రైతు సేవా కేంద్రాల కుదింపు

  • రేషనలైజేషన్‌ పేరిట వేల సెంటర్లు రద్దు
  • సిబ్బంది మెడపై కత్తి
  • భవనాలు, మౌలిక సదుపాయాల ఖర్చు వృథా
  • వైసిపి ప్రభుత్వంలోనే కసరత్తు
  • పాత ఉత్తర్వులు బయటికి తీసిన టిడిపి కూటమి సర్కారు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : గత వైసిపి ప్రభుత్వం రైతుల కోసం గ్రామాల్లో నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) పేరును రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కె)గా మార్పు చేసిన టిడిపి కూటమి ప్రభుత్వం వాటిని తగ్గించేందుకు రంగం సిద్ధం చేసింది. వాటిలో పని చేసే సిబ్బంది పైనా కత్తి దూసింది. సిబ్బందిని అటూ ఇటూ మార్చి, అదనంగా ఉన్న వారిని వేరే కార్యక్రమాలకు కేటాయిస్తోంది. అక్కడికి ఇక్కడికి సర్దుబాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియకు హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌), క్రమ బద్ధీకరణ (స్ట్రీమ్‌లైనింగ్‌) అని చెబుతోంది. రాష్ట్రంలో 10,778 ఆర్‌ఎస్‌కెలు ఉండగా, రేషనలైజేషన్‌లో రెండు వేల వరకు రద్దు కానున్నాయని అంచనా. కాగా ఈ కసరత్తు గత ప్రభుత్వంలో నిరుడు ఖరీఫ్‌ సమయంలోనే మొదలైంది. కూటమి ప్రభుత్వం ఆర్‌కెఎస్‌ల సేవలను క్రమంగా తగ్గించాలని తలచింది. నేరుగా తామే ఆ పని చేస్తే రాజకీయంగా, ఉద్యోగుల పరంగా ఇబ్బందులొస్తాయని భావించి గతంలో వైసిపి సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను వ్యూహాత్మకంగా బయటికి తీసింది. ప్రస్తుత ఖరీఫ్‌ లోపు రేషనలైజేషన్‌ పూర్తి కావాలని గడువు విధించింది. అక్టోబర్‌ 29 డెడ్‌లైన్‌ విధిస్తూ గత మార్గ దర్శకాలను ఉటంకిస్తూ వ్యవసాయశాఖ కమిషనర్‌ కిందికి మెమో ఇచ్చారు. అప్పుడు కసరత్తు చేసి మధ్యలో నిలిపేసిన జాబితాలనే జిల్లా అధికారులు కమిషనర్‌కు పంపుతున్నట్లు సమాచారం.

హేతుబద్ధత శూన్యం
గతంలో ఒక్కో గ్రామ సచివాలయం పరిధిలో ఒక ఆర్‌ఎస్‌కె అనగా రేషనలైజేషన్‌ అనంతరం రెండు మూడు సచివాలయాలకు ఒకటి అవుతోంది. ఒక సచివాలయానికి ఒక కేంద్రం అని కూడా అంటున్నారు. అర్బన్‌లో, సెమీ అర్బన్‌లో, పెద్ద గ్రామ పంచాయతీలలో ఎన్ని వార్డు సెక్రటేరియట్‌లు ఉన్నా ఒక్క ఆర్‌ఎస్‌కెకి పరిమితం చేశారు. ఒక ఆర్‌ఎస్‌కె పరిధిలో సరాసరి మైదాన ప్రాంతాల్లో వెయ్యి-1,500 ఎకరాల విస్తీర్ణం, ఏజెన్సీలో 600-800 ఎకరాలుగా నిర్ణయించారు. కాగా ఈ గైడ్‌లైన్స్‌ చాలాచోట్ల గతంలో అమలు చేయలేదు. అత్యధికంగా 3 వేల ఎకరాల వరకు, అతి తక్కువ 600 ఎకరాలుగా పరిధులు నిర్ణయించారు. మార్గదర్శకాల ప్రకారం హార్టికల్చర్‌ పంటలు అత్యధికంగా ఉన్న చోట విలేజి హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ (విహెచ్‌ఎ), సెరీ కల్చర్‌ ఎక్కువుంటే విలేజి సెరీకల్చర్‌ అసిస్టెంట్‌ (విఎస్‌ఎ), మిగతాచోట్ల విలేజి అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ (విఎఎ)ని వేయాలి. కసరత్తులో పంటలతో నిమిత్తం లేకుండా సిబ్బందిని కేటాయించారు.

ఎంప్లాయీస్‌ ఆందోళన
సిబ్బంది హేతుబద్ధీకరణలో వివిఎ, విహెచ్‌ఎ, విఎస్‌ఎ, ఎఇఒ, ఎంపిఇఒలను పరిగణనలోకి తీసు కున్నారు. వివిఎలు 6,218, ఎఇఒలు 904, ఎంపిఇఒలు 1,396 వెరశి 8,518 మంది ఉన్నారు. వీరిలో ఎఇఒలను అగ్రి ల్యాబ్‌లకు వేయగా ఇంకా 357 మంది మిగులుతారు. వీరిని సచివాలయాల్లో సర్దుబాటు చేస్తారు. విహెచ్‌ఎలు 2,352 మంది, విఎస్‌ఎలు 374, హార్టికల్చర్‌ ఎంపిఇఒలు 77 మంది ఉన్నారు. ఇంకా కొన్ని కేంద్రాల్లో సిబ్బంది లేరు. అప్పట్లో ఎఇఒలు, ఎంపిఇఒలను వేశారు. రేషనలైజే షన్‌లో అర్బన్‌ ఆర్‌బికెలలో తప్పనిసరిగా ఎఇఒలు, ఎంపిఇఒలనే వేయాలని నిబంధన పెట్టారు. అదనపు సిబ్బందిని అవసరాలకనుగుణంగా సర్దుబాటు చేస్తామంటున్నారు. అయినప్పటికీ తమను ఉంచుతారా తీసేస్తారా అనే ఆందోళన సిబ్బందిలో బయలుదేరింది.

ప్రజాధనం వృథా
అన్ని హంగులతో ఆర్‌ఎస్‌కెలకు సొంత భవనాల నిర్మాణం గత ప్రభుత్వంలో చేపట్టారు. ఇప్పటికి 10 వేలకుపైన బిల్డింగ్‌ల కనస్ట్రక్షన్‌ మొదలు పెట్టగా, రెండు వేల వరకు పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. సగానికిపైన కేంద్రాలు ఇప్పటికీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వం నెలల పర్యంతం అద్దెలు బకాయి పడింది. కాగా రేషనలైజేషన్‌లో సొంత భవనం ఉన్న కేంద్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎత్తేసే వాటి కోసం చేపట్టిన నిర్మాణాలను ఏం చేస్తారనే ప్రశ్న వస్తోంది. అలానే వదిలేస్తే ఇప్పటికి చేసిన ఖర్చు చేసిన నిధులు వృథా అవుతాయి. అన్ని కేంద్రాల్లో కియోస్క్‌, టివి, కంప్యూటర్లు, విలువైన ఫర్నీచర్‌ ఏర్పాటుకు గతంలో బాగానే ఖర్చు చేశారు. ఒక్కొక్క కేంద్రంలో మౌలిక వసతులకు కనీసం రూ.10 లక్షల వరకు వ్యయం చేశారని అంచనా. కేంద్రాలను ఎత్తేస్తే విలువైన ఆ పరికరాల పరిస్థితేంటో అర్థం కాకుండా ఉంది. ఎరువుల గోదాముల్లో వాడుకోమంటున్నారని అధికారులు వెల్లడించారు.

➡️