సెకి విద్యుత్‌ అదానీదే

Nov 27,2024 04:21 #Adani, #Electricity, #Sec
  • పిపిఎపై డిస్కామ్‌ అధికారుల సంతకాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకి) రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలకు కట్టబెట్టనున్న విద్యుత్‌ను అదానీ కంపెనీనే అందించనుంది. దీంతో పాటు అజుర్‌ పవర్‌ కంపెనీ కూడా భాగస్వామ్యంగా ఉంది. వ్యవసాయ విద్యుత్‌ పేరుతో సెకితో 25ఏళ్ల పాటు ఏడు వేల మెగావాట్లను సెకి నుంచి తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో అదానీకి సంబంధం లేదని ఇప్పటివరకు గత ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తున్నారు. 2021 సెప్టెంబర్‌ 12 అదానీ మాజీముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రహస్యంగా తాడేపల్లిలో కలవడం, వ్యవసాయానికి కావాల్సిన ఏడు వేల మెగవాట్ల విద్యుత్‌ తాము అందిస్తామని 15వ తేదిన సెకి లేఖ రాయడం తెలిసిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనను గంటల్లోనే ఆగమేఘాల మీద ఆమోదించుకున్న అప్పటి ప్రభుత్వం డిసెంబర్‌ 1వ తేదీన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పిపిఎ) చేసుకుంది. 7వేల మెగావాట్లు (మెవా)కు సంబంధించిన ఈ ఒప్పందంలో సోలార్‌ పవర్‌ డెవలపర్‌(ఎస్‌పిడి)గా అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఫోర్‌ లిమిటెడ్‌, అజుర్‌ పవర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎపిఐపిఎల్‌) కంపెనీలే ఉన్నాయి. ఇందులో అదానీ గ్రీన్‌ నుంచి 4667 మెవా, అజుర్‌ నుంచి 2333 మెవా చొప్పున విద్యుత్‌ సరఫరా జరుగుతుందని ఉన్న ఒప్పందానికి రాష్ట్రప్రభుత్వం, డిస్కంలు ఆమోదం తెలిపాయి. సెకి-ఎస్‌పిడి-పిపిఎ ప్రకారం రెండు కంపెనీకు చెందిన విద్యుత్‌ను యూనిట్‌ ధర రూ.2.42లుగా, ట్రేడింగ్‌ మార్జిన్‌ 0.07పైసలు, మొత్తం కలిపి రూ.2.49లుగా పేర్కొన్నాయి. ఈ ఒప్పందంపై అప్పటి డిస్కంల సిఎండిలు, ఇంధన శాఖ డిప్యూటీ సెక్రటరీ సంతకాలు చేశారు. ఎపి సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎపిసిపిడిసిఎల్‌) సిఎండి జె పద్మజనార్ధన్‌ రెడ్డి, ఎపి తూర్పు ప్రాంత పంపిణీ సంస్థ (ఎపిఈపిడిసిఎల్‌) సిఎండి కె సంతోషరావు, ఎపి దక్షిణ ప్రాంత పంపిణీ సంస్థ (ఎపిఎస్‌పిడిసిఎల్‌) సిఎండి హరనాథరావు, ఇంధన శాఖ డిప్యూటీ సెక్రటరీ బివిఎపి కుమార్‌ రెడ్డి, సెకి జనరల్‌ మేనేజర్‌ అతుల్య కుమార్‌ నాయక్‌ సంతకాలు చేశారు.

ఒప్పందంపై సిఎంవో నుంచి తీవ్ర ఒత్తిడి

సెకి ఒప్పందంపై అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఇద్దరు ఉన్నతాధికారులు ఇతర శాఖల అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. వీరిలో ఒకరు పదవీ విరమణ పొందగా, మరొకరు స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. ఒక్క అధికారి ఐదేళ్లపాటు సిఎంవోలో ఉండి బాగా అవినీతికి పాల్పడినట్లు అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. మరో అధికారి రెండున్నరేళ్ల పాటు ఉండి ఇతర ఉన్నతాధికారులపై దురుసుగా ప్రవర్తించడమే కాక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తిని సిఎంతో చెప్పి బదిలీ చేయించారు.

సెకి ఒప్పందంపై విచారణ : ఎసిబికి చక్రవర్తి ఫిర్యాదు

సెకి – విద్యుత్‌ పంపిణీ సంస్థల మధ్య జరిగిన పిపిఎపై విచారణ జరిపించాలని సెంటర్‌ ఫర్‌ లిబర్టీ అధ్యక్షులు నల్లమోతు చక్రవర్తి ఎసిబికి ఫిర్యాదు చేశారు. ఎసిబి కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌ సుచరితను మంగళవారం కలిసి విచారణ చేయాలని కోరారు. ఈ ఒప్పందం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గౌతమ్‌ అదానీ రూ.1750 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని అమెరికాలో కేసు నమోదైందని తెలిపారు. ఈ ఫిర్యాదులో జగన్‌మోహన్‌ రెడ్డి, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఎపి ఇంధన శాఖ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ కార్యదర్శి ఎన్‌ శ్రీకాంత్‌ల పేర్లను పేర్కొన్నారు. సెకి ఒప్పందంపై రాష్ట్రప్రభుత్వం నోరుమెదపడం లేదని చక్రవర్తి అనంతరం మీడియాతో చెప్పారు. సెకి ఒప్పందం చట్టం విరుద్ధమని ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రతిపక్షంలో ఉండగా విమర్శించడంతోపాటు 1300 పేజీలతో కోర్టులో కేసు కూడా వేశారని తెలిపారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలను కెన్యా ప్రభుత్వం రద్దు చేసిందని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో కూడా అదానీ ప్రాజెక్టులను నిలిపివేశారని, దేశంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని అసహనం వ్యక్తం చేశారు.

➡️