- ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ ముందుకు..
- 3 ఫ్లీట్ సపోర్టు షిప్‌ల్లో జులైలో నేవీకి ఒకటి అందజేసేందుకు సిద్ధం
- మరో రూ.3 వేల కోట్ల సబ్‌మెరైన్ ఆర్డరు
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్)కు త్వరలో మినీరత్న హోదా దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పుల్లేకుండా ప్రతి ఏటా రూ.100 కోట్ల మేర లాభాలు వస్తే ప్రభుత్వ రంగ సంస్థలకు మినీరత్న హోదా లభిస్తుంది. దేశంలో ముంబయి జిఆర్‌ఎస్, కొల్‌కతా, గోవా షిప్‌యార్డులకు ప్రస్తుతం ఆ హోదా ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో ఉందుకు సాగుతున్న హెచ్‌ఎస్‌ఎల్‌కు కూడా త్వరలో ఆ హోదా లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సుదీర్ఘకాలం పాటు నష్టాల్లో ఉన్న హెచ్‌ఎస్‌ఎల్ ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ మినీరత్న హోదా దక్కించుకోవడానికి శ్రమిస్తోంది. ఇందుకు ఉద్యోగులు, కార్మికులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పుష్కలంగా వర్క్ ఆర్డర్లు ఉంటే పూర్వవైభవం సాధ్యపడుతుందని వారు చెబుతున్నారు. గతంలో ఐదు ఫ్లీట్ సపోర్టు షిప్పుల నిర్మాణ పనుల్లో మూడింటిని మాత్రమే షిప్‌యార్డుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రెండింటిని ప్రయివేటు సంస్థ అయిన ఎల్‌అండ్‌టికి కట్టబెట్టింది. ఆ రెండు పనులు కూడా హెచ్‌ఎస్‌ఎల్‌కు ఇచ్చి ఉంటే మినీ రత్న హోదాను ఏడాది క్రితమే దాటేసేదని కార్మికులు, ఉద్యోగులు చెబుతున్నారు. తనకు వచ్చిన మూడు ఫ్లీట్ సపోర్టు షిప్పుల నిర్మాణ పనుల్లో ఒక షిప్ నిర్మాణ పనులు పూర్తి చేసి వచ్చే జులైలో నేవీకి అందజేసేందుకు హెచ్‌ఎస్‌ఎల్ సిద్ధమవుతోంది. షిప్‌యార్డులో అందుకు సంబంధించిన ట్రయల్స్ జరుగుతున్నాయి.
హిందుస్థాన్ షిప్‌యార్డులో ఏం జరుగుతోంది ?
హెచ్‌ఎస్‌ఎల్‌లో కార్గో, నేవీ నౌకలు, పోర్టు టగ్‌లు, కోస్ట్ గార్డ్ షిప్పులు, పాంటోన్స్, సబ్ మెరైన్ (జలాంతర్గాము)ల రిపేర్లు, రీఫిట్ పనులు జరుగుతున్నాయి. దేశ రక్షణ రంగానికి దశాబ్దాల తరబడి హెచ్‌ఎస్‌ఎల్ విశేష సేవలందిస్తోంది. 2020-21లో రూ.478 కోట్ల నుంచి ఒక్కసారిగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌ఎస్‌ఎల్ టర్నోవర్ రూ.1413 కోట్లకు పెరగడంతో మినీరత్న హోదాపై ఆశలు చిగురిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.1,586 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం (పిబిటి) రూ.295 కోట్లకు పెరిగింది.
దిగ్విజయంగా రిపేరు పనులు
మూడు ఫ్లీట్ సపోర్టు షిప్పుల నిర్మాణంతో పాటు సబ్ మెరైన్ సింధుకీర్తి రిపేర్ వర్క్ కూడా షిప్‌యార్డులో జరుగుతోంది. రూ.1000 కోట్ల వర్క్ ఆర్డర్ ఇది. మరో మూడు నెలల్లో పనులు పూర్తి చేసి ఇండియన్ నేవీకి దీన్ని అందించనున్నారు. మరో రూ.3 వేల కోట్లతో నేవీకి సంబంధించిన సబ్‌మెరైన్ పనులు కూడా నేవీ నుంచి రాబోతున్నాయి. ఈ క్రమంలో మినీరత్న హోదాకు సాధించే దిశగా హెచ్‌ఎస్‌ఎల్ సాగుతోంది.