నాగర్‌నార్‌కు ఉక్కు ఉద్యోగులు

  • విశాఖలో రహస్యంగా ఇంటర్వ్యూలు
  • ‘మ్యాన్‌పవర్‌’ పై అడ్డంగా దొరికిన మోడీ సర్కారు

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం సాగిస్తున్న కుట్రలు తేటతెల్లమవుతున్నాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నాగర్‌నార్‌ నుంచి 30 మంది అధికారులను పంపించి గడిచిన రెండు రోజులుగా స్టీల్‌ప్లాంట్‌లోని ఉద్యోగులకు నగరంలోని కొన్ని హోటళ్లల్లో రహస్యంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. సుమారు 44 మందిని నాగర్‌నార్‌ పంపించేందుకు ఎంపిక చేసినట్టు స్పష్టమవుతోంది. మరికొద్ది రోజుల్లోనే 500 మందిని ఇంటర్వ్యూ చేసి ఇక్కడి నుంచి పట్టుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఎన్ని టన్నులకు ఎంతమంది కార్మికులుండాలి ?
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే సెయిల్‌లో 19.63 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి ఏటా జరుగుతోంది. సెయిల్‌లో 54,840 మంది ఉద్యోగులు ఉత్పత్తిలో భాగస్వామ్యం అవుతున్నారు. విశాఖ ఉక్కులో ఏటా 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తికి గాను 20,393 మంది కార్మికులు ఉండాలి. కానీ 12,300 మంది మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఢిల్లీ పెద్దలు విశాఖ ఉక్కులో అత్యధిక మంది ఉద్యోగులు ఉన్నారన్న వాదనను కూటమి సర్కారు అదేపనిగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. సెయిల్‌లో ఉద్యోగుల సంఖ్య, ఉత్పత్తి జరుగుతున్న తీరును బట్టి చూసినా ఒక మిలియన్‌ టన్నుకు 2793 మంది ఉండాలి. ఈ లెక్కన విశాఖ ఉక్కులో సుమారు ఎనిమిది వేల మంది కార్మికుల కొరత ఉంది. 2002 -2013 మధ్య కాలంలో సరిపడా ఉద్యోగులు సుమారు 20,393 మంది ఉన్నప్పుడు విశాఖ ఉక్కు అన్ని సంవత్సరాలూ నిరాటంకంగా ఏటా రూ.12 వేల కోట్లు నగదు లాభాలు ఆర్జించింది. 12,300 మంది ఉద్యోగుల్లో 2500 మందికి విఆర్‌ఎస్‌ ఇచ్చేయాలని, 500 మందిని నాగర్‌నార్‌కు పంపించేయాలనే కుట్రలను కేంద్రం సాగిస్తోంది. ఇంకొంతమందిని సెయిల్‌కు పంపనున్నట్టు సమాచారం.

ఇదంతా దేనికోసం? : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
విశాఖ ఉక్కు నుంచి అందరినీ  పంపించేసి ప్రైవేట్‌ వ్యక్తులకు ప్లాంట్‌ను కట్టబెడతారా? అంటూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్‌ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. కూటమి పార్టీలు, సిఎం చంద్రబాబు ఇప్పటికైనా కేంద్ర పాలకులపై ఉక్కు రక్షణ కోసం ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారు ఉక్కుపై విషం కక్కుతూ ఇంకా ఆరు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించాలనే కుట్రకు పాల్పడుతోందన్నారు. రోజుకు 21 వేల టన్నులు హాట్‌మెటల్‌ బయటకు రావాల్సి ఉన్నా బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు రెండు మూసెయ్యడం, రా మెటీరియల్‌ లేకపోవడంతో రోజుకు 4500 టన్నులే మెటల్‌ వస్తుందని ఆందోళన చెందారు. తప్పుడు నివేదికలతో విశాఖ ఉక్కు కార్మికుల పొట్టకొట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.

➡️