ప్రజా సమస్యలే.. ఊపిరిగా : జొన్న శివశంకర్‌

ప్రజాశక్తి – మంగళగిరి : ఇండియా వేదిక బలపరిచిన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థిగా జొన్నా శివశంకరరావు పోటీ చేస్తున్నారు. పేద రైతు కుటుంబంలో 1955లో జన్మించిన జొన్నా శివశంకరరావు విద్యార్థి సంఘం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐలో చురుగ్గా పనిచేస్తూ పిఎన్‌ఎం కళాకారుడిగా, యువజన సంఘం నాయకులుగా ఎదిగారు. 1980లో సిపిఎం సభ్యులయ్యారు. ఉద్యమ పోరాట సమయంలో ఆరు నెలలపాటు రహస్య జీవనం కొనసాగించారు. మూడు నెలలపాటు జైలు జీవితం గడిపారు. ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసే జొన్నా శివశంకరరావు రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, పసుపు రైతు రాష్ట్ర సంఘం కన్వీనర్‌గా అనేక ఉద్యమాలను నడిపారు. 1981 నుంచి 2001 వరకు ఉండవల్లి గ్రామ సర్పంచుగా 20 ఏళ్లు పనిచేశారు. సిపిఎం గుంటూరు ఉమ్మడి జిల్లాలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా, తాడేపల్లి సిపిఎం డివిజన్‌ కార్యదర్శిగా పనిచేశారు.

ప్రజా సమస్యలపై పోరాటం
పేదల ఇళ్ల స్థలాల కోసం ఉద్యమించి 6 వేల మందికి ఇళ్ల స్థలాలు సాధించి, ఇళ్లు కట్టించడంలో కీలకపాత్ర పోషించారు. పెదవడ్లపూడి హైలెవెల్‌ ఛానల్‌ పూర్తి చేయాలని ఆందోళన చేశారు. కొండవీటి వాగులో తూటికాడ, గుర్రపు డెక్క తొలగించాలని ఆందోళన చేశారు. తెనాలి డెల్టా కాల్వల ఆధునీకరణ పనులు చేపట్టాలని, తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ఆందోళనలు చేశారు. పెంచిన ఇంటి పన్ను, చెత్త పన్ను తగ్గించాలని, విద్యుత్‌ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా, నిత్యావసరాల ధరల పెరుగుదలపై, రైతు సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తున్నారు.

20 ఏళ్ల సర్పంచుగా శివశంకర్‌ కృషి
నియోజకవర్గ పరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు సర్పంచుగా పనిచేసిన కాలంలో విశేష కృషి చేశారు. సత్రంలో అద్దెకుంటున్న పంచాయతీకి సొంత బిల్డింగు ఏర్పాటుచేశారు. రోడ్లు, డొంకలు, సైడ్‌ కాలువలు, లైట్లు వేయించారు. ప్రధానంగా దళితవాడలో స్కూల్‌ బిల్డింగు, పంపులు, వీధిలైట్లు వేయించి వెలుగులు నింపారు. అమరారెడ్డి నగర్‌, బాపనయ్య నగర్‌, పిడబ్ల్యుడి కరకట్ట, కుమ్మరి కుంట తదితర చోట్ల ఇళ్లు వేయించి మౌలిక సౌకర్యాలు కల్పించారు. 1998లో వరదలు వచ్చినప్పుడు గ్రామ సర్పంచుగా స్వయంగా ఆయనే దిగి వరద సహాయక చర్యలు చేపట్టారు. గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా మతాలకు, రాజకీయాలకు అతీతంగా సమస్యను పరిష్కరించడంలో ముందున్నారు.

➡️