంబంధాలను అందించే అవకాశాలను తోసిపుచ్చడం కాదా? తద్వారా క్విడ్‌ప్రోకో ఆరోపణలపై విచారణకు అవసరమైన కీలక ఆధారాలను నాశనం చేయడం కాదా? చట్టాన్ని అమలు చేయడం, న్యాయస్థానం, దర్యాప్తు సంస్థ పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించడం వంటి విషయాలలో ఎస్‌బిఐ కట్టుకథలు అల్లడం కాదా?’ అని ప్రశ్నించారు.
‘ఒకవేళ ఎస్‌బిఐ వద్ద రికార్డులు లేకపోతే బాండ్ల సమాచారాన్ని సేకరించేందుకు ఏ ప్రాతిపదికన సమయం కోరింది? దాతలతో రాజకీయ పార్టీలను, యూనిక్‌ నెంబరును సరిపోల్చే సమాచారం ఎస్‌బీఐ వద్ద లేనప్పుడు తన వద్ద వివరాలు ఉన్నాయని ఎలా చెప్పుకుంటుంది?’ అని కూడా లవాసా నిలదీశారు. ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉన్నందునే తమకు అధిక విరాళాలు అందాయంటూ బిజెపి నేతలు చేస్తున్న వాదనను ఆయన కొట్టిపారేశారు. బిజెపి వైవిధ్యభరితమైన పార్టీ అంటూ వారు ఇస్తున్న నిర్వచనాన్ని కూడా లవాసా ఎద్దేవా చేశారు.

➡️