అడుగంటిన శ్రీశైలం

  • డెడ్‌ స్టోరేజీకి చేరువలో నీటి నిల్వ
  • గత నెలలోనే హంద్రీనీవాకు నీరు నిలిపివేత

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటాయి. జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టిఎంసిలు కాగా ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వ 38.6850 టిఎంసిలకు పడిపోయింది. జలాశయ డెడ్‌ స్టోరేజీ 34 టిఎంసిలు కాగా మిగిలిన 4.6850 టిఎంసిలను మాత్రమే వాడుకునేందుకు వీలుంది. ఇప్పటికే విద్యుదుత్పత్తి రూపంలో తెలంగాణ 358.94 టిఎంసిలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 199.38 టిఎంసిలను కలిపి మొత్తం 558.32 టిఎంసిల నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు వదిలేశాయి. అవి కాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా 240 టిఎంసిలను పెన్నా బేసిన్‌కు తరలించారు. హంద్రీనీవా, గాలేరు నగరి, ముచ్చుమర్రి, మల్యాల తదితర ఎత్తిపోతల పథకాలతో కలిపి ఇప్పటి వరకు శ్రీశైలం నుంచి 646 టిఎంసిల నీటిని విడుదల చేశారు. గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లాయి. గత ఏడాది అక్టోబర్‌ 25 నాటికి శ్రీశైలం రిజర్వాయర్‌ 215 టిఎంసిలతో కళకళలాడింది. ప్రస్తుతం వేసవి రాకముందే పరిస్థితి తారుమారవుతోంది. శ్రీశైలం జలాశయ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా జలాశయ నీటి మట్టం 810 అడుగుల వరకు ఉంటే హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి నీటిని తీసుకోవచ్చు. అయినా అధికారులు 845 అడుగులు ఉన్నప్పుడే హంద్రీనీవా కాల్వకు నీటి సరఫరా ఆపేశారు. కర్నూలు జిల్లాలో హంద్రీనీవా ప్రధాన కాల్వ వెంట నందికొట్కూరు నుంచి పత్తికొండ వరకు రైతులు రబీలో పంటలు వేశారు. నీటిని ఆపేయడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో వేరుశనగ, మిరప, కూరగాయల సాగు చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కసాపురం నుంచి జీడిపల్లి వరకు 20 వేల ఎకరాలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఇరు రాష్ట్రాలు విద్యుద్పత్తి పేరిట పోటీపడి దిగువకు నీటి విడుదల చేస్తుండడంపై పర్యావరణవేత్తలు, సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణుల మనుగడకు అవసరమైన మేరకు జలాశయంలో నిల్వలు ఉండేలా చూడాలంటున్నారు.

తుంగభద్రలోనూ తగ్గిన నీటి నిల్వ

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు నీటిని అందించే తుంగభద్ర జలాశయంలోనూ వేసవి రాకముందే నీటి నిల్వలు తగ్గుతున్నాయి. తుంగభద్ర జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 105.473 టిఎంసిలు కాగా ప్రసుత్తం 7.11 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది. జలాశయ గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1584.67 అడుగులకు చేరింది. గతేడాది ఆగస్టు 11న తుంగభద్ర డ్యామ్‌ 19వ గేట్‌ ప్రమాదవశాత్తు కొట్టుకుపోయింది. దాంతో దాదాపు 40 టిఎంసిల వరకు నీరు వృథాగా పోయింది.

➡️