పోర్టు ఆస్తుల ప్రైవేటీకరణ చర్యలు వేగవంతం

గోల్డెన్‌ జూబ్లీ హాస్పిటల్‌కు రీ టెండర్‌
160 రోజులుగా పిపిపిపై పోరాడుతున్న ఉద్యోగులు, కార్మికులు
పట్టించుకోని విపిటి యాజమాన్యం
ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖపట్నం పోర్టు అథారిటీ (విపిటి) యాజమాన్యం పోర్టు ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టే చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే విశాఖ నగరంలోని శాలిగ్రాంపురంలోగల రూ.450 కోట్ల విలువైన 17 ఎకరాల పోర్టు భూములను 30 ఏళ్ల పాటు రహేజా ఇనార్బిట్‌ మాల్‌కు కేవలం రూ.125 కోట్లకే కట్టబెట్టింది. పోర్టు కల్యాణ మండపం, ఇండోర్‌, అవుట్‌ డోర్‌ స్టేడియాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చేసింది. తాజాగా ఈ నెల మూడున పోర్టుకు చెందిన నగరం నడిబడ్డునగల ఎకరన్నర స్థలంలో ఉన్న గోల్డెన్‌ జూబ్లీ హాస్పిటల్‌కు రీ టెండర్లను పిలిచింది. దీంతో, ఉద్యోగులు, కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వాస్తవానికి కొద్ది నెలల క్రితమే ఈ ఆస్పత్రిని పిపిపికి కట్టబెట్టాలని పోర్టు యాజమాన్యం చూసింది. దీన్ని వ్యతిరేకిస్తూ 160 రోజులుగా పోర్టు ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, అధికారులు, కార్మికులు పోరాడుతున్నారు. రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ టెండర్‌ కొనసాగింపును తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు రెండు నెలల క్రితం పోర్టు అధికారుల బోర్డు సమావేశంలో ప్రకటించారు. పిపిపి టెండర్‌ను పూర్తిగా రద్దు చేయాలని పోరాటం కొనసాగుతున్న క్రమంలో కొద్ది రోజులు నిశ్శబ్దంగా ఉన్న పోర్టు ఉన్నతాధికారులు తాజాగా రీ టెండరు పిలవడంతో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1933లో ప్రభుత్వ రంగంలో ఈ ఓడ రేవు ఏర్పడింది. 5,700 ఎకరాలు భూములు ఉండేవి. తాజాగా భూములన్నిటినీ ప్రైవేట్‌వారి చేతుల్లో పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని పోర్టు ఉన్నతాధికారులు అమలు చేస్తూ వస్తున్నారు.

ఎంతో విశిష్టం…
ప్రస్తుతం ఎకరన్నర స్థలంలో పోర్టు గోల్డెన్‌ జూబ్లీ హాస్పిటల్‌ 80 పడకలతో ఉంది. దీని చుట్టూ మరో నాలుగు ఎకరాల వరకూ పోర్టు భూములు ఉన్నాయి. 150 పడకలకు విస్తరించాలనేది లక్ష్యం. తాజాగా రూ.261 కోట్లకు పిపిపిలో ఇచ్చేందుకు రీ టెండర్‌ను పోర్టు అథారిటీ అధికారులు పిలిచారు. ఆస్పత్రిని పోర్టు స్వయంగా నిర్వహించాలని, లేనిపక్షంలో 40 వేల మంది ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు నష్టం జరుగుతుందని పోర్టు కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. ప్రస్తుతం 80 పడకలతో సమర్థవంతంగానే పోర్టు అండ్‌ డాక్‌ అధికారులకు, ఉద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులకు, పూల్‌ కళాసీలకు, కార్గో హ్యాండ్లింగ్‌ డివిజన్‌ కార్మికులకు, సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి ఈ ఆస్పత్రిలో సేవలందుతున్నాయి. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామంటూ పోర్టు యాజమాన్యం దీన్ని ప్రైవేట్‌ చేతుల్లోకి పెట్టే విధానంతో కదులుతోంది. పోర్టు ఆస్పత్రి స్థలం విలువ బహిరంగ మార్కెట్లో వెయ్యి కోట్ల రూపాయల పైమాటే. పోర్టు ఏటా సరుకు రవాణా ద్వారా రూ.500 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. ఈ ఆస్పత్రిని నిర్వహించే ఆర్థిక సామర్థ్యం పోర్టుకు ఉన్నా పిపిపికి కట్టబెట్టాలని చూడడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారులు ఏమంటున్నారంటే…
పిపిపికి ఆస్పత్రిని ఇచ్చినా నియంత్రణ పోర్టుదే ఉంటుందని విపిటి మెటీరియల్స్‌ మేనేజర్‌ రామ్‌ప్రసాద్‌ తెలిపారు. 300 పడకలకు విస్తరించేందుకు డిజైన్‌ బిల్ట్‌ ఫైనాన్స్‌ ఆపరేట్‌ అండ్‌ ట్రాన్సఫర్‌ (డిబిఎఫ్‌ఒటి) విధానంలో ఈ ఆస్పత్రిని ఇస్తున్నామని చెప్పారు. ఈ పిపిపి ప్రాజెక్టు మానటరింగ్‌ కోసం ఇద్దరు కార్మిక సంఘాల నాయకులు ఉంటారని తెలిపారు. ఏటా రూ.18 కోట్లు రిఫరల్‌ ఖర్చులను బయట కార్పొరేట్‌ ఆస్పత్రులకు చెల్లిస్తున్నామని చెప్పారు. పిపిపిలో ఈ ఆస్పత్రి పూర్తయితే ఇవే సౌకర్యాలు పోర్టు ఆస్పత్రిలో ఉద్యోగులు పొందవచ్చని తెలిపారు.

➡️