- మరమ్మతుకు గురైన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్
- పైపుల్లేక నిరుపయోగంగా వాటర్‌ట్యాంక్
- రెండేళ్లుగా పనిచేయని బోర్లు
- పొలాల నుంచి రెండు కిలోమీటర్ల మోత
ప్రజాశక్తి – కెవిబిపురం : దళితవాడలన్నా, తండాలన్నీ అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకూ చులకనే.. మీటింగుల్లో చెప్పే మాటలన్నీ వారికోసమే అన్నట్లుగా మాట్లాడతారు.. తీరా మౌలిక వసతుల కల్పనలో అంతులేని నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటారు.. రెండు నెలలుగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుకు గురైతే అధికారులు, పాలకులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో దీన్నిబట్టి అర్ధమవుతుంది. పొలాల నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం తాగునీరు మోసుకుని పోవాల్సి వస్తుందని మహిళలు వాపోతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతుండడంతో కెవిబిపురం మండలంలోని మారుమూల ప్రాంతమైన కల్లూరు గ్రామస్తుల తాగునీటి అవస్థలు వర్ణనాతీతం.
కల్లూరు గ్రామంలో 180 కుటుంబాలు ఉన్నాయి. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుకు గురై రెండు నెలలు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదు. వీరంతా రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు. ఉదయం నిద్రలేచి పనులు పూర్తి చేసుకుని కూలి పనులకు వెళ్లి సాయంత్రం గూటికిచేరుకుంటారు. ఇంటికి వస్తే తాగడానికి గుక్కెడు నీరు ఉండదు. దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ పొలాల నుంచి వీరు తాగునీరు తెచ్చుకోవడం గమనార్హం.
కొత్తూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. పైపులు అమర్చడం మరిచారు. విద్యుత్ మోటారు నీరు అవసరాలకు వాడుకోవడానికి తప్ప దాహం తీర్చుకోడానికి ఒక్కచుక్క కూడా పనికిరాదు. ప్రజల దాహం తీర్చడానికి దాదాపు ఆరు బోర్లు ఉన్నప్పటికీ వాటిలో ఒక్క చేతి బోరు తప్ప, మిగతా ఐదు బోర్లు మరమ్మతుకు గురై రెండేళ్లయ్యింది. దీంతో తాగునీటి కోసం రెండు కిలోమీటర్ల దూరంలోని పొలాలకు వెళుతున్నారు. రెండేళ్లుగా అనేకమార్లు అధికారులకు తమ గోడు వినిపిస్తున్నా ఏ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదన్నది వారి ఆవేదన. ఇకనైనా పాలకులు స్పందించి కొత్తూరు గ్రామస్తుల తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
పొలాల వద్దకు వెళ్లాల్సిందే : కన్నయ్య, గ్రామస్తుడు
తాగునీటి బోర్లు మరమ్మతుకు గురికావడంతో నీటి కోసం మహిళలు, పిల్లలు, పెద్దలు ఆమడదూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు స్పందించి తాగునీటి బోర్లకు మరమ్మతులు చేస్తే మా దాహార్తి తీరుతుంది. లేదంటే మండు వేసవిలో మా తిప్పలు అన్నీఇన్నీ కావు.
అధికారులకు చెప్పినా పట్టించుకోరు : శోభన్‌బాబు, గ్రామస్తుడు
తాగునీటి మోటారుకు సప్లై చేస్తున్న ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి రెండు నెలలయ్యింది. ఈ విషయాన్ని పంచాయతీ, విద్యుత్ అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు. గ్రామంలోని మహిళలు తాగడానికి నీరు తెచ్చుకోవాలంటే రెండు కిలోమీటర్ల దూరం నుంచి బిందెలు మోసుకుని రావాల్సిందే. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ వేసి తాగునీటి సౌకర్యం కల్పించాలి.