బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీ అప్పగించే కుట్ర
ఆరోగ్య మిత్రల సర్వీసుకు ఎసరు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : వైద్య మిత్రల మెడపై కూటమి ప్రభుత్వం కత్తి పెట్టింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తాజా విధానంతో సర్వీసుకు ఎసరు పెట్టేలా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కాస్‌ను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్ నుంచి కొత్త విధానం అమలులోకి రానుందనే ప్రచారం జోరందుకుంది. దీంతో వైద్య మిత్రలలో ఆందోళన నెలకొంది. జిల్లాలో ఈ పథకం ద్వారా 90 ఆస్పత్రులలో రోగులకు సేవలందిస్తున్నాయి. వాటిలో ప్రభుత్వ ఆస్పత్రులు 36 కాగా, ప్రైవేట్ ఆస్పత్రులు 39, ఇహెచ్‌ఎస్ 15 ఆస్పత్రులు ఉన్నాయి. జిల్లా కో ఆర్డినేటర్ మినహా సుమారు 60 మంది వివిద దశలలో సేవలందిస్తున్నారు. వీరిలో 60 శాతం మంది 15 ఏళ్లకు పైగా సేవలు అందిస్తున్నారు. వైద్య సేవకులను బీమా కంపెనీల చేతిలో పెడితే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని సర్వీసు నష్టపోతామని వైద్య మిత్రలు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ విభాగంలో పని చేసిన ఉద్యోగులను ఆప్కాస్ (ఎపి కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్) కిందకు చేర్చారు. వారికి సిఎఫ్‌ఎంఎస్ ఐడి ద్వారా ప్రతి నెలా 5వ తేదీ లోపు జీతాలు ఇచ్చారు. ఇఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించారు. సిఎఫ్‌ఎంఎస్ వేతనం తీసుకోవడంతో తమ ఉద్యోగాలకు భద్రత ఉంటుందన్న ఆశతో ఇన్నాళ్లుగా ఉద్యోగాలు చేసుకుంటు న్నారు. ప్రస్తు తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్య సేవను ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించే కుట్ర జరుగుతుండటంతో ఉద్యోగ భద్రతపై వైద్య మిత్రలు ఆందోళనకు గురవుతున్నారు. రోగు లు వైద్య శాలల్లో చేరినప్పటి నుంచి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే వరకూ వైద్య మిత్రలు పర్యవేక్షి స్తుంటారు. పేద రోగులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ సేవలు అందిస్తుంటారు. వీరితో పాటు ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్ కార్డులు, ఆరోగ్య రక్ష స్కీమ్‌కు సంబంధించి వివరాలు తెలియజేస్తుంటారు. ఇలా అన్ని విభాగాల్లో 15 ఏళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు వయసు కూడా చాలా మందికి 50 ఏళ్లు దాటింది. ఆరోగ్యశ్రీ ప్రైవేటు చేతిల్లోకి వెళితే ఎవరిని ఉంచుతారో ఎవరిని తొలగిస్తారోననే ఆందోళన వ్యక్తమవుతోంది. తమను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తు న్నారు. ఫీల్డ్ సిబ్బందికి అంతర్గత ప్రమోషన్లు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగాలకు వెయిటేజీ ఇవ్వాలని, చనిపోయిన సిబ్బందికి రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, గ్రాట్యుటీ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
దశలవారీగా ఆందోళనలు
జిఒ నెం.28 రద్దు చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దశలవారీ ఆందోళనలు చేపడుతున్నాం. ఈ నెల 10, 17, 24 తేదీలలో సేవలు నిలిపివేసి జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయం ఎదుట శాంతి యుతంగా నిరసన చేపట్టనున్నాం. అనేక ఒడిదుడుకుల మధ్య ఏళ్ల తరబడి పని చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని బీమా కంపెనీలలో చేరుస్తారని చెబుతున్నారు. ప్రభుత్వం వైద్య మిత్రలకు న్యాయం చేయాలి. జీత భత్యాలు పెంచాలి. జిఒ నెం.28ను రద్దు చేయాలి. కాంట్రాక్టులోకి తీసుకోవాలి.
– ఎం.శాంతి, ఎపి వైద్య మిత్ర ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు.