septic tanks : మురికి పనుల్లో 92% మంది ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలే

  • వారిలో 68 శాతం దళితులే
  • మురుగుకాలువలు, సెప్టిక్‌ ట్యాంకులు శుభ్రం చేసేది వారే

న్యూఢిల్లీ : పట్టణాల్లోని మురికి పనుల్లో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలే 90 శాతానికి పైగా ఉన్నారు. మురుగు కాలువలు, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేసే కార్మికులుగా అధిక భాగం వీరే. భారత్‌లోని నగరాలు, పట్టణాల నుంచి ప్రభుత్వం సేకరించిన సమాచారం ఈ విషయాన్ని మరింత తేటతెల్లం చేసింది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీ) నుంచి 3 వేలకు పైగా పట్టణ, నగర పాలక సంస్థల్లో ఉన్న 38 వేల మంది కార్మికుల్లో 91.9 శాతం మంది ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిల నుంచి ఉన్నారు. వీరిలో ఎస్‌సిల నుంచి అధికంగా 68.9 శాతం మంది ఉండగా, ఒబిసిల నుంచి 14.7 శాతం, ఎస్‌టిల నుంచి 8.3 శాతం మంది ఉన్నారు. జనరల్‌ కేటగిరీ నుంచి కేవలం 8 శాతం మందే ఉన్నారు. దేశవ్యాప్తంగా 2019 నుంచి 2023 మధ్య ప్రమాదకర పరిస్థితుల్లో మురుగుకాలువలు, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేస్తూ కనీసం 377 మంది చనిపోయారని పార్లమెంటులో సాక్షాత్తూ ప్రభుత్వమే వెల్లడించిన విషయం విదితమే. ఐదు లక్షల మంది పట్టణ జనాభాకు వందమందే పారిశుధ్య కార్మికులు ఉన్నారని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అంచనా.

ప్రమాదకర పరిస్థితులు
దేశవ్యాప్తంగా మురుగు, సెప్టిక్‌ ట్యాంక్‌ కార్మికుల (ఎస్‌ఎస్‌డబ్ల్యూ) ప్రొఫైల్‌ను కేంద్ర సామాజిక, సాధికాతర మంత్రిత్వ శాఖ తన ‘నమస్తే’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నది. అన్ని మురుగు కాలువల పనిని యాంత్రీకరించటం, ప్రమాదకరమైన శుభ్రపరిచే పనుల కారణంగా నమోదయ్యే మరణాలను నివారించటం ‘నమస్తే’ ఉద్దేశం. మాన్యువల్‌ స్కావెంజర్ల పునరావాసం (ఎస్‌ఆర్‌ఎంఎస్‌) స్వయం ఉపాధి పథకం స్థానంలో 2023-24లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దేశంలో మాన్యువల్‌ స్కావెంజింగ్‌ ముగిసిందనీ, ఇప్పుడు పరిష్కరించాల్సింది మురుగుకాలువలు, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రపర్చటంలో ప్రమాదకర పరిస్థితులను మాత్రమేనని కేంద్రం చెబుతున్నది.
నమస్తే కార్యక్రమనేది నేరుగా మురుగు కాలువలు, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేసే కార్మికులకు ఉద్దేశించినది. ఇందులో వాహన డ్రైవర్లు, హెల్పర్లు, మెషిన్‌ ఆపరేటర్లు, క్లీనర్లు కూడా ఉంటారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారికి భద్రతా శిక్షణ, పరికరాలను అందించటం, మురుగు, సెప్టిక్‌ ట్యాంక్‌ కార్మికులను శానిటేషన్‌ వ్యవస్థాపకు లుగా మార్చగల మూలధన రాయితీలను అందించటం దీని లక్ష్యం. ఏడాది క్రితం ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 3326 పట్టణ, నగర పాలక సంస్థలు (యుఎల్‌బిలు) ప్రక్రియను ప్రారంభిం చాయి. సుమారు 38 వేల ఎస్‌ఎస్‌డబ్ల్యూలను రూపొందించాయి. ఇప్పటి వరకు 283 యుఎల్‌బిలు సున్నా ఎస్‌ఎస్‌డబ్ల్యూలను నమోదు చేశాయి. 2364 యుఎల్‌బిలు పది కంటే తక్కువ చొప్పున నమోదు చేశాయి.
కేరళ, రాజస్థాన్‌, జమ్ముకాశ్మీర్‌ వంటి 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రొఫైలింగ్‌ ప్రక్రియను రూపొందించాయి. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర 17 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలు ఎస్‌ఎస్‌డబ్ల్యూల స్థానంలో సొంతంగా కార్యక్రమాలను నడుపుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల నుంచి కేంద్రానికి సమాచారం లేదు.
కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలు స్పెషల్‌ క్యాంప్‌ల ద్వారా కార్మికులను నమోదు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో పారిశుధ్య కార్మికుల ఇళ్ల వద్దకు వెళ్లడమో లేదా వారు పనిచేసే ప్రదేశాలకు వెళ్లి వారి గురించి వివరాలను సేకరించి నమోదు చేయడమో జరుగుతోంది. ఇప్పటివరకు 30 శాతం నమోదు మాత్రమే పూర్తి చేసింది. స్వయం సహాయక పధకం కింద 191 మంది లబ్ధిదారులు రూ.2.26 కోట్ల మూలధన రాయితీని పొందారు. శానిటేషన్‌ సంబంధిత ప్రాజెక్టుల కింద 413 మంది శానిటేషన్‌ వర్కర్లు రూ.10.6 కోట్ల రాయితీలను పొందారు.
2018లో ఉన్న యుపిఎ ప్రభుత్వ హయాంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎంఎస్‌ (సెల్ఫ్‌ ఎంప్లారుమెంట్‌ స్కావెంజర్ల పునరావాసం కోసం స్వయం ఉపాధి పధకం) కింద ప్రభుత్వం 58,098 మాన్యువల్‌ స్కావెంజర్స్‌ని గుర్తించింది. మాన్యువల్‌గా కార్మికులను గుర్తించడంలో సమస్యలు ఎదురయ్యాయి. దాదాపు 6,500కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. 58 వేల మందికిపైగా ఉన్న పారిశుధ్య కార్మికుల్లో 43,797 మంది అంటే… 97 శాతం మంది దళితులే ఉన్నారు. ఎస్‌టి, ఓబిసిలు, ఇతరులు ఒక్క శాతం మందే ఉన్నారని అప్పటి ప్రభుత్వ లెక్కలు చెప్పాయి.
2018 వరకు 58,098 మాన్యువల్‌ స్కావెంజర్లుగా గుర్తించిన వారికి రూ.40 వేలు ఒకేసారి నగదు బదిలీ చేసినట్లు మంత్రిత్వశాఖ రికార్డులు చెబుతున్నాయి. వారిలో 18,800 మంది ప్రత్యామ్నాయ నైపుణ్య శిక్షణను ఎంచుకున్నారు. 2022 నాటికి 2,051 మంది ప్రత్యామ్నాయ వ్యాపారాలను ప్రారంభించడానికి ఎస్‌ఆర్‌ఎం పధకం కింద రాయితీ రుణాలను ఎంచుకున్నారు.

➡️