ధర పతనంతో నష్టాలు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : గత నెలలో ఆశాజనకంగా ఉన్న రొయ్యల ధరలు ప్రస్తుతం ఒక్కసారిగా పతనమయ్యాయి. ఎగుమతులు లేవనే పేరుతో వ్యాపారులు సిండికేటై ధరలను తగ్గ్గించేశారని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 20.614 మంది రైతులు సుమారు 75 వేల ఎకరాల్లో రొయ్యలను సాగు చేస్తున్నారు. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 50 శాతం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో మిగిలిన 50 శాతం రొయ్యలు సాగవుతున్నాయి. గత నెలలో వంద కౌంట్‌కు రూ.255 ధర వచ్చింది. ప్రస్తుతం రూ.రూ.220 మించడంలేదు. 90 కౌంట్‌కు గత నెలలో రూ.265కి ధర లభించింది. ప్రస్తుతం రూ.235 మాత్రమే వస్తోంది. 80 కౌంట్ ధర గత నెలలో రూ.285 ఉంది. ప్రస్తుతం రూ.250కు పడిపోయింది. 70 కౌంట్ ధర రూ.325 నుంచి రూ.285, 60 కౌంట్ ధర రూ.345 నుంచి రూ.315కు కొనుగోలుదారులు తగ్గించేశారు. 50 కౌంట్ ధర రూ.375 నుంచి రూ.335కు పతనమైంది. 40 కౌంట్ ధర రూ.415 నుంచి రూ.350కు పడిపోయింది. జిల్లా నుంచి చైనా, యూరప్, కొరియా దేశాలకు రొయ్యలు ఎక్కువగా ఎగుమతులు జరుగుతున్నాయి. ఆక్వా రైతులను గత కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు నష్టాల బాట పట్టించాయి. గత నెలలో ఆశాజనక పరిస్థితులు నెలకొనడంతో ఉత్సాహంగా సాగు ప్రారంభించిన రైతులకు వేసవి సాగు కష్టాలు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రొయ్యల మేత ధరలు ఏటా పెరుగుతుండడం, ఆశాజనక ధర లభించకపోవడం వంటి వరుస పరిణామాలు గోరుచుట్టుపై రోకలి పోటులా మారాయి. ఈ నేపధ్యంలో ధరలు నిలకడగా లేకపోతే నష్టాలు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 280 వరకూ హేచరీలు ఉన్నాయి. హేజరీలు అధిక ధరకు నాసిరకం ఫీడ్‌ను అంటగడుస్తున్నాయి. దీన్ని చెరువుల్లో వేసిన పది రోజులకు రొయ్య పిల్లలు విపరీతంగా చనిపోతున్నాయి. వాటిల్లో కొన్ని బతికి బయట పడినా సమాన గ్రోత్ రావడం లేదు. వాటిని అమ్మకుందామంటే రొయ్యల ప్రాసెస్ కంపెనీ వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి దోచుకుంటున్నారు. మత్స్యశాఖ అధికారులు నెలకు రెండుసార్లు మేచరీలను పరిశీలించి ఆయా యజమానులకు నాణ్యమైన సీడ్ ఉత్పత్తులపై పలు సూచనలు సలహాలు ఇవ్వాలి. కొన్ని నెలలుగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. మరోవైపు రొయ్యలకు వినియోగించే మేత ప్రొ బయాటిక్స్, ఇతర మందుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
నెల రోజుల్లో రూ.60 ధర పతనం
రొయ్యల కొనుగోలుదారులు సిండికేట్‌గా ఏర్పడడంతో నెల రోజుల్లో 40 కౌంట్ ధర రూ.60 పతనమైంది. కారణమేంటని అడిగితే ఎగుమతులు జరగడం లేదని జవాబిస్తున్నారు. మరోవైపు రొయ్య పిల్లల ధరలు, ఫీడ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎకరా సాగుపై లక్ష వరకూ అదనపు భారం పడింది. ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. థరలు నిలకడగా ఉండేలా, ధర గిట్టుబాటు వచ్చేలా చర్యలు ,తీసుకోవాలి.
-వై.రాజారావు, ఐ.పోలవరం మండలం, వేమవరం గ్రామం