- కంటి తుడుపు, కాలయాపన, పక్కదారి
- గత అనుభవం ఇదే
- బియ్యం స్మగ్లింగ్‌పైనా అదే ఎత్తుగడ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : కాకినాడ పోర్టు కేంద్రంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు మొత్తం వ్యవహారం నీరుగార్చే చర్యగా కనిపిస్తోంది. గతంలో ప్రభుత్వాలు వేసిన సిట్‌లు ఏ విధంగా కేసులను తాత్సారం చేశాయో బియ్యం స్మగ్లింగ్‌పైనా అదే దారి పడుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిట్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లోనే కాలయాపన ఉద్దేశం బయట పడింది. సిట్ విచారణకు నిర్ణీత గడువు విధించకుండా, ప్రతి పదిహేను రోజులకు పురోగతిపై నివేదిక ఇవ్వమన్నారు. దీన్నిబట్టి విచారణ ఇప్పుడప్పుడే తెమిలేది కాదని అర్థమవుతోంది. మరోవైపు సిట్ అధిపతి సిఐడి ఐజి వినిత్ బ్రిజ్‌లాల్ మాట్లాడుతూ తాము ఇప్పటికిప్పుడు హడావుడి పడాల్సిందేమీ లేదంటూ.. ప్రభుత్వం తమకు నిర్దేశించిన విధి విధానాల మేరకు అన్ని కోణాల్లో సమగ్రంగా విచారణ జరపాలంటే సమయం పడుతుందని వెల్లడించారు. ఈ అంశాలన్నీ బియ్యం స్మగ్లింగ్ కేసులను సాధ్యమైనంత వరకు సా..గదీసేందుకేనన్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.
డైవర్షన్ కోసం
సిట్, సిఐడి… ఏదైనా అప్పటికి వేడి తగ్గించేందుకు వేసే ఎత్తుగడని ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువైంది. ప్రభుత్వంలో ఉన్న వారు ప్రత్యర్ధులపై వ్యక్తిగత, రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు, కేసుల కాలయాపన కోసం అనే అభిప్రాయం రాష్ట్రంలో కొన్నేళ్లలో స్థిరపడిపోయింది. విశాఖ భూముల కుంభకోణంపై టిడిపి, వైసిపి రెండు ప్రభుత్వాలు వేసిన సిట్‌లు ఆ కోవలోకే వస్తాయి. అమరావతి రాజధానిలో భూముల ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై వేసిన సిట్ కూడా అటువంటిదే. ఇలా చెప్పుకుంటూ పోతే సిఐడి విచారణలు, సిట్ దర్యాప్తులు ఎలాంటి ముగింపు లేకుండా పోయాయి. ప్రస్తుత బియ్యం స్మగ్లింగ్ తంతు కూడా అలాగే అనిపిస్తోంది. నవంబర్ 29న డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో తనిఖీ చేసి పిడిఎస్ బియ్యం స్మగ్లింగ్ అవుతున్నాయని ప్రకటించగా, తదుపరి టిడిపి, జనసేన, వైసిపి మధ్య రాజకీయ విమర్శలు తీవ్ర స్థాయిలో నడిచాయి. కానీ బియ్యం స్మగ్లింగ్‌పై కూటమి ప్రభుత్వం నిర్దిష్ట చర్య తీసుకోలేదని, ఆయా పార్టీల నేతలు రాజీ పడ్డారన్న ఆరోపణలు రావడం వల్లనే వారం దాటాక ఎట్టకేలకు సర్కారు సిట్ వేసిందన్న చర్చ జరుగుతోంది.
అందుకే అనుమానం
పోర్టుల్లో ఎగుమతులు, దిగుమతులపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన కస్టమ్స్, డైరెక్టర్టేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) వంటి విభాగాల నిఘా ఉంటుంది. అక్రమ బియ్యం ఉన్నాయంటున్న స్టెల్లా నౌక సీజ్‌పై కస్టమ్స్ అధికారి ఏం చెబుతున్నారంటే… నౌకలో పలువురు ఎగుమతిదారుల పలు రకాల సరుకులుంటాయి. ఒక ఎక్స్‌పోర్టర్‌కు చెందిన అక్రమ బియ్యం ఉందని మొత్తం నౌకను సీజ్ చేయలేం. బియ్యం శాంపిల్స్ ల్యాబ్‌కు పంపాలి. పరీక్షల్లో పిడిఎస్ బియ్యం అని తేలితే ఆ సరుకును మాత్రమే సీజ్ చేయాల్సి ఉంటుంది. పరీక్షల ఫలితాలు రావడానికి కొన్ని వారాలు పడుతుంది.. అన్నారు. ఆయన ఇంకొక బాంబు పేల్చారు. ఎన్నికలకు ముందు విశాఖపట్నం పోర్టులో డ్రగ్స్ కంటైనర్ పట్టుబడిందని ప్రచారం జరగ్గా, సిబిఐ చేసిన పరీక్షల్లో అది మాదక ద్రవ్యం కాదని రిపోర్టు వచ్చిందని, అందుకే ఆ సరుకును విడుదల చేశామన్నారు. దొరికింది డ్రగ్స్‌గా డిఆర్‌ఐ, నార్కొ, కస్టమ్స్ అప్పట్లో నానా హడావుడి చేశాయి. చివరికి డ్రగ్స్ కాదని తేల్చారు. నిజంగానే డ్రగ్స్ కాదా? లేకపోతే కేంద్రంలోని మోడీ సర్కారు తిమ్మినిబమ్మిని చేసిందో తెలీదు. ఈ పూర్వరంగంలో బియ్యం స్మగ్లింగ్ కథ కూడా అంతేనన్న సందేహాలొస్తున్నాయి. ఇప్పటికే బియ్యం స్మగ్లింగ్ వ్యవస్థీకృతమైందని, కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, మిల్లర్లు, ఎక్స్‌పోర్టర్లు… ఇలా అక్టోపస్ మాదిరి మాఫియా కార్యకలాపాలు విస్తరించాయని ప్రభుత్వమే చెబుతోంది. టిడిపి, జనసేన, వైసిపి నాయకులకు ప్రత్యక్ష పరోక్ష సంబంధాలున్నాయని ఆరోపణలొస్తున్నాయి. ఆయా పార్టీల్లోని ముఖ్య నాయకుల మధ్య ఆధిపత్య, కమీషన్ల, లాలూచీ వ్యవహారాలు నడుస్తున్నాయని చర్చ జరుగుతోంది. ఒకరి ప్రయోజనాలను మరొకరు దెబ్బతీయడం, పై చేయి సాధించడం, కేసుల నుంచి బయట పడటం.. ఈ లక్ష్యంగా పని చేస్తున్నారని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో సిట్ విచారణతో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే !