ఇళ్లకు స్మార్ట్‌ మీటర్లు!

  • డిసెంబర్‌ నుంచి ఏర్పాటుకు సన్నాహాలు
  • ‘అదాని’ సిబ్బందికి గుంటూరులో ఇంటర్వ్యూలు
  • 22న రాజమండ్రిలో కాంట్రాక్టు ఏజన్సీ నిర్వహణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో విద్యుత్‌ సంస్కరణల అమలు ప్రక్రియ వేగవంతమౌతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్‌ మీటర్లను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం దానికి భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. దీనిలో భాగంగా ప్రజానీకం వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇళ్లకు స్మార్ట్‌ మీటర్లను బిగించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చేపడుతోంది. డిసెంబర్‌ నుండి ఈ మీటర్లను ఇళ్లకు బిగించడానికి సన్నాహాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ డిస్కామ్‌లకు ఇప్పటికే అదాని స్మార్ట్‌ మీటర్లు చేరిన సంగతి తెలిసిందే. ఈ మీటర్లు కొద్ది రోజుల క్రితం విజయవాడలోని విద్యుత్‌ సౌధకు వచ్చినప్పుడు సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు నిరసన తెలిపారు. తాజాగా ప్రభుత్వం ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. స్మార్ట్‌ మీటర్లు బిగించేందుకు ఏడాది కాంట్రాక్టు పేరుతో టాలెంట్‌ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కన్సల్టెన్సీ సంస్థ గుంటూరులో నియామక ప్రక్రియ చేపట్టింది. విషయం తెలుసుకున్న ప్రజాశక్తి ప్రతినిధి అక్కడకు వెళ్లి ఆరా తీయగా తమకేమీ తెలియదని, అదానీ కంపెనీ నుండి అందిన ఆదేశాల మేరకు, వారి కోసం ఏడాది కాంట్రాక్టుకు సిబ్బందిని తీసుకుంటున్నామని చెప్పారు. విద్యుత్‌ శాఖకు వీరిని అప్పగించనున్నట్లు తెలిపారు. స్మార్ట్‌ మీటర్ల బిగింపు ప్రక్రియ కోసం వీరిని తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎల్‌టి, హెచ్‌టిలతోపాటు ట్రాన్స్‌ఫార్మర్లను కూడా బిగించేందుకు అనుభవం ఉన్న వారికోసం ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు చెప్పారు. శనివారం గుంటూరు, సిఆర్‌డిఏ, విజయవాడ, ఒంగోలు జిల్లాలకు అవసరమైన సిబ్బందికి ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. ఇపిడిసిఎల్‌ పరిధిలోని రాజమండ్రిలో ఈ నెల 22వ తేదిన నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో ప్రయోగాత్మకంగా మీటర్ల బిగింపు పనులను వీరు చేపట్టనున్నార. వీరందరూ కూడా శాశ్వత విద్యుత్‌ ఉద్యోగుల పర్యవేక్షణలోనే చేస్తారనీ వివరించారు. అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకునే వర్కర్లకు రూ.24 వేలు, సూపర్‌వైజర్లకు రూ.45 వేల ప్రారంభ వేతనం ఇవ్వనున్నారు. వీరందరికీ డిసెంబర్‌ ఒకటోతేదీ నుండి విధుల్లోకి హాజరవ్వాలని కన్సల్టెన్సీ ప్రతినిధులు సూచిస్తున్నారు. అప్పటి నుండి తొలివిడతలో సర్వేచేయడం, తదనంతరం మీటర్లు మార్చడం వంటి పనులు ఉంటాయనీ తెలిపింది. ఒక్కొక్కరు రోజుకు ఎన్నిమీటర్లు పెట్టాలనేది కూడా టార్గెట్‌ ఉంటుందని పేర్కొన్నారు.

➡️