షిప్‌యార్డ్‌ కాంట్రాక్టు ఎల్‌అండ్‌టికి!

May 13,2024 07:09 #L&T!, #Shipyard contract

– ఎఫ్‌ఎస్‌ఎస్‌ల్లో 2 నౌకల నిర్మాణ పనులు అప్పగించే యత్నం?
– హెచ్‌ఎస్‌ఎల్‌ మనుగడపై తీవ్ర ప్రభావం
– ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన
ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో :విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) ఈ ఏడాది పిబ్రవరిలో దక్కించుకున్న రూ.19 వేల కోట్ల 5 ఫ్లీట్‌ సపోర్టు షిప్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌)ల కాంట్రాక్టును యాజమాన్యం దొడ్డిదారిన ఎల్‌అండ్‌టి ప్రైవేట్‌ కంపెనీకి ధారాదత్తం చేయాలని చూస్తోంది. ఓ పక్క దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సాగుతుండగా సందట్లో సడేమియా అన్నట్టుగా సుమారు రూ.8200 కోట్ల విలువైన రెండు షిప్‌ల నిర్మాణ బాధ్యతలను ఎల్‌అండ్‌టికి అప్పగించడానికి రంగం సిద్ధం చేసింది. 2014లోనే షిప్‌యార్డుకు దక్కాల్సిన 5 ఎఫ్‌ఎస్‌ఎస్‌ల కాంట్రాక్టును కేంద్రంలోని బిజెపి ఇవ్వనిరాకరించింది. ఎట్టకేలకు 2023లో దీన్ని హిందుస్థాన్‌ షిప్‌యార్డు సాధించగలిగింది. పదేళ్ల తర్వాతైనా షిప్‌యార్డుకు ఆర్డర్లు దక్కినందుకు ఉద్యోగులు, కార్మికులు సంతోషించారు. వాస్తవానికి 2010లోనే రక్షణ అవసరాల నిమిత్తం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విశాఖ హెచ్‌ఎస్‌ఎల్‌ను తన అధీనంలోకి తీసుకుంది. ఎఫ్‌ఎస్‌ఎస్‌, ఎల్‌పిడి, పి 751 సబ్‌మెరైన్‌ల వర్క్‌ ఆర్డర్లను నామినేషన్‌ పద్ధతిలో ఇస్తామని కేంద్రం ఆనాడే హామీ ఇచ్చింది. ఆ తర్వాత కేవలం 11184 షిప్‌ను మాత్రమే నామినేషన్‌ పద్ధతిలో కేటాయించింది. ఆ తర్వాత అన్నీ బహిరంగ మార్కెట్‌లో టెండర్ల ద్వారా పోటీపడేలా హిందుస్థాన్‌ షిప్‌యార్డును బిజెపి సర్కారు వదిలేసింది. 5 ఎఫ్‌ఎస్‌ఎస్‌ల నిర్మాణాన్ని సకాలంలో ప్రారంభించలేదు. వీటి నిర్మాణం, మౌలిక వసతుల ఏర్పాటుకు బ్యాంకుల నుంచి షిప్‌యార్డు రూ.వందల కోట్లు రుణం తెచ్చింది. దీనికి ఏడాదిన్నరగా వడ్డీలు కడుతూ అప్పుల్లోకి వెళ్లిపోయినట్టు సమాచారం. దీన్ని సాకుగా చూపించి తాజాగా 2 నౌకల నిర్మాణ బాధ్యతలను ఎల్‌అండ్‌టికి ఇచ్చేయాలని, నాలుగో దశ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయం పట్ల షిప్‌యార్డు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
టెండర్ల ప్రక్రియ ఎలా ఉండబోతుంది?
రూ.8200 కోట్ల విలువైన 2 ఎఫ్‌ఎస్‌ఎస్‌ల నిర్మాణాన్ని నేరుగా ఎల్‌అండ్‌టికి ఇచ్చేస్తే విమర్శలు వస్తాయని భావించిన షిప్‌యార్డు యాజమాన్యం కొచ్చిన్‌ షిప్‌యార్డును ‘డమ్మీ’గా పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. నేరుగా ఒక ప్రయివేట్‌ కంపెనీకి షిప్‌యార్డులోని షిప్‌ల నిర్మాణ బాధ్యతలను ఇవ్వకూడదన్న నిబంధన వల్ల కొచ్చిన్‌ షిప్‌యార్డుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో షిప్‌యార్డు యాజమాన్యం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. కేంద్రం ఇంతలా ఉత్సాహం చూపడానికి కారణమూ లేకపోలేదు. ప్రధాని మోడీ సన్నిహితుడైన కార్పొరేట్‌ అదానీ… దేశంలోని కొచ్చిన్‌ షిప్‌యార్డులోకి ఇదివరకే ‘అదానీ హార్బర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌’ పేరుతో ప్రవేశించారు. దేశంలోని మేజర్‌ పోర్టులన్నిట్లోనూ అదానీ పోర్ట్స్‌ హార్బర్‌ సర్వీసెస్‌ తయారు చేసే గ్రీన్‌ టగ్లను వాడాలన్న నిబంధనను కేంద్రం 2023లోనే పెట్టింది. ఈ మేరకు కేంద్ర షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ నౌకల నిర్మాణ వ్యవహారాల్లో అదానీ గ్రూప్‌తో ఎంఒయు కూడా చేసుకున్నందున 5 ఎఫ్‌ఎస్‌ఎస్‌ల్లో ప్రస్తుతం రెండింటికి, తర్వాత మిగతా మూడింటికీ ఎసరొచ్చే ప్రమాదం ఉంది. ఈ దృష్ట్యా 2024లో నికర లాభ లక్ష్యం రూ.1000 కోట్లు షిప్‌యార్డుకు రాదన్నది స్పష్టమవుతోంది. దీంతో, షిప్‌యార్డు ఉద్యోగులు, కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మొత్తంగా 5 ఎఫ్‌ఎస్‌ఎస్‌లు నిర్మిస్తే వచ్చే రూ.19 వేల కోట్ల టర్నోవర్‌ సొమ్మును ప్రయివేట్‌ కార్పొరేట్‌ దోచుకోనున్నారనే చర్చ సాగుతోంది. ఎల్‌అండ్‌టికి ఇచ్చే రెండు షిప్‌ల నిర్మాణ టెండరు వ్యవహారంపై పోరాడేందుకు షిప్‌యార్డు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.

➡️